శ్రీకాకుళం : విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ మావోయిస్టులు మీడియాకు ఓ లేఖ విడుదల చేశారు. ఇప్పటికే బాక్సైట్ తవ్వకాలను విరమించుకోవాలని ముగ్గురు టీడీపీ నేతలను ఈనెల 6న కిడ్నాప్ చేసి రెండు రోజుల తర్వాత విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజా మావోయిస్టుల లేఖతో రాజకీయవర్గాల్లో కలకలం మొదలైంది. శ్రీకాకుళం జిల్లా కోరాపుట్ డివిజన్ కార్యదర్శి దయా పేరుతో వచ్చిన లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు.
ఎయిర్ పోర్టు నిర్మాణాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎయిర్ పోర్టు భూసేకరణలో టీడీపీ నేతల భూములకు ఎందుకు మినహాయింపు ఇస్తున్నారని అడిగారు. మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, ఎంపీ అవంతిలకు సంబంధించిన భూములను తీసుకోకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భోగాపురం ఎయిర్ పోర్టు భూసేకరణకు వ్యతిరేకంగా ఈనెల 5న భోగాపురంలో వైఎస్సాఆర్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పర్యటించి బాధితులకు మద్దతుగా నిలుస్తామని చెప్పిన విషయం తెలిసిందే.