విద్యుదుత్పత్తికి అంతా సిద్ధం | - | Sakshi
Sakshi News home page

విద్యుదుత్పత్తికి అంతా సిద్ధం

Published Mon, Jun 24 2024 12:24 AM | Last Updated on Mon, Jun 24 2024 12:24 AM

విద్య

జూరాలలో 12 యూనిట్లు.. 474 మెగావాట్లు

ఆత్మకూర్‌: ఉమ్మడి జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు జల విద్యుత్‌ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి చేపట్టేందుకు అధికారులు అంతా సిద్ధం చేశారు. గతేడాది వర్షాభావ పరిస్థితులు, ఎగువ నుంచి ప్రాజెక్టుకు వరద రాకపోవడంతో 640 మి.యూనిట్లు లక్ష్యానికిగాను కేవలం 212 మి.యూ. మాత్రమే ఉత్పత్తి చేశారు. ప్రాజెక్టు ప్రారంభం నుంచి ఇంత తక్కువ మొత్తంలో విద్యుదుత్పత్తి గతేడాదే కావడం విశేషం. 2022–23లో ప్రాజెక్టుకు వరద అధిక మొత్తంలో చేరడంతో ప్రాజెక్టు చరిత్రలోనే అత్యధికంగా 876 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టి రికార్డు సృష్టించారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో 648 మి.యూ. లక్ష్యానికిగాను 775 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తిని విజయవంతంగా చేపట్టారు. 2021–22లో 724 మి.యూ. లక్ష్యానికిగాను 704 మి.యూ. సాధించారు.

వరదనీటిపైనే ఆధారం..

జూరాల ప్రాజెక్టుకు ఎగువనున్న కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యాంల నుంచి వరద వచ్చి చేరితేనే విద్యుదుత్పత్తికి ఆస్కారం ఉంటుంది. ఈ ఏడాది మహారాష్ట్రా, కర్ణాటకలో వర్షాలు మోస్తారుగా కురుస్తున్నప్పటికీ అక్కడి ప్రాజెక్టులు నిండిన తర్వాతే దిగువకు నీటిని వదులుతారు. ఇక్కడ వరణుడు మోహం చాటేయడంతో ఎగువ ప్రాజెక్టులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.

విద్యుదుత్పత్తి వివరాలిలా..

ప్రాజెక్టు దిగువ జల విద్యుత్‌ కేంద్రంలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు, ఎగువ జల విద్యుత్‌ కేంద్రంలోని 6 యూనిట్ల ద్వారా 234 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేపట్టడమే లక్ష్యంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. 2014–15 నుంచి 2023–24 వరకు 4,892 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టారు.

మూడోయూనిట్‌లో

సాంకేతిక లోపం..

ఈ ఏడాది లక్ష్యం 600 మిలియన్‌ యూనిట్లు

గతేడాది ఉత్పత్తి కేవలం 212 మి.యూ. మాత్రమే..

ఎగువ కర్ణాటక నీటిపైనే ఆధారం

మూడో యూనిట్‌లో సాంకేతిక లోపం

ఎగువ జూరాల జల విద్యుదుత్పత్తి కేంద్రంలో ఆరు యూనిట్లు ఉండగా.. మూడో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఐదు యూనిట్ల నుంచే విద్యుదుత్పత్తి చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. గతేడాదే మూడో యూనిట్‌లో సాంకేతిక సమస్య తలెత్తగా ఉన్నతాధికారుల ద్వారా సంబంధిత కంపెనీకి సమాచారమిచ్చారు. కాగా నిపుణులు చైనా నుంచి రావాల్సి ఉండటంతో ఆలస్యమవుతున్నట్లు సమాచారం. ఈ ఏడాది కూడా ఆ యూనిట్‌లో విద్యుదుత్పత్తి జరగకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు.

అందరి సహకారంతోనే..

సిబ్బంది సహకారంతో ఎగువ, దిగువ జల విద్యుత్‌ కేంద్రాల్లో లక్ష్యానికి మించి విద్యుదుత్పత్తి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. మొత్తం 12 యూనిట్లు ఉండగా.. మూడో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. మిగిలిన 11 యూనిట్ల నుంచి విద్యుదుత్పత్తి చేపట్టేందుకు అంతా సిద్ధం చేశాం. గతేడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా 640 మి.యూ. లక్ష్యానికిగాను 212 మి.యూ. మాత్రమే ఉత్పత్తి చేశాం. ఈ ఏడాది ఎగువ నుంచి వరద వచ్చిన వెంటనే విద్యుదుత్పత్తి ప్రారంభిస్తాం. – కల్లూరి రామసుబ్బారెడ్డి, ఎస్‌ఈ, జెన్‌కో

No comments yet. Be the first to comment!
Add a comment
విద్యుదుత్పత్తికి అంతా సిద్ధం
1/1

విద్యుదుత్పత్తికి అంతా సిద్ధం

Advertisement
 
Advertisement
 
Advertisement