కొత్తూరులో ఉద్రిక్తత
కొత్తూరు: వైవీఆర్ ఫైనాన్స్ బాధితులు రోడ్డెక్కారు. తప్పించుకు తిరుగుతున్న ఫైనాన్స్ యజమానిని పట్టుకున్నారు. తమ డబ్బులు చెల్లించాలని నిలదీశారు. వందలాది మంది బాధితులు ఆయన చుట్టుముట్టడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి యజమానిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ సంఘటన గురువారం ఉదయం కొత్తూరులో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
హిరమండలం మండలం కొండరాగోలు గ్రామానికి చెందిన యాళ్ల వెంకటరావు సుమారు 10ఏళ్ల నుంచి ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. వైవీఆర్(యాళ్ల వెంకటరావు) ఫైనాన్స్ పేరుతో కొత్తూరు, హిరమండలం, పాతపట్నంతో పాటు ఒడిశా రాష్ట్రంలోని బొత్తవ, బూదర, విస్తల గ్రామాల్లో ప్రజల నుంచి వడ్డీ చెల్లిస్తామని డబ్బులు సేకరించాడు.
సుమారు రూ. 2 కోట్లు అప్పుగా తీసుకున్నాడు. ఈ డబ్బులు తిరిగి చెల్లించకుండా గత నాలుగు నెలల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. దీనిని గమనించిన బాధితులు కొందరు కొండరాగోలులోని ఆయన ఇంటికి గురువారం తెల్లవారుజామున చేరుకున్నారు. ఇచ్చిన అప్పు తీర్చాలని నిలదీశారు. అక్కడ నుంచి ఆయనను కొత్తూరు తీసుకొచ్చారు. ఈ సమాచారం తెలియడంతో వందలాది మంది బాధితులు చేరుకున్నారు. తీసుకున్న అప్పు తీర్చాలని వెంకటరావును నిలదీశారు. సమాధానం చెప్పకపోవడంతో కొందరు ఆయనపై చేయిచేసుకున్నారు.
బాధితులంతా ఫైనాన్స్ యజమాని చుట్టుముట్టడంతో కొత్తూరులోని రాజవీధిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఒక దశలో తోపులాట చోటు చేసుకొంది. తీసుకొన్న అప్పు తీర్చేవరకు విడిచిపెట్టేది లేదన్నారు. అప్పుకు హామీ ఇవ్వాలని, కుటుంబ సభ్యులను పిలవాలని బాధితులు డిమాండ్ చేశారు. ఈ విషయం ఎస్పీకి తెలియడంతో స్థానిక ఎస్ఐ విజయకుమార్‌ను సంఘటన స్థలం వద్దకు పంపించారు. ఎస్ఐ వచ్చి ఫైనాన్స్ యజమానితో మాట్లాడి స్టేషన్‌కు తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు.
కోట్ల రూపాయలు అప్పలు తీసుకొన్న వెంకటరావును మా దగ్గరే ఉంచి న్యాయం చేయాలని బాధితులు పట్టుపట్టారు. స్టేషన్‌కు తీసుకెళ్లే యత్నాన్ని ప్రతిఘటించారు. దీంతో ఎస్ఐ బాధితుల మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు బాధితులకు నచ్చజెప్పి ఫైనాన్స వ్యాపారిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. అప్పుచేసిన సొమ్ము ఏం చేశారన్నదానిపై ఆరా తీస్తున్నారు. పాలకొండ డీఎస్పీ ఆదినారాయణ స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకొని జరిగిన సంఘటనపై బాధితుల నుంచి వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని చెప్పారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు శాంతించారు. వెంకటరావు గతంలో కూడా పలు మండలాల్లో ఆర్థిక నేరాలకు పాల్పడి ప్రజలను మోసం చేసినట్టు పలువురు చెబుతున్నారు.
వడ్డీలు చెల్లించి నష్టపోయా
ఈ సంఘటనపై వైవీఆర్ ఫైనాన్స్ యజమాని యాళ్ల వెంకటరావును ‘సాక్షి’ ప్రశ్నించగా ప్రజలు దగ్గర తీసుకొన్న అప్పుకు వడ్డీలు చెల్లించి నష్టపోయినట్టు చెప్పారు. ఇతరులకు ఇచ్చిన అప్పు తిరిగి రాకపోవడంతో నష్టపోయినట్టు తెలిపారు.