స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్రను విజయవంతం చేయండి
నరసరావుపేట: స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు పిలుపు ఇచ్చారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించాక, పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మంచి ఉద్దేశంతో అధికారులను, సిబ్బందిని, ప్రజలను భాగస్వాములను చేస్తూ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఇదే స్ఫూర్తితో కార్యాలయాలు, ఆఫీసుల్లో పెండింగ్ ఫైల్స్ పరిష్కారం అయ్యేలా చూడాలని కోరారు. తద్వారా ప్రజలకు సత్వర సేవలు అందుతాయని అన్నారు. ప్రతి మూడో శనివారం తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు. తడి, పొడి చెత్త సేకరణ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించాలని ఆదేశించారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, జిల్లా రెవెన్యూ అధికారి ఏకా మురళి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఏపీ జెన్‌కో ఆధ్వర్యంలో..
విజయపురిసౌత్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమాన్ని నాగార్జునసాగర్ ఏపీ జెన్‌కో ఆధ్వర్యంలో విజయపురిసౌత్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. జెన్‌కో ఈఈ అప్పాజీ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. స్వచ్ఛత పాటిస్తేనే ఆరోగ్యంగా ఉంటామన్నారు. ముందుగా ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఏపీ జెన్‌కో క్వార్టర్స్ వద్ద రోడ్లను ఊడ్చి శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఈలు రాజారెడ్డి, అక్బర్, రమణారావు, ఏఈలు గౌతమ్, శ్రీను, శ్రీనివాస్, రేవతి, సల్మా, రాణిబాయి, మనోహరమ్మ, రాణి, ఎస్పీఎఫ్ ఏఎస్‌ఐ సత్యమూర్తి, డాక్టర్ రేవంత్, ఉద్యోగులు చందు, రామకృష్ణ, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment