కోస్టల్‌బ్యాటరీ నుంచి ఆర్‌కే బీచ్‌లో రీడెవలప్‌మెంట్ రహదారి నమూనా
విశాలమైన సముద్రతీరం.. ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న కెరటాలు.. ఆ అలల సవ్వడుల నుంచి మనసును హత్తుకునేలా వీస్తున్న చల్లని చిరు గాలులు. ఆ గాలుల మధ్య నుంచి ప్రయాణం ఎంత బాగుంటుందో కదా.. త్వరలో ఆ అనుభూతులను ఇక్కడే పొందవచ్చు. విశాఖ సాగరతీరం నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా 40 నుంచి 70 మీటర్ల వెడల్పుతో కోస్టల్ బ్యాటరీ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు ప్రత్యేక కారిడార్ ఏర్పాటు కానుంది. – సాక్షి, విశాఖపట్నం
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు నేపథ్యంలో విశాఖ నుంచి భోగాపురం వెళ్లేందుకు ప్రత్యేక రహదారి నిర్మాణానికి ఒక్కో అడుగు పడుతోంది. ఎన్‌హెచ్–16 ఉన్నప్పటికీ.. పెరుగుతున్న రద్దీ దృష్ట్యా మరో ప్రధాన రహదారి కచ్చితంగా అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ రహదారిని త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నతాధికారులను ఇప్పటికే ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా రాజధానికి రాచమార్గంగా కోస్టల్ హైవే నిర్మాణానికి అధికార యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముందుగా భీమిలి నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు ఆరు లైన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మించాలని భావించారు. అయితే నగరానికి అనుసంధానం చేస్తూ ఈ రహదారి ఉండాలన్న ముఖ్యమంత్రి ఆలోచనలతో కోస్టల్ బ్యాటరీ నుంచి నేరెళ్లవలస వరకు ఒక విభాగంగా, అక్కడి నుంచి భోగాపురం వరకు గ్రీన్‌ఫీల్డ్ విభాగంగా విస్తరించేందుకు సమాయత్తమవుతున్నారు.
చదవండి: (ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైఎస్సార్‌సీపీ)
కోస్టల్ బ్యాటరీ నుంచి మాస్టర్ ప్లాన్ రోడ్
బీచ్‌రోడ్డులోని కోస్టల్ బ్యాటరీ నుంచి నేరెళ్లవలస వరకు మాస్టర్‌ప్లాన్ రహదారిగా అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే ఈ రహదారి నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. ఏపీ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, జీవీఎంసీ సహకారంతో వీఎంఆర్‌డీఏ 49 కిలోమీటర్ల మేర రహదారిని అభివృద్ధి చేయనుంది. ఆయా ప్రాంతాల పరిస్థితులను బట్టి.. రహదారి నిర్మాణం చేపట్టాలని డీపీఆర్‌లో స్పష్టం చేశారు. కోస్టల్ బ్యాటరీ నుంచి కైలాసగిరి రోప్‌వే వరకు 40 మీటర్ల రహదారిగా, రోప్‌వే నుంచి జోడుగుళ్ల పాలెం వరకు 45 మీటర్లు, జోడుగుళ్లపాలెం నుంచి నేరెళ్లవలస వరకు 60 మీటర్ల రహదారిగానూ అభివృద్ధి చేయనున్నారు. కోస్టల్ బ్యాటరీ నుంచి పార్క్ హోటల్ వరకు రూ.116.71 కోట్లతో బీచ్‌ఫ్రంట్ రీడెవలప్‌మెంట్‌లో భాగంగా అభివృద్ధి చేసేందుకు జీవీఎంసీ సమాయత్తమవుతోంది. సీఆర్‌జెడ్ అనుమతులు రాగానే పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. పార్క్‌హోటల్ నుంచి వీఎంఆర్‌డీఏ మిగిలిన పనులకు శ్రీకారం చుట్టనుంది.
భీమిలి బీచ్‌రోడ్డు
49 కిలోమీటర్లు.. 55 నిమిషాలు
మొత్తంగా విశాఖ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు తీరం వెంబడి ఈ రహదారి నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తం 49 కిలోమీటర్ల 6 నుంచి 8 లైన్ల రోడ్డు నిర్మాణం సాగనుంది. ఈ రహదారి వెంబడి అవకాశం ఉన్న చోట ఇండ్రస్టియల్ పార్కులు, ఐటీ పార్కులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ రహదారి వెంబడి ప్రభుత్వ భూమి ఎంత ఉంది.. సాధ్యాసాధ్యాలపై నాలుగు బృందాలను ఏర్పాటు చేసి సర్వే నిర్వహించింది.
ప్రస్తుతం రెవెన్యూ రికార్డుల ప్రకారం భీమిలి నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు 714.60 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎలాంటి వంపులు లేకుండా ప్రయాణం కాస్తా సాఫీగా సాగేలా 90 డిగ్రీల కోణంలో రోడ్డు నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నారు. భీమిలి నుంచి భోగాపురం వరకు 60 నుంచి 70 మీటర్ల విస్తీర్ణంతో రహదారి నిర్మాణం సాగించాలని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. 49 కిలోమీటర్ల ప్రయాణం కేవలం 55 నిమిషాల్లో వెళ్లేలా ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మించాలని ఆలోచన చేస్తున్నారు.
మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరిచాం
విశాఖ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం మెయిన్ గేట్ వరకు 49 కిలోమీటర్ల కోస్టల్ హైవే నిర్మాణం జరగనుంది. బంగాళాఖాతం వెంబడి ఈ కోస్టల్ హైవే నిర్మాణం జరగనున్న నేపథ్యంలో...వాతావరణ పరిస్థితులు, వాటిని తట్టుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా నిపుణులతో అధ్యయనం చేస్తున్నాం. కమిషనర్ సూచనల మేరకు ఆర్ అండ్ బీ అలైన్‌మెంట్‌తో మాస్టర్‌ప్లాన్–2041లో ఈ రహదారిని పొందుపరిచాం. ప్రాజెక్ట్ అంచనా వ్యయం, నిధుల సమీకరణ మొదలైన అంశాలనీ ప్రభుత్వం పరిశీలించనుంది. ఎలాంటి వంపులు లేకుండా పూర్తిస్థాయిలో రోడ్డు నేరుగా ఉండాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం డైమండ్ సర్క్యూట్ ఆకారంలో రోడ్డును నిర్మించాలన్న ప్రతిపాదన కూడా ఉంది.
– సురేష్‌కుమార్, వీఎంఆర్‌డీఏ చీఫ్ అర్బన్ ప్లానర్
Comments
Please login to add a commentAdd a comment