
ఎదురెదురుగా ఢీకొన్న లారీ, వ్యాన్
తాళ్లరేవు: జాతీయ రహదారి–216లోని పి.మల్లవరం జంక్షన్ సమీపంలో ఐస్ ఫ్యాక్టరీ వద్ద గురువారం తెల్లవారుజామున లారీ, వ్యాన్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆయా వాహనాల డ్రైవర్లకు గాయాలయ్యాయి. కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ వివరాల మేరకు, అంబాజీపేట నుంచి శ్రీకాకుళానికి కొబ్బరిడొక్కల లోడుతో వెళుతున్న వ్యాన్, రావులపాలెం నుంచి బీహార్ వెళుతున్న చేపల లోడు లారీ తెల్లవారుజాము సమయంలో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆత్రేయపురం గ్రామానికి చెందిన వ్యాన్ డ్రైవర్ కోటి వరప్రసాద్‌కు తీవ్ర గాయాలు కాగా, కృష్ణా జిల్లా గుడ్లవల్లేరుకు చెందిన లారీ డ్రైవర్ జుజ్జువరపు రవితేజకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వీరిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.
ఇద్దరు డ్రైవర్లకు గాయాలు