YV Ramana
-
మన కాలపు హీరోలదే రిపబ్లిక్ డే
‘భారత దేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమించుచున్నాను’ అంటూ మొదలుపెట్టి ‘నా దేశంపట్ల, ప్రజల పట్ల సేవానిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయోభివృద్ధులే నా ఆనం దానికి మూలం’ అంటూ ముగించే ఆ ప్రతిజ్ఞ ప్రతి రోజూ స్కూల్లో, చదువుకునే రోజుల్లో మనందరం నేర్చుకున్నదే! ఔను... ప్రతిజ్ఞలైనా, వాగ్దానాలైనా చేయడం తేలిక. నిలబెట్టుకోవడమే కష్టం. ప్రస్తుతం మనం 67వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఒక్కసారి ఈ ప్రతిజ్ఞ చేసిన మన భారతీయ సహోదరులు ఏం చేస్తున్నారో చూద్దాం. ఒకడు సిగ్నల్ లైట్స్ దగ్గర అడుక్కు తింటుంటే మరొకరు సైబర్ క్రైమ్ చేసి దొరికి పోతున్నాడు. ఇంకో సోదరుడు మాతృదేవతను వీలుంటే చంపేసో, వృద్ధాశ్రమంలో వదిలేసో.. భూమిని మాత్రమే ప్రేమిస్తున్నాడు. ఇంకో సోదరుడు కనబడిన ప్రతి గుడినీ, గోపురాన్ని దర్శించుకుంటూ చేసిన పాపాల్ని ప్రక్షాళన చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడు. ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే చాలు.. మరికొందరు సోదరులు టీమ్‌వర్క్‌తో సామూహిక అత్యాచారాలు చేసుకుంటూ పోతు న్నారు. గాంధీ పుట్టిన దేశంలో గజానికో గాంధారి కొడుకు పుడుతూనే ఉన్నాడు. కానీ ఇది కేవలం ఒక భాగం మాత్రమే. కళ్లెదుట ముసురుకున్న ఈ కటిక చీకట్లను ఛేదించుకుంటూ కొత్త కాంతుల్ని ప్రసరింప చెయ్యడానికి ఈ దేశం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. ఈ విజయ ప్రస్థానానికి మూలం వర్తమానం లో లేదు. ఎందరో మహాత్ములు వాళ్ల స్వేదంతో, రక్తంతో ఈ మట్టిని పునీతం చేశారు. భగత్‌సింగ్, అల్లూరి, టంగుటూరి, జతీంద్రనాధ్ దాస్, ఖుదీ రామ్ బోస్, మేడం భికాజీ, బేగం హజ్రత్, ఝాన్సీ లక్ష్మీబాయ్, దుర్గావతీ దేవి, అష్పాఖుల్లా ఖాన్, బాలగంగాధర తిలక్, లాలాలజపతిరాయ్, రాజ్‌గురు, నేతాజీ, కొమురం భీం వంటి వారు మన మట్టిని సుసంపన్నం చేసిన త్యాగధనులు. ఇది గతం. కానీ వర్తమానంలో జరుగుతున్న అకృత్యాలకు చరమగీతం పాడటానికి కూడా ఎక్కడో ఒక చోట, ప్రతిరోజూ ఎవరిదో ఒక స్వరం బలహీనంగా అయినా వినపడుతూనే ఉంది. మైనస్ 60 డిగ్రీల చలిలో, సియాచిన్ లాంటి చోట నిరంతరం పహారా కాస్తూ, తమ కుటుంబానికి దూరంగా ఉంటూనే, కోట్లాదిమంది కుటుంబాలకు రక్షణగా నిలుస్తున్న మనుషులు సాధారణ జవాన్లు కారు. అలాగే ఆకలికి అల్లల్లాడుతున్న వృద్ధులను చూసి చలించిపోయి విదేశాల్లో ఉన్నతోద్యోగాలనే వదిలేసి అక్షయ్ ట్రస్టుతో అన్నార్తులకు కడుపునిండా అన్నం పెడుతున్న నారాయణన్, హైదరాబాద్‌లోని అజహర్ మక్సూసి, ముంబైలోని సందీప్ మనోహర్ దేశాయ్ లాంటి వాళ్లు మానవతకు నిజమైన అర్థంగా నిలుస్తున్నారు. వీళ్లే మనకాలపు హీరోలు. మనం మహాత్ములం కాలేకపోవచ్చు. కానీ గతకాలపు మహాత్ముల వీర చరిత్రల్ని, మన మధ్యే ఉంటూ మానవత్వపు విలువల్ని గగనపు అంచుకు చేరుస్తున్న రియల్ హీరోల కృషినీ, మన పిల్లలకు కథలుగా చెబుదాం. వాటినుంచి ఏ ఒక్కరు స్ఫూర్తిని పొందినా మరో మహాత్ముడు అవతరించినట్లే. అందుకే ముందుగా మనం, మన కుటుంబం మంచి గా, నీతిగా, నిజాయితీగా ఉండడానికి ప్రయత్నిస్తే చాలు.. ఈ దేశపు ప్రక్షాళన మొదలైనట్లే. అప్పుడు మాత్రమే మన 67 ఏళ్ల గణతంత్ర భారత్ వెయ్యేళ్లు వర్థిల్లగలుగుతుంది. శాంతి మంత్రం జపించకపోయినా పర్లేదు/ అశాంతి జ్వాల రగిలించకుండా ఉంటే చాలు.. నువ్వు బుద్ధుడివే!/ పక్కవాణ్ణి ప్రేమించకపోయినా పర్లేదు/ద్వేషించకుండా ఉంటే చాలు.. నువ్వు దేవుడివే!! (నేడు 67వ గణతంత్ర దినోత్సవం) వైవి రమణ, ఏపీ గ్రామీణ బ్యాంకు అధికారి, సికింద్రాబాద్ మొబైల్: 9440496187 -
రావిశాస్త్రిని గాంచిన వేళ
జ్ఞాపకం నాకు గుర్తున్నమటుకు నా మెడిసిన్ సబ్జక్టు పుస్తకాలు కాకుండా రిపీటెడ్‌గా చదివింది రావిశాస్త్రినే! ‘‘ఇది ఇందూదేసెం! ఈ దేసంలోనే గాదు, ఏ దేసంల అయినసరె పోలీసోడంటే గొప్ప డేంజిరిస్ మనిసని తెలుసుకో! ఊరికి ఒక్కడే గూండా ఉండాలా, ఆడు పోలీసోడే అవాల. అప్పుడె రాజ్జెం ఏ అల్లర్లు లేకండ సేంతిబద్రతలు సక్కగ ఉంటయ్. అంచేత్త ఏటంతే, పులికి మీసాల్లాగినట్లు పోలీసోడితో దొంగసరసం జెయ్యకు! సాలా డేంజరు!...’’ ఈ వాక్యాలు ఎవరివో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలా రాయడం ఒక్క రావిశాస్త్రికి మాత్రమే సాధ్యం. ఇది ‘మూడుకథల బంగారం’లో సూర్రావెడ్డు బంగారిగాడికి చేసిన ఉపదేశం. ఒక పద్ధతిగా, ప్రశాంతంగా, హాయిగా, నింపాదిగా సాగిపోతున్న నా జీవితం - ఒక్కసారిగా పెద్ద కుదుపుకు లోనయ్యింది. అందుక్కారణం రావిశాస్త్రి! నేను హౌజ్ సర్జన్సీలో ఉండగా ‘ఆరుసారా కథలు’ చదివాను. ఆ భాషా, ఆ వచనం, ఆ భావం... దిమ్మ తిరిగిపోయింది. అంతకుముందు వరకు స్థిరంగా, గంభీరంగా నిలబడే అక్షరాల్ని చదివాను గానీ - లేడిలా చెంగుచెంగునా పరుగులు తీస్తూ, పాములా సరసరా మెలికలు తిరిగే వచనాన్ని నేనెప్పుడూ చదవలేదు. ఆ తరువాత రావిశాస్త్రిని ఒక్కపేజీ కూడా వదల్లేదు. నాకు గుర్తున్నమటుకు నా మెడిసిన్ సబ్జక్టు పుస్తకాలు కాకుండా రిపీటెడ్‌గా చదివింది రావిశాస్త్రినే! విశాఖపట్నం వెళ్లాలి, రావిశాస్త్రిని కలవాలి. ఎలా? ఎలా? ఎలా? నాకు విశాఖపట్నం వెళ్లడం సమస్య కాదు, కానీ రావిశాస్త్రిని ఎలా కలవాలి? అందుగ్గాను ఎవర్ని పట్టుకోవాలి? ఇదే సమస్య. ‘రావిశాస్త్రిని కలిసి ఏం మాట్లాడతావోయ్?’ ‘అయ్యా! దేవుణ్ని దర్శనం చేసుకోవాలి. కుదిర్తే కాళ్లమీద పడి మొక్కాలి. అంతేగానీ - దేవుడితో మాట్లాడాలనుకోవడం అత్యాశ!’ ఈ రకమైన ఆలోచనల్లో వుండగా - విశాఖ ప్రయాణం ఒకరోజు రాత్రికి రాత్రే హడావుడిగా పెట్టుకోవలసొచ్చింది. కారణం - మా సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ ఈఎన్బీ శర్మగారి అవసానదశ. పనిలో పనిగా రావిశాస్త్రిని కూడా కలవాలనే ఎజెండా కూడా నా ప్రోగ్రాంలో చేర్చాను. ఆ రోజంతా రావిశాస్త్రి ఇంటి ముందు బీటేసినా లాభం లేకపోయింది. కొన్నాళ్లకి నా అదృష్టం ధనలక్ష్మీ లాటరీ టికెట్టులా తలుపు తట్టింది. రావిశాస్త్రి ఒక పుస్తకావిష్కరణ సభకి గుంటూరు రావడం జరిగింది. చివరిక్షణంలో సమాచారం తెలుసుకున్న నేను ‘భలే మంచిరోజు, పసందైన రోజు’ అని మనసులో పాడుకుంటూ ఉరుకుపరుగులతో ఏకాదండయ్య హాలు(హిందూ కాలేజ్ ఆడిటోరియం) దగ్గరికి చేరుకున్నాను. అక్కడ హాల్ బయట ఓ పదిమంది నిలబడి కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. నేనూ ఓ పక్కగా నించుని రావిశాస్త్రి కోసం ఎదురుచూడసాగాను. ఒక్కొక్కళ్లుగా సభా స్థలానికి చేరుకుంటున్నారు. ‘ఇంతకీ రావిశాస్త్రి రాలేదా?’ కొద్దిగా అనుమానం, ఇంకొద్దిగా నిరాశ. ఓ పది నిమిషాలకి - అరచేతుల చొక్కా టక్ చేసుకుని - తెల్లటి వ్యక్తి, నల్లటి ఫ్రేమ్ కళ్లద్దాలతో నిదానంగా నడుచుకుంటూ ఆవరణలోకి రావడం కనిపించింది. ఆ వ్యక్తి ఎవరో నాకెవ్వరూ చెప్పనక్కర్లేదు. ఆ వ్యక్తి నాకు అనేక ఫొటోల ద్వారా చిరపరిచితం. ఆయనే రావిశాస్త్రి! క్షణాలు లెక్కపెట్టుకుంటూ ఎంతో ఉద్వేగంగా రావిశాస్త్రి కోసం ఎదురుచూసిన నేను - తీరా ఆయన వచ్చేసరికి చేష్టలుడిగి నిలబడిపొయ్యాను. ఈలోపు కొందరు ఆయనతో మాట్లాడ్డం మొదలెట్టారు. రావిశాస్త్రినే గమనిస్తూ ఆయనకి సాధ్యమైనంత సమీపంలో నిలబడ్డాను. ఈలోపు నేను మెడికల్ డాక్టర్‌నని ఆయనకెవరో చెప్పారు. నాకేసి చూస్తూ ‘మా చెల్లెలు నిర్మల తెలుసా?’ అనడిగారు. ‘తెలుసు. వారు నాకు ఫార్మకాలజీ పరీక్షలో ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ సార్’ అని బదులిచ్చాను. మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇంతే! రావిశాస్త్రి పక్కన చాలాసేపు గడిపాను (నిలబడ్డాను). ఒక్కమాట మాట్లాడలేదు. ఎవరెవరో ఏంటేంటో అడుగుతున్నారు. అవన్నీ - ‘రాజు-మహిషి’ ఎప్పుడు పూర్తిచేస్తారు? ‘రత్తాలు రాంబాబు’ని పూర్తిచెయ్యకుండా ఎందుకు వదిలేశారు?’ వంటి రొటీన్ ప్రశ్నలే. అవన్నీ నా మనసులో మెదలాడే ప్రశ్నలే! అయితే - నాకు వాళ్ల సంభాషణ చికాకు కలిగించింది. ‘రావిశాస్త్రి నావాడు, నాకు మాత్రమే చెందినవాడు, నా మనిషిని ఇబ్బంది పెడతారెందుకు? అసలిక్కడ మీకేం పని? పోండి పోండి!’ నేను తెలివైనవాణ్ని. అందుకే కళ్లు పత్తికాయల్లా చేసుకుని రావిశాస్త్రినే చూస్తూ ప్రతిక్షణం నా మనసులో ముద్రించుకున్నాను. ఎందుకంటే - నాకు తెలుసు. ఆ క్షణాలు నా జీవితంలో అమూల్యమైనవిగా కాబోతున్నాయని. అందుకే ఈ రోజుకీ రావిశాస్త్రి నాకు అతి దగ్గరలో నిలబడి ఉన్నట్లుగా అనుభూతి చెందుతాను. ఈ అనుభూతి నాకు ఎంతో ఆనందాన్ని, మరెంతో తృప్తిని కలిగిస్తుంది. ఒక్కోసారి అనిపిస్తుంది - నేనారోజు రావిశాస్త్రి ముందు ఎందుకలా నిలబడిపోయాను? ఒక మహోన్నత శిఖరం ముందు నిలబడ్డప్పుడు ఆ దృశ్య సౌందర్యానికి స్పెల్‌బౌండ్ అయిపోయి... చేష్టలుడిగి నిలబడిపోతాం. ఆ రోజు నా స్థితి అట్లాంటిదేనా? అయ్యుండొచ్చు! వై.వి.రమణ yaramana.blogspot.in (వ్యాసకర్త సైకియాట్రిస్ట్). -
దారి దోపిడీ ముఠా అరెస్టు
హనుమాన్‌జంక్షన్ : బాపులపాడు మండలం ఆరుగొలను వద్ద ఎంఎన్కే రహాదారిపై ఐదు రోజుల క్రితం బీభత్సం సృష్టించి, ఆ ప్రాంత ప్రజలను భయాందోళనలకు గురిచేసిన దారి దోపిడీ ముఠా సభ్యులను హనుమాన్‌జంక్షన్ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శనివారం దోపిడీముఠా అరెస్ట్ వివరాలను సీఐ వై.వి.రమణ వెల్లడించారు. రోడ్డుపై వెళుతున్న వాహనాలను అడ్డగించి చోరీలకు పాల్పడడం, డబ్బులు ఇవ్వకపోతే వాహనచోదకులను ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా చితకబాదటం, బ్లేడులతో శరీరాన్ని పైశాచికంగా కోయడం ఈ ముఠా నైజమని తెలిపారు. 9వ తేదీ అర్ధరాత్రి ఆరుగొలను వద్ద మాటు చేసి నాలుగు లారీలకు అడ్డుకుని దోపిడీకి పాల్పడ్డారని చెప్పారు. ఓ లారీ అద్దాలను పగులకొట్టి డబ్బులు ఇవ్వాలని డ్రైవర్, క్లీనర్లను బెదిరించారని, ముగ్గురు వ్యక్తులను తీవ్రంగా గాయపరిచారని సీఐ వివరించారు. లోకల్ లారీలు కావడంతో డ్రైవర్ల దగ్గర వాస్తవానికి పెద్దగా డబ్బు లేకపోవటంతో ప్యూహం బెడిసికొట్టిందనే ఆక్కసుతో వారిని క్రూరంగా కొట్టారని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి హనుమాన్‌జంక్షన్ పోలీసులకు రెండు ఫిర్యాదులు అందటంతో కేసులు నమోదు చేసి, దర్యాప్తు వేగవంతం చేశామన్నారు. శనివారం నిందితులను రంగయ్యప్పారావు పేట రోడ్డు సమీపంలో పోలీసులు అరెస్టు చేశారని వివరించారు. ఈ దోపిడీ ముఠా ప్రధాన నాయకుడు తలారి మల్లయ్య అలియాస్ ఏసుతో పాటు ముఠా సభ్యులు అన్నవరపు సాంబశివరావు అలియాస్ శివ, గోరిపర్తి అరవింద్‌కుమార్‌ను అరె స్టు చేశామని తెలిపారు. బాపులపాడు మండలం రంగన్నగూడెంకు చెందిన ఏసు కొంతకాలంగా గుడివాడలో నివాసముంటున్నాడు. అక్కడే అడపాదడపా దొంగతనాలకు పాల్పడే శివ, అరవింద్‌తో పరిచయం ఏర్పడటంతో ముగ్గురూ కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారని సీఐ వై.వి.రమణ తెలిపారు. హనుమాన్‌జంక్షన్, వీరవల్లి, గుడివాడ పోలీస్ట్ స్టేషన్ పరిధిలో పలుచోట్ల వీరు దారిదోపిడీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందని చెప్పారు. ఆయా పోలీస్ స్టేషన్లలో ఈ ముఠాపై మొత్తం తొమ్మిది దోపిడీ కేసులు నమోదై ఉన్నట్లు సీఐ తెలిపారు. ఆరుగొలను ఘటనలో లోకల్ లారీలు కావడంతో స్వల్ప మొత్తంలోనే నగదు దోపిడీ జరిగిందని, నిందితుల నుంచి రూ.1620 స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.. ముగ్గురు నిందితులను అరెస్టుచేసి నూజివీడు కోర్టులో హజరుపర్చనున్నట్లు పేర్కొన్నారు. గతమంతా నేరాలమయమే... ముగ్గురు నిందితులు పాతికేళ్లలోపు వయస్సు వాళ్లే, ఐనా నేరాలు మాత్రం చాంతాడంత ఉన్నాయి. తొలుత అర్ధరాత్రి వేళ్లల్లో రోడ్డు పక్కన ఆపి ఉన్న లారీల్లో డ్రైవర్లను బెదిరించి దోపిడీలకు పాల్పడిన ముఠా సభ్యులు క్రమంగా రూటు మార్చారు. కొంతకాలంగా దారి దోపిడీలు చేస్తూ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. 7వ తేదీన గుడివాడ బైపాస్ రోడ్డులో చోటు చేసుకున్న దారి దోపిడీ ఈ ముఠా ఘనతేనని పోలీసుల విచారణలో తేలింది. రెండు వాహనాలను అడ్డగించి దాదాపు రూ.18 వేలు అపహరించారు. దీంతో పాటు 2011లో బొమ్ములూరు సమీపంలోని సంవేద ఎలైట్ వద్ద ఆపి ఉన్న లారీలో డ్రైవర్‌ను బెదిరించి రూ.6500, వీరవల్లి శివారులోని ఓ హోటల్ వద్ద రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీలో డ్రైవర్ నుంచి రూ. 18 వేలు దొంగిలించారు. 2013లో బొమ్ములూరు శివారులోని హోటల్ వద్ద ఆపిన లారీలోకి చోరబడి నిద్రిస్తున్న డ్రైవర్ జేబు కోసి రూ.13 వేలు అపహరించారు. అంతేకాక శివ, అరవింద్ గుడివాడ పోలీస్‌స్టేషన్ పరిధిలోనూ, ఏసు వీరవల్లి, హనుమాన్‌జంక్షన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోనూ గతంలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్న పాత నేరస్తులే.కాగా చాకచక్యంగా నిందితులను పట్టుకున్న హనుమాన్‌జంక్షన్ ఎస్ఐలు నాగేంద్రకుమార్, ప్రభాకరరావు, కానిస్టేబుల్ హరిబాబు, ఇతర సిబ్బందిని సీఐ అభినందించారు.