bogapuram airport
-
Visakhapatnam: 49 కిలోమీటర్లు.. 55 నిమిషాల్లో వెళ్లేలా..
విశాలమైన సముద్రతీరం.. ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న కెరటాలు.. ఆ అలల సవ్వడుల నుంచి మనసును హత్తుకునేలా వీస్తున్న చల్లని చిరు గాలులు. ఆ గాలుల మధ్య నుంచి ప్రయాణం ఎంత బాగుంటుందో కదా.. త్వరలో ఆ అనుభూతులను ఇక్కడే పొందవచ్చు. విశాఖ సాగరతీరం నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా 40 నుంచి 70 మీటర్ల వెడల్పుతో కోస్టల్ బ్యాటరీ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు ప్రత్యేక కారిడార్ ఏర్పాటు కానుంది. – సాక్షి, విశాఖపట్నం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు నేపథ్యంలో విశాఖ నుంచి భోగాపురం వెళ్లేందుకు ప్రత్యేక రహదారి నిర్మాణానికి ఒక్కో అడుగు పడుతోంది. ఎన్‌హెచ్–16 ఉన్నప్పటికీ.. పెరుగుతున్న రద్దీ దృష్ట్యా మరో ప్రధాన రహదారి కచ్చితంగా అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ రహదారిని త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నతాధికారులను ఇప్పటికే ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా రాజధానికి రాచమార్గంగా కోస్టల్ హైవే నిర్మాణానికి అధికార యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముందుగా భీమిలి నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు ఆరు లైన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మించాలని భావించారు. అయితే నగరానికి అనుసంధానం చేస్తూ ఈ రహదారి ఉండాలన్న ముఖ్యమంత్రి ఆలోచనలతో కోస్టల్ బ్యాటరీ నుంచి నేరెళ్లవలస వరకు ఒక విభాగంగా, అక్కడి నుంచి భోగాపురం వరకు గ్రీన్‌ఫీల్డ్ విభాగంగా విస్తరించేందుకు సమాయత్తమవుతున్నారు. చదవండి: (ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైఎస్సార్సీపీ) కోస్టల్ బ్యాటరీ నుంచి మాస్టర్ ప్లాన్ రోడ్ బీచ్‌రోడ్డులోని కోస్టల్ బ్యాటరీ నుంచి నేరెళ్లవలస వరకు మాస్టర్‌ప్లాన్ రహదారిగా అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే ఈ రహదారి నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, జీవీఎంసీ సహకారంతో వీఎంఆర్డీఏ 49 కిలోమీటర్ల మేర రహదారిని అభివృద్ధి చేయనుంది. ఆయా ప్రాంతాల పరిస్థితులను బట్టి.. రహదారి నిర్మాణం చేపట్టాలని డీపీఆర్‌లో స్పష్టం చేశారు. కోస్టల్ బ్యాటరీ నుంచి కైలాసగిరి రోప్‌వే వరకు 40 మీటర్ల రహదారిగా, రోప్‌వే నుంచి జోడుగుళ్ల పాలెం వరకు 45 మీటర్లు, జోడుగుళ్లపాలెం నుంచి నేరెళ్లవలస వరకు 60 మీటర్ల రహదారిగానూ అభివృద్ధి చేయనున్నారు. కోస్టల్ బ్యాటరీ నుంచి పార్క్ హోటల్ వరకు రూ.116.71 కోట్లతో బీచ్‌ఫ్రంట్ రీడెవలప్‌మెంట్‌లో భాగంగా అభివృద్ధి చేసేందుకు జీవీఎంసీ సమాయత్తమవుతోంది. సీఆర్‌జెడ్ అనుమతులు రాగానే పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. పార్క్‌హోటల్ నుంచి వీఎంఆర్డీఏ మిగిలిన పనులకు శ్రీకారం చుట్టనుంది. భీమిలి బీచ్‌రోడ్డు 49 కిలోమీటర్లు.. 55 నిమిషాలు మొత్తంగా విశాఖ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు తీరం వెంబడి ఈ రహదారి నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తం 49 కిలోమీటర్ల 6 నుంచి 8 లైన్ల రోడ్డు నిర్మాణం సాగనుంది. ఈ రహదారి వెంబడి అవకాశం ఉన్న చోట ఇండ్రస్టియల్ పార్కులు, ఐటీ పార్కులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ రహదారి వెంబడి ప్రభుత్వ భూమి ఎంత ఉంది.. సాధ్యాసాధ్యాలపై నాలుగు బృందాలను ఏర్పాటు చేసి సర్వే నిర్వహించింది. ప్రస్తుతం రెవెన్యూ రికార్డుల ప్రకారం భీమిలి నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు 714.60 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎలాంటి వంపులు లేకుండా ప్రయాణం కాస్తా సాఫీగా సాగేలా 90 డిగ్రీల కోణంలో రోడ్డు నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నారు. భీమిలి నుంచి భోగాపురం వరకు 60 నుంచి 70 మీటర్ల విస్తీర్ణంతో రహదారి నిర్మాణం సాగించాలని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. 49 కిలోమీటర్ల ప్రయాణం కేవలం 55 నిమిషాల్లో వెళ్లేలా ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మించాలని ఆలోచన చేస్తున్నారు. మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరిచాం విశాఖ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం మెయిన్ గేట్ వరకు 49 కిలోమీటర్ల కోస్టల్ హైవే నిర్మాణం జరగనుంది. బంగాళాఖాతం వెంబడి ఈ కోస్టల్ హైవే నిర్మాణం జరగనున్న నేపథ్యంలో...వాతావరణ పరిస్థితులు, వాటిని తట్టుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా నిపుణులతో అధ్యయనం చేస్తున్నాం. కమిషనర్ సూచనల మేరకు ఆర్ అండ్ బీ అలైన్మెంట్తో మాస్టర్‌ప్లాన్–2041లో ఈ రహదారిని పొందుపరిచాం. ప్రాజెక్ట్ అంచనా వ్యయం, నిధుల సమీకరణ మొదలైన అంశాలనీ ప్రభుత్వం పరిశీలించనుంది. ఎలాంటి వంపులు లేకుండా పూర్తిస్థాయిలో రోడ్డు నేరుగా ఉండాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం డైమండ్ సర్క్యూట్ ఆకారంలో రోడ్డును నిర్మించాలన్న ప్రతిపాదన కూడా ఉంది. – సురేష్‌కుమార్, వీఎంఆర్డీఏ చీఫ్ అర్బన్ ప్లానర్ -
భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపట్టాలి : బుగ్గన
ఢిల్లీ : భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణ పనులు సత్వరమే చేపట్టాలని కేంద్రాన్ని కోరినట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం కేంద్రమంత్రి హర్దీప్సింగ్ను కలిసిన బుగ్గన భోగాపురం విమానాశ్రయం నిర్మాణంకు సంబంధించి చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైజాగ్ ఎయిర్ పోర్టు, నేవల్ ఎయిర్ పోర్టు నుంచి నూతన ఎయిర్‌పోర్ట్‌కు మార్పు విధివిధానాలపై చర్చించాం.ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు డీజీసీఏ, ఎయిర్పోర్ట్ అథారిటీ అనుమతులు ఇవ్వాలని ప్రతిపాదించాం. ఓర్వకల్లు ఎయిర్ పోర్టు నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. వచ్చే నెలలో ఓర్వకల్లు ఎయిర్ పోర్టు ప్రారంభిస్తాం. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి లైసెన్స్ ఫీజులు తదితర అంశాలకు సంబంధించి మినహాయింపులు కోరాం. వర్షాలు, వరదలపై రెవెన్యూశాఖ నివేదికలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో నూతన జాతీయ రహదారుల అంశంపై నితిన్ గడ్కరీ తో చర్చిస్తాను.ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, రాయలసీమ కరువు నివారణ, గోదావరి జిల్లాలు, ఉద్దనం, తదితర పథకాలకు నీతి ఆయోగ్ ద్వారా కేంద్ర సాయం కోరుతున్నాం . నీతి ఆయోగ్ ద్వారా సిఫారసు వెళ్తే కేంద్ర గ్రాంట్ విడుదలయ్యే అవకాశం ఉంటుంది. నీతి ఆయోగ్ నుంచి సానుకూల స్పందన ఉంది. ఏపీ విభజనలో ఏపీకి అన్యాయం జరిగింది.టీడీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయింది.'అంటూ బుగ్గన పేర్కొన్నారు. -
అదే మాట... పాత పాట!
విజయనగరం గంటస్తంభం: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి జిల్లా వాసులను మభ్యపెట్టే యత్నం చేశారు. గత ఎన్నికల్లో... అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే పదేపదే చెబుతూ వచ్చారో... అవే అంశాలను గురువారం భోగాపురం వేదికగా చెప్పుకొచ్చారు. జిల్లాను ఇతర జిల్లాకు సమానంగా అభివృద్ధి చేస్తానని... సాంస్కృతిక రాజధానిని చేసేస్తానని... పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని... ఎంఎస్‌ఏఈ పార్కులు ఏర్పా టు చేస్తానని ఎప్పటి మాదిరిగానే చెప్పుకొచ్చారు. అయితే పదవీకాలం పూర్తయిపోవస్తుంటే... ఇంకా ఎలా అమలు చేస్తారన్నదే అందరిలోనూ నెలకొన్న సందేహం. భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు శంకుస్థాపన నిమిత్తం జిల్లాకు గురువారం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిబ్బలపాలెంవద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. భోగాపు రం ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి నాంది గా అభివర్ణించారు. పారిశ్రామికంగా, ఆర్థికంగా, పర్యటకంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. 1200మందికి ఉద్యోగాలు వస్తాయనీ, ప్రపంచంలో ఎక్కడకు పోవాలన్నా కనెక్టవిటీ ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇచ్చాపురం–భోగాపురం–విశాఖపట్నం బీచ్‌రోడ్డు వస్తుందని చెప్పుకొచ్చారు. వాస్తవానికి మూడున్నరేళ్ల క్రితం ఎయిర్‌ఫోర్టు మంజూౖ రెనపుడు, ఆ తర్వాత పలు సందర్భాల్లో జిల్లాకు వచ్చినపుడు కూడా ఇదే విషయం తెలపడం విశేషం. కనీసం టెండర్లు కూడా ఖరారు కాకుండా నే... కేంద్ర ప్రభుత్వాధీనంలోని ఈ ఎయిర్‌పోర్టుకు ఎన్నికల కోడ్ వస్తుందని హడావుడిగా శంకుస్థాపన చేయడం అందరినీ నివ్వెరపరుస్తోంది. మళ్లీ తెరపైకి సాంస్కృతిక రాజధాని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా చంద్రబాబునాయుడుకు గుర్తుకు వచ్చేది విజయనగరం వైభవం. అదే తడవుగా సంగీత, సాహిత్యానికి నిలయమైన విజయనగరాన్ని సాంస్కృతిక రాజధాని చేసేస్తానన్నారు. 2014 ఎన్నికలకు ముందు విజయనగరం ఆయోధ్యామైదానం వేదికగా జరిగిన సభలో టీడీపీ అధినేత హోదాలో ఆ మాట అన్నారు. సరి గ్గా ఐదేళ్లకు భోగాపురం సభలోనూ అదే మాట చెప్పడం విశేషం. అధికారంలో ఉన్న నాలుగున్నరేళ్లు చేయకుండా, భవిష్యతులో చేస్తానని చెప్ప డం వింత. విజయనగరం జిల్లా ప్రజలు మంచివారనీ, వెనుకబడిన ఈ జిల్లాను ఇంకా అభివృద్ధి చేస్తానని పునరుద్ఘాటించారు. నిజానికి ఇదే విషయం నాలుగున్నరేళ్లుగా చెబుతు న్నా... ఇప్పటివరకూ చెప్పుకోదగ్గ పనులేమీ జరగలేదు. కనీసం ఇతర జిల్లాలతో పోల్చినా ఇక్కడ చేసింది తక్కువే. గిరిజన యూనివర్సటీ మంజూ రు చేసి నాలుగేళ్లుగా పట్టించుకోకుండా... ఇప్పు డు కేంద్రం అన్యాయం చేసిందనీ, పోరాడైనా యూనివర్శిటీ జిల్లాలో ఏర్పాటు చేస్తానని చెప్పా రు. నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేస్తామని గతంలోనే చెప్పారు. స్థలం కూడా అధికారులు గుర్తించారు. ఇంతవరకు ఒక్క పరిశ్రమ రాలేదు. కానీ ఇప్పుడు మండలానికి ఒక ఎంఎస్ఎంఈ పార్కు అంటూ ప్రకటన చేయడం ఆశ్చర్యపరుస్తోంది. ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన అమరావతి నుంచి భోగాపురం మండలం దిబ్బలపాలెం చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడ భోగా పురం ఎయిపోర్టుకు శంకుస్థాపన చేశారు. దీంతో పాటు గజపతినగరం చందన ఫుడ్‌పార్కు, పతంజలి ఫుడ్‌పార్కు, అరోగ్య మిల్లేట్ ప్రోసెసింగ్ యూనిట్, ప్రభుత్వ డీగ్రీ కాలేజీ, గురజా అప్పారావు యూనివర్సటీకి ఒకే వేదిక వద్ద శంకుస్థాపన చేశారు. అధికారులు ముందుగా ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ఆవిష్కరించి భూమిపూజ చేశా రు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడేటప్పుడు భోగాపురం ఎయిర్‌పోర్టుతో భోగాపు రం, విజయనగరం కలిసిపోతాయన్నారు. జేఎన్టీయూ, ఏయూ క్యాంపస్ కలిపి 189 ఎకరాల్లో గురజాడ అప్పారావు యూనివర్సటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ డీగ్రీ కాలేజీ వస్తుందన్నారు. ఫుడ్‌పార్కుల వల్ల అభివృద్ధి సాధించవచ్చునన్నారు. గ్రామస్వరాజ్, పోషక అభియాన్, కృషి అభియాన్‌తో జాతీయ స్థాయిలో ప్రధమస్థానం సాధించడం, పారిస్ఫోరం నిర్వహించిన ప్రకృతి వ్యవసాయం సదస్సులో కలెక్టర్ హరి జవహర్‌లాల్‌కు ప్రధమస్థానం రావడంపై కలెక్టర్‌తో పాటు జిల్లా అధికారులను అభినందించారు. పైడతల్లి అమ్మవారి పండగను రాష్ట్ర పండగగా ప్రకటించామన్నారు. ఆగర్భ శత్రువులుగా ఉ న్న విజయనగరం, బొబ్బిలి రాజవంశాలను కలిపి న ఘనత తెలుగుదేశం పార్టీదేననీ చెప్పుకున్నారు. ఆశోక్ గైర్హాజరుపై చర్చ కేంద్ర పౌర విమాయానశాఖ మాజీ మంత్రి, విజయనగరం ఎంపీ పూసపాటి ఆశోక్గజపతిరా జు ఎయిర్‌పోర్టుతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు జరిగిన శంకుస్థాపన కార్యక్రమాలకు రాకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. జిల్లా టీడీపీకి ఆయన కీలక నాయకుడు, పైగా భోగా పురం ఎయిర్‌పోర్టు విషయంలో తొలుత చొరవచూపిన వ్యక్తి శంకుస్థాపనకు రాకపోవడంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిపై పలువురు చర్చించుకోవడం వినిపించింది. అయితే సభలో మాట్లాడిన వారెవరూ వీటిపై క్లారిటీ ఇవ్వకపోవడంతో ప్రజల్లో అనేక ఊహగానాలు వినిపిస్తున్నాయి. జనానికి పాట్లు రాష్ట్రం పరిధిలో లేని ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేసి ప్రభుత్వం హడావుడి చేయాలనుకోవడం, ఆ కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి సకాలంలో రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డా రు. ఉదయం 10.30 నుంచి 11.30గంటల వరకు కార్యక్రమం అని ముందుగా చెప్పి, సుమారు రెండున్నర గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం 1.40గంటలకు వచ్చారు. కార్యక్రమం 3.15వరకు సాగింది. దాదాపు నాలుగు గంటలు ఆలస్యంగా ముగియడంతో జనం ఆకలితో అలమటించారు. వెళ్లిపోదామంటే పోలీసులు బారికేడ్లు మూసేయడంతో కార్యక్రమం ముగిసే వరకు ఉండి పట్టపగలు చుక్కలు చూశారు. కార్యక్రమంలో రాష్ట్ర మం త్రి సుజయ్‌కృష్ణ రంగారావు. నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి, రాష్ట్ర ఐటీ ప్రిన్సిపల్ సెక్రెటరీ అజయ్‌జైన్, జిల్లా కలెక్టర్ హరి జవహర్లాల్ ప్రసగించారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు, జెడ్పీ చైర్పర్సన్ స్వాతిరాణి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలుశాఖల రాష్ట్ర, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సీఎం సభలో పోలీసుల ఓవర్ యాక్షన్ పూసపాటిరేగ (భోగాపురం): భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు శంకు స్థాపన సభలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. సీఎం చంద్రబాబు పాల్గొనే సభకు అతి సమీపంలోనే వీవీఐపీ గ్యాలరీ ఏర్పాటు చేశారు. అక్కడ జిల్లాస్థాయి అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూర్చున్నారు. గ్యాలరీలోకి వెళ్లేందుకు పోలీసులు ఎవరిని అనుమతించకుండా ఆంక్షలు పెట్టారు. కానీ సీబీఎన్ ఆర్మీ పేరిట వచ్చిన 100 మంది యువకులను మాత్రం అనుమతించారు. దీనిపై పలువురు బహిరంగంగానే పోలీసుల తీరును విమర్శించారు. ఏ హోదా లేని వ్యక్తులను వీవీఐపీ గ్యాలరీకి పంపించి, అవసరం ఉండి, లోపలికి వెళ్తామన్న వారిని పంపించకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
భోగాపురం ఎయిర్ పోర్టు వద్దు: మావోయిస్టుల లేఖ
శ్రీకాకుళం : విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ మావోయిస్టులు మీడియాకు ఓ లేఖ విడుదల చేశారు. ఇప్పటికే బాక్సైట్ తవ్వకాలను విరమించుకోవాలని ముగ్గురు టీడీపీ నేతలను ఈనెల 6న కిడ్నాప్ చేసి రెండు రోజుల తర్వాత విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజా మావోయిస్టుల లేఖతో రాజకీయవర్గాల్లో కలకలం మొదలైంది. శ్రీకాకుళం జిల్లా కోరాపుట్ డివిజన్ కార్యదర్శి దయా పేరుతో వచ్చిన లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. ఎయిర్ పోర్టు నిర్మాణాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎయిర్ పోర్టు భూసేకరణలో టీడీపీ నేతల భూములకు ఎందుకు మినహాయింపు ఇస్తున్నారని అడిగారు. మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, ఎంపీ అవంతిలకు సంబంధించిన భూములను తీసుకోకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భోగాపురం ఎయిర్ పోర్టు భూసేకరణకు వ్యతిరేకంగా ఈనెల 5న భోగాపురంలో వైఎస్సాఆర్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పర్యటించి బాధితులకు మద్దతుగా నిలుస్తామని చెప్పిన విషయం తెలిసిందే.