క్లినిక్‌లు నిర్వహిస్తే చర్యలు
ప్రభుత్వ వైద్యులకు మంత్రి హెచ్చరిక
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ప్రైవేట్ క్లినిక్‌లను నిర్వహించే ప్రభుత్వ వైద్యులపై చర్యలు తీసుకుంటామని ఆరోగ్య శాఖ మంత్రి యూటీ. ఖాదర్ హెచ్చరించారు. హాసనలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన సేవలు అందించకుండా, ప్రైవేట్ క్లినిక్‌ల నిర్వహణ ద్వారా సంపాదించాలని చూస్తే ఊరుకోబోమని అన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల కొరత నిజమేనని అంగీకరిస్తూ, కొత్త నియామకాలకు చర్యలు చేపడతామని చెప్పారు. వచ్చే మూడేళ్లలో వైద్యుల కొరత లేకుండా చూస్తామని తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో స్వచ్ఛతను పాటించడానికి మేనేజ్మెంట్ వ్యవస్థను అమల్లోకి తెస్తామని వెల్లడించారు.
ప్రభుత్వ వైద్యులు విధిగా రెండేళ్ల పాటు గ్రామీణ సేవలను అందించాలనే నిబంధన విధించాలని యోచిస్తున్నామని, దీనికి కేంద్ర న్యాయ శాఖ అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. కాగా జేడీఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడానికి ప్రయత్నించడం లేదని చెప్పారు. అయితే వారే జేడీఎస్‌ను వీడే యోచనలో ఉన్నారని తెలిపారు. దీనిపై ఆ పార్టీ ఆత్మావలోకనం చేసుకోవాలని ఆయన సూచించారు.