ఢిల్లీ : భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణ పనులు సత్వరమే చేపట్టాలని కేంద్రాన్ని కోరినట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్‌ను కలిసిన బుగ్గన భోగాపురం విమానాశ్రయం నిర్మాణంకు సంబంధించి చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైజాగ్ ఎయిర్ పోర్టు, నేవల్ ఎయిర్ పోర్టు నుంచి నూతన ఎయిర్‌పోర్ట్‌కు మార్పు విధివిధానాలపై చర్చించాం.ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు డీజీసీఏ, ఎయిర్పోర్ట్ అథారిటీ అనుమతులు ఇవ్వాలని ప్రతిపాదించాం. ఓర్వకల్లు ఎయిర్ పోర్టు నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. వచ్చే నెలలో ఓర్వకల్లు ఎయిర్ పోర్టు ప్రారంభిస్తాం. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి లైసెన్స్ ఫీజులు తదితర అంశాలకు సంబంధించి మినహాయింపులు కోరాం.
వర్షాలు, వరదలపై రెవెన్యూశాఖ నివేదికలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో నూతన జాతీయ రహదారుల అంశంపై నితిన్ గడ్కరీ తో చర్చిస్తాను.ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, రాయలసీమ కరువు నివారణ, గోదావరి జిల్లాలు, ఉద్దనం, తదితర పథకాలకు నీతి ఆయోగ్ ద్వారా కేంద్ర సాయం కోరుతున్నాం . నీతి ఆయోగ్ ద్వారా సిఫారసు వెళ్తే కేంద్ర గ్రాంట్ విడుదలయ్యే అవకాశం ఉంటుంది. నీతి ఆయోగ్ నుంచి సానుకూల స్పందన ఉంది. ఏపీ విభజనలో ఏపీకి అన్యాయం జరిగింది.టీడీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయింది.'అంటూ బుగ్గన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment