శివాజీ జయంతి ఉత్సవాల్లో అపశృతి
వర్గల్(గజ్వేల్): ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. వర్గల్ మండలం జబ్బాపూర్‌లో జెండావిష్కరణ చేస్తుండగా విద్యుత్ తీగలు ఇనుప జెండా పైపునకు తగిలి ఏడుగురికి కరెంట్ షాక్ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. గౌరారం ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా జబ్బాపూర్ గ్రామ కూడలిలో యువకులు, గ్రామస్తులు ఇనుప పైపుతో కూడిన కాషాయజెండాను ఎగుర వేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఉదయం 11.30 ప్రాంతంలో జెండాను పైపు చివరన బిగించారు. లింగ ప్రశాంత్(22), దేశెట్టి కరుణాకర్(22), పల్లపు బన్నీ, కొంతం వేణు, కొంతం కనకరాజు, లింగ గణేష్, లింగ మహేశ్ జెండా పైపును పట్టుకొని పైకి లేపుతుండగా ప్రమాదవశాత్తు పైనున్న కరెంట్ తీగలకు తగిలింది. దీంతో పైపును పట్టుకున్న వారందరూ విద్యుత్ షాక్‌కు గురై పడిపోయారు. షాక్ తీవ్రతకు లింగ ప్రశాంత్ మృతి చెందగా, దేశెట్టి కరుణాకర్ తీవ్రంగా గాయపడ్డాడు. బాధితులను గ్రామస్తులు చికిత్స నిమిత్తం గజ్వేల్ ఆస్ప త్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన కరుణాకర్‌ను మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ ఘటనతో జబ్బాపూర్ గ్రామం శోకసంద్రమైంది. చేతి కందిన కొడుకు విద్యుత్ షాక్‌తో మృత్యువాత పడటంతో ప్రశాంత్ తల్లి కనకమ్మ రోదనలు మిన్నంటాయి. ఒంటరిని చేసి పోయావా అంటూ ఆమె విలపిస్తుంటే ఆపడం ఎవరి తరం కాలేదు. డిగ్రీ చదువులో మిన్నగా, ఎన్‌సీసీలో గ్రూప్ లీడర్‌గా ప్రశాంత్ రాణించాడు. మిన్నంటిన రోదనల మధ్య అతడి అంత్యక్రియలు ముగిశాయి.
జెండావిష్కరణ చేస్తుండగా
ఏడుగురికి విద్యుత్ షాక్
ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు
వర్గల్ మండలం జబ్బాపూర్‌లో విషాదం
శివాజీ జయంతి ఉత్సవాల్లో అపశృతి
Comments
Please login to add a commentAdd a comment