
‘పద్మవ్యూహంలో చక్రధారి’ సినిమాను ఆదరించాలి
కడప రూరల్ : ఈ నెల 21వ తేదీన విడుదల అవుతున్న పద్మవ్యూహంలో చక్రధారి చిత్రంను విజయవంతం చేయాలని ఆ చిత్రం యూనిట్ తెలిపారు. సోమవారం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ చిత్రం దర్శకుడు సంజయ్‌రెడ్డి మాట్లాడుతూ ఈ సినిమాను రాయలసీమ నేపధ్యంలో కుటుంబ ప్రేమ కథా చిత్రంగా నిర్మించామన్నారు. ఈ సినిమాను దాదాపుగా 35 రోజుల పాటు పులివెందుల ప్రాంతంలో తీశామన్నారు. రాయలసీమ అంటే కుట్రలు, కుతంత్రాలు, ఫ్యాక్షన్ నేపథ్యంలోనే సినిమాలు వస్తుంటాయన్నారు. అందుకు భిన్నంగా తాము మంచి కుటుంబ ప్రేమ కథతో సినిమాను నిర్మించామన్నారు. ఈ చిత్రానికి నిర్మాతగా కేసీ రామరాజు వ్యవహరించారని తెలిపారు. హీరో ప్రవీణ్‌రాజ్ మాట్లాడుతూ తాను రాయచోటిలో పుట్టి పెరిగానని తెలిపారు. కడప ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. సినీ రంగంపై మక్కువతో మంచి చిత్రంలో హీరోగా నటించినందుకు సంతోషంగా ఉందన్నారు. హీరోయిన్ శశికా మాట్లాడుతూ సినిమాను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రచయిత శివ తదితరులు పాల్గొన్నారు.