
ముప్పాళ్ళ: గ్రామీణ ప్రాంత యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం దోహదం చేస్తుందని కలెక్టర్ ఎల్.శివశంకర్ చెప్పారు. ముప్పాళ్ల జెడ్పీ పాఠశాల ఆవరణలో జరుగుతున్న ఆడుదాం ఆంధ్రా ఆటల పోటీలను బుధవారం పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ యువత వ్యసనాలకు దూరంగా ఉండి సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకువచ్చేలా మెలగాలన్నారు. ప్రతి ఒక్కరిలో పోటీతత్వం ఎంతో అవసరమని, గెలుపోటములు సమానంగా తీసుకున్నప్పుడే అన్ని రంగాల్లోనూ రాణించవచ్చని చెప్పారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం వారితో కలిసి టెన్నిస్, వాలీబాల్ ఆడారు. సత్తెనపల్లి ఆర్డీఓ రాజకుమారి, తహసీల్దార్ ఎం.భవానిశంకర్, ఎంపీడీఓ పి.పుట్టారెడ్డి, ఎంఈఓ ఒంగోలు రాజు, పాఠశాలల పీడీలు పాల్గొన్నారు.
ఎంఎల్‌హెచ్‌పీ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం
గుంటూరు మెడికల్ : ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్‌హెచ్‌పీ) / కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ జి.శోభారాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ఉమ్మడి మూడు జిల్లాల్లో 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అభ్యర్థులు 2024 జనవరి 12వ తేదీలోగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. విద్యార్హత, వేతనాలు, దరఖాస్తు ఫారం పూర్తి వివరాల కోసం హెచ్‌టీటీపీ:హెచ్‌ఎంఎఫ్‌డబ్ల్యూ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌లో చూడాలన్నారు.
ఘనంగా శివ ముక్కోటి
అమరావతి : శివ ముక్కోటిని బుధవారం పంచారామ క్షేత్రాలలో ప్రథమారామ క్షేత్రమైన అమరావతిలో ఘనంగా నిర్వహించారు. బాలచాముండికా సమేత అమరేశ్వరునికి వేకువ జామున వేద పండితులు సంకల్పం, విఘ్నేశ్వరపూజ, మండపారాధన, మహన్యాసం నిర్వహించారు. అనంతరం ఏకాదశ రుద్ర అన్నాభిషేకాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తొలుత పంచామృతాలతో, ఆ తర్వాత దాతల సహకారంతో సుమారు రెండు క్వింటాళ్ళ బియ్యాన్ని అన్నంగా వండి స్వామివారికి అభిషేకం చేశారు. బాలచాముండేశ్వరి అమ్మ వారికి ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించిన అనంతరం అభిషేకించిన అన్నంతో ఆలయ ఈవో వేమూరి గోపీనాథశర్మ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు.
పెదకాకాని శివాలయంలో..
పెదకాకాని: శివాలయంలో మల్లేశ్వరస్వామివారికి అర్చకులు మహన్యాసక పూర్వక మహా రుద్రాభిషేకం, 180 కిలోల అన్నంతో అన్నసూక్త పూర్వక అన్నాభిషేకం నిర్వహించారు. స్వామివారికి విశేష అలంకరణ జరిగింది. అన్నాభిషేకం అనంతరం భక్తులకు స్వామి వారి దివ్య ప్రసాదంగా పంపిణీ చేశారు.
జనవరి 12 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ
నరసరావుపేట: ఓటరు జాబితాపై క్లెయిమ్‌లు, అభ్యంతరాలు జనవరి 12 వరకు స్వీకరిస్తామని కలెక్టర్ లోతేటి శివశంకర్ తెలిపారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం–2024లో భాగంగా బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లో ఏఈఆర్వోలతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జనవరి 22న తుది ఓటరు జాబితా ప్రచురిస్తామని వివరించారు. ఈ జిల్లాకు చెంది ఇక్కడ ఓటు కలిగి ఉండటంతోపాటు ఇతర ప్రాంతాలలో ఓటు హక్కు కలిగి ఉన్న వారి సమాచారం ఉంటే అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.వినాయకం, కలెక్టరేట్ సూపరింటెండెంట్ పాల్గొన్నారు.


Comments
Please login to add a commentAdd a comment