దళితుల భూముల జోలికి రావొద్దు
శివ్వంపేట(నర్సాపూర్): దళితులు భూములు ఆక్రమించాలని చూస్తున్నారంటూ దళితులు మాజీ ఎమ్మెల్యే ఏనుగుల రవీందర్‌రెడ్డి నిర్వహిస్తున్న సర్వేను అడ్డుకొని వాగ్వాదానికి దిగారు. ఈ ఘటన మండలంలోని చిన్న గొట్టిముక్కులలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన సర్వే నంబర్ 296లో 80 ఎకరాల్లో 60 దళిత కుటుంబాలకు గతంలో ఇందిరమ్మ ఇచ్చిన సాగు భూములు ఉన్నాయి. వీటి పక్కనే ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగుల రవీందర్‌రెడ్డి పట్టా భూములను కొనుగోలు చేసి సర్వే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మాజీ ఎమ్మెల్యేతోపాటు ఏడీ సర్వేయర్ శ్రీనివాస్, అధికారులు సర్వేకు వచ్చారు. విషయం తెలియడంతో దళితులు చంద్రయ్య, లింగం, రాములు, అశోక్, సైదులు, నర్సింలు, భిక్షపతి, కూమార్ తదితరులు తాము ఎంతో కాలంగా సాగు చేస్తున్న భూముల్లో సర్వే చేయొద్దని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యేను నిలదీశారు. తమ భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదని గొడవకు దిగారు. దళితుల భూముల్లో ఉపాధి హామీ ద్వారా మట్టి రోడ్డు వేశారని దారిని సైతం కబ్జా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అధికారులు సైతం మాజీ ఎమ్మెల్యేకు వత్తాసు పలుకుతున్నారని ఈవిషయం సీఎం దృష్టికి తీసుకెళ్తామని దళితులు చెప్పారు. తాను కొనుగోలు చేసిన భూమిని మాత్రమే సర్వే చేయిస్తున్నానని మాజీ ఎమ్మెల్యే వివరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలకు నచ్చచెప్పారు.
సర్వేను అడ్డుకున్న దళితులు
మాజీ ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డిని నిలదీత
చిన్నగొట్టిముక్కులలో ఘటన
Comments
Please login to add a commentAdd a comment