ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్
ఎమ్మెల్సీ ఎన్నికలో టీడీపీకి బలం లేకపోయినా పోటీకి యత్నం
మన పార్టీ క్యాడర్ బలంగా నిలబడటంతో చంద్రబాబు వెన్నులో వణుకు
అందుకే తల వంచి పోటీ నుంచి విరమించుకున్నట్లు ప్రకటన
గత ఎన్నికల్లోనూ చంద్రబాబు అబద్ధపు హామీలు
ఇప్పుడు మళ్లీ అందరూ మోసపోయే పరిస్థితి
రెండున్నర నెలల్లోనేఅన్ని వ్యవస్థల పతనం
మేనిఫెస్టోలోని పథకాలు అమలు చేయలేక సాకులు
ప్రభుత్వాస్పత్రుల్లో ఓపీ వద్ద కుర్చీలు తీసేస్తున్నారు
సర్కారు తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా మారాయి
నాడు మనం ఏ సాకు చెప్పకుండా ప్రతి హామీ నిలబెట్టుకున్నాం
ఐదేళ్ల తర్వాత మళ్లీ మన విజయం తథ్యం
నిజానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా చంద్రబాబు అందరికీ కాల్స్ చేసి.. అది ఇస్తా, ఇది ఇస్తా అని ఆశ చూపే ఉంటాడు. కానీ ధర్మం, న్యాయం గెలిచింది. మీరు ఒక్కటిగా నిలబడ్డారు కాబట్టి ఆయన ఆటలు సాగలేదు. సంఖ్యా బలం లేనప్పుడు పోటీ పెడతాననడమే తప్పు. అలా చేయడం ఆయన నైజం. ఆ మనిషి అలా చేసినా కూడా వైఎస్సార్‌సీపీ నాయకులు అందరూ ఒకే తాటిమీద విలువలు, విశ్వసనీయతతో నిలబడటం వల్లే ఆ మనిషి తల వంచారు. – వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అమరావతి: ఉమ్మడి విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో మనమంతా ఏకమై ఎప్పుడైతే యుద్ధం చేయడం ప్రారంభించామో.. ఎప్పుడైతే వైఎస్సార్సీపీ కేడర్ బలంగా కనిపించిందో అప్పుడు చంద్రబాబు వెన్నులో భయం ప్రారంభమైందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అందుకే ఎన్నికలో పోటీ నుంచి విరమించుకున్నట్టు ప్రకటన చేశారని చెప్పారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో బుధవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో యలమంచిలి, భీమిలి నియోజకవర్గాల పరిధిలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్‌లతో సమావేశమయ్యారు.
‘గత ఎన్నికలు ఎలా జరిగాయో ప్రజా ప్రతినిధులుగా మీరంతా చూసే ఉంటారు. ఎన్నికల్లో ఈ మాదిరి ఫలితాలు రావడానికి కారణం పది శాతం ఓటర్లు చంద్రబాబు చెబుతున్న అబద్ధాల వైపు మొగ్గు చూపారు. ఎన్నికల ప్రచారంలో అబద్ధపు హామీలతో మోస పూరితమైన ప్రచారం చేశారు. తీరా ఇప్పుడు అంతా మోసపోయిన పరిస్థితుల్లో ఉన్నారు’ అని చెప్పారు. ఇప్పడు ప్రతి ఇంట్లోనూ జగన్ ఉండి ఉంటే.. అన్న విషయంపై చర్చ జరుగుతోందన్నారు.
‘జగన్ పలావు పెట్టాడు.. చంద్రబాబు బిర్యానీ పెడతానని ఆశ చూపాడని అంటున్నారు. చివరకు పలావు పోయింది. బిర్యానీ పోయిందనే చర్చ ఇప్పుడు ప్రతి ఇంట్లో జరుగుతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక పథకాలు రాకపోగా, వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో ఓపీ దగ్గర కుర్చీలు కూడా తీసేస్తున్న పరిస్థితి ఉంది’ అని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
మనం ఏ సాకూ చూపలేదు
» ఇవాళ ఏ సమస్య లేకపోయినా చంద్రబాబు ఎన్నో సమస్యలున్నట్టు చిత్రీకరిస్తున్నాడు. నిజానికి ఆనాడు మనం అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్నో సమస్యలు. ఒకవైపు చంద్రబాబు చేసిన అప్పులు.. ఆ అప్పుల మీద వడ్డీలు.. వాటికి తోడు కోవిడ్ మహమ్మారి.. ఇలా మన పరిపాలన కాలంలో సమస్యలు తాండవించాయి.
ఆ సమయంలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గినా, రాష్ట్రంలో పెట్టే ఖర్చు అనూహ్యంగా పెరిగినా మనం ఎలాంటి సాకులు చూపలేదు. ఎటుంటి కారణాలు చెప్పలేదు. శ్వేతపత్రాలు అని చెప్పడమో.. గత ప్రభుత్వాల మీద నిందలు మోపడమో చేసి.. ప్రజలకు చేయాల్సింది చేయకుండా పోయే కారణాలు ఎప్పుడూ చూపించలేదు.
» ఎన్ని కష్టాలున్నా చిక్కటి చిరునవ్వుతో ప్రతి ఇంటికి మంచి చేస్తూ.. ఈ నెలలో ఈ కార్యక్రమం చేస్తామని.. గతంలో ఎప్పుడూ జరగని విధంగా బడ్జెట్లో ఒక కేలండర్ విడుదల చేసి.. బటన్ నొక్కి, ప్రతి ఇంటికీ నేరుగా డోర్ డెలివరీ చేసిన చరిత్ర మన ప్రభుత్వానిది. దేవుని దయతో ఇవన్నీ చేయగలిగాం. అందుకే ఈ రోజు ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి సగర్వంగా తలెత్తుకుని పోగలుగుతాడు. అక్కా, అన్నా మా ప్రభుత్వంలో ఇది చెప్పాం.. చెప్పింది తూ.చా. తప్పకుండా ప్రతి ఒక్కటీ అమలు చేశామని చెప్పగలుగుతారు.
ఇప్పటికే ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత
» రెండున్నర నెలల చంద్రబాబు పాలన చూశాం. ఇంతలోనే చంద్రబాబు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఇంత వేగంగా పుట్టడం మొట్ట మొదటిసారి చూస్తున్నాం. ఇవాళ జగనే ఉండి ఉంటే.. అన్న చర్చ ప్రతి ఇంట్లో జరుగుతోంది. వైఎస్సార్‌సీపీ ఉండి ఉంటే.. ప్రతి తల్లికి అమ్మఒడి వచ్చేది. ప్రతి రైతన్నకు రైతుభరోసా సొమ్ము వచ్చి ఉండేది. 2023–24 ఖరీఫ్‌కు సంబంధించి ఇన్సూ్యరెన్స్ సొమ్ము కూడా వచ్చి ఉండేది.
» విద్యార్థులకు ప్రతి మూడు నెలలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద తల్లుల ఖాతాల్లో డబ్బులు పడేవి. ప్రతి త్రైమాసికం అయిపోయిన తర్వాత ఇచ్చే పరిస్థితులు గతంలో ఉంటే.. ఇప్పుడు రెండు త్రైమాసికాలు అయిపోయినా డబ్బులు ఇవ్వలేదు. వసతి దీవెన కూడా ఇవ్వలేదు. పొదుపు సంఘంలోని ప్రతి అక్కచెల్లెమ్మకు మామూలుగా ఏప్రిల్లో సున్నా వడ్డీ డబ్బులు జమ అయ్యేవి. అవి కూడా పడలేదు.
» నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా లేదు. వాహన మిత్ర కూడా లేదు. ఎక్కడా ఎవరూ అడగాల్సిన అవసరం లేకుండా సాఫీగా అన్నీ జమ అయ్యే పరిస్థితి నుంచి ఇవాళ ఒక్కరికీ ఒక మేలు జరగకపోగా.. అన్నీ దారుణాలే జరుగుతున్నాయి.
అంతా అస్తవ్యస్తం
» విద్యా రంగంలో టోఫెల్ అనే సబ్జెక్టు పీరియడ్‌గా ఉండేది. దాన్ని ఎత్తేశారు. ఇంగ్లిష్ మీడియం, రోజుకొక మెనూతో గోరుముద్ద.. పాఠశాల పిల్లలకు పెట్టే భోజనం ప్రశ్నార్థకం అయింది. డిసెంబర్‌లో పిల్లలకిచ్చే ట్యాబుల పరిస్థితి ప్రశ్నార్థకం అయింది.
» ఆరోగ్య రంగానికి సంబంధించి ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.1,800 కోట్లు దాటాయి. మార్చిలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆరోగ్యశ్రీకి సంబంధించి జనవరి నుంచి ఉన్న రూ.1,800 కోట్ల బకాయిలు ఆపేశారు. ఇవాల్టికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. గతంలో జీరో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చి ఏ ఆసుపత్రిలోనూ డాక్టర్ల కొరత ఉండకూడదన్న పరిస్థితి నుంచి, ఈ రోజు ఆసుపత్రుల్లో డాక్టర్లు ఎక్కడ ఉన్నారు? అన్న పరిస్థితికి ప్రభుత్వ ఆస్పత్రులు వెళ్లిపోయాయి. ఆరోగ్య ఆసరా కనిపించడం లేదు. 108, 104 బిల్లులు లేవు. ఆసుపత్రుల్లో డాక్టర్లు లేరు, మందులు లేవు, పరిశుభ్రత అన్నది లేనే లేని పరిస్థితి.
» రైతులు విత్తనాల కోసం మళ్లీ క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రీ ఇన్సూరెన్స్ పోయింది. ఈ–క్రాప్ పోయింది. ఉచిత పంటల బీమాను కూడా పక్కన పెట్టేశారు. గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు అవ్వాతాతల పెన్షన్ నుంచి, బియ్యం వరకు ప్రతి పథకం డోర్ డెలివరీ జరిగేది. ఇప్పుడు అంతా పోయింది. తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ.. జన్మభూమి కమిటీలంటూ నాయకులు ఎక్కడున్నారని వాళ్ల దగ్గరకు ప్రజలు వెళ్లాల్సిన దుస్థితిలో ఇవాళ పాలన సాగుతోంది.
రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన
» రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తి అధ్వానంగా మారింది. రెడ్‌బుక్ పాలన సాగుతోంది. గ్రామ స్థాయిలో కక్షలను ప్రోత్సహించకూడదన్నది పక్కన పెట్టి.. గ్రామ స్థాయిలోనే వాటిని ప్రోత్సహిస్తూ మీరు చేసుకోండి.. పోలీసులను మేం చూసుకుంటాం.. అని రెడ్ బుక్ పాలన సాగిస్తున్నారు. దిశ యాప్ ఏమైందో కూడా అర్థం కావడం లేదు. ఇవన్నీ కేవలం రెండున్నర నెలల్లోనే మన కళ్లెదుటే కనిపిస్తున్న మార్పులు.
» ఎక్కడా అబద్ధాలు, మోసాలు లేకుండా ప్రజలకు మనం మంచి చేశాం. చంద్రబాబు బిర్యానీ పెడతానని మోసం చేస్తున్నాడు. ఇచ్చిన ఏ మాట నెరవేర్చనప్పుడు ప్రజలు తాము మోసపోయామన్న భావవ నుంచి కోపం పుడుతుంది. అప్పుడు చంద్రబాబు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి.
మన వ్యక్తిత్వమే మనకు రక్ష
» ఈ ఐదేళ్లలో కష్టాలు ఉంటాయి. కష్టాలు లేకుండా సృష్టే ఉండదు. చీకటి వచ్చిన తర్వాత మళ్లీ పగలు రాక తప్పదు. కష్టాలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే.. 16 నెలలు నన్నే జైల్లో పెట్టారు. కష్టాలు వచ్చినప్పుడు మన వ్యక్తిత్వమే మనకు శ్రీరామరక్షగా నిలబడుతుంది. మీ అందరికీ ఒక్కటే చెబుతున్నా. మనం చేసిన మంచి ఎక్కడికీ పోలేదు. రానున్న రోజుల్లో ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ప్రజల్లోకి వెళ్లి మేం ఫలానా మంచి చేశామని చెప్పుకునే పరిస్థితి ఉండదు.
» ఎందుకంటే వాళ్లు చెప్పినవన్నీ మోసాలు, అబద్ధాలు కాబట్టి ప్రజలు వాళ్లను నిలదీసే కార్యక్రమం జరుగుతుంది. అదే వైఎస్సార్సీపీ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్తే చెప్పిందే చేశారని దండలు వేసే పరిస్థితి వస్తుంది. ఐదేళ్ల తర్వాత మళ్లీ మీకు, నాకు ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment