తలసరి ఆదాయంలో మేడ్చల్‌ను వెనక్కినెట్టి...
వ్యక్తి తలసరి ఆదాయం (పర్ క్యాపిటా ఇన్‌కం)లో విషయంలో సంగారెడ్డి జిల్లా మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాను వెనక్కినెట్టింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పోటీ పడుతోంది. రాష్ట్రంలోనే మూడోస్థానంలో నిలిచింది. జిల్లాలో ఒక వ్యక్తి తలసరి ఆదాయం ఏడాదికి రూ.3.21 లక్షలుగా తేల్చింది. మొదటిస్థానంలో రంగారెడ్డి జిల్లా రూ.9.54లక్షలు కాగా, హైదరాబాద్ జిల్లా 4.97 లక్షలు. జిల్లా తలసరి ఆదాయం రాష్ట్ర సగటు తలసరి ఆదాయం కంటే అధికంగా ఉండటం గమనార్హం. తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3.11లక్షల కోట్లు
కాగా, జిల్లాలో తల సరి ఆదాయం అంతకంటే
ఎక్కువగానే ఉంది.
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఒక దేశం..ఒక రాష్ట్రం అభివృద్ధిని సూచించేది తలసరి ఆదాయం (జీడీపీ). ఒక ఆర్థిక ఏడాదిలో ఆ దేశంలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవలు..ఇలా అన్ని రంగాల్లో జరిగిన వస్తూత్పత్తి విలువను జీడీపీ(గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్)గా లెక్కిస్తారు. జీడీడీపీ(గ్రాస్ డొమెస్టిక్ డిస్ట్రిక్ట్ ప్రోడక్ట్)లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలను మినహాయిస్తే...సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2022–23 ఆర్థిక ఏడాదిలో జిల్లాలో జరిగిన వస్తూత్పత్తి విలువ ఏకంగా రూ.60,298 కోట్లుగా ప్రభుత్వం లెక్కతేల్చింది. రాష్ట్ర జీడీపీ రూ.13.11 లక్షల కోట్లుకాగా, జిల్లా జీడీడీపీ రూ.60,298 కోట్లు ఉంది. ఇది మొత్తం జీడీపీలో సుమారు ఐదు శాతంగా తేల్చింది. తెలంగాణ రాష్ట్ర గణాంకశాఖ నివేదిక–2024ను ప్రభుత్వం రెండు రోజుల క్రితం ప్రకటించింది. ఈ నివేదికలో జీడీడీపీ అంశాన్ని ముఖ్యంగా ప్రస్తావించింది.
పారిశ్రామిక ఉత్పత్తి...
సంగారెడ్డి జిల్లా పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందింది. జిల్లాలో ఓడీఎఫ్, బీడీఎల్ రక్షణ రంగానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు ఎంఆర్‌ఎఫ్, మహేంద్ర అండ్ మహేంద్ర వంటి ఆటోమొబైల్ భారీ పరిశ్రమలు కూడా జిల్లాలోనే ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంలోనే అత్యధిక ఫార్మా పరిశ్రమలున్న జిల్లా కూడా సంగారెడ్డినే. బల్క్‌డ్రగ్, కెమికల్ పరిశ్రమలు కూడా వందల్లో ఉంటాయి. వీటిలో ఏటా రూ.వేల కోట్ల విలువ చేసే వస్తూత్పత్తి జరుగుతుంది. జిల్లాలో ఉన్న ఫార్మా పరిశ్రమల్లో జరిగిన ఉత్పత్తి విదేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతుంది. ఇలా ఎగుమతుల విలువ రూ.వేల కోట్లు ఉంటుంది. దీంతో జీడీడీపీలో సంగారెడ్డి జిల్లా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలతో పోటీ పడుతోంది.
వ్యవసాయ ఉత్పత్తి సైతం...
కేవలం పారిశ్రామికంగానే కాకుండా సంగారెడ్డి జిల్లా ఇటు వ్యవసాయరంగంలోనూ ముందువరుసలో ఉంటుంది. ప్రధానంగా పత్తి, చెరుకు వంటి వాణిజ్య పంటలతోపాటు, పసుపు, అల్లం వంటి సుగంధద్రవ్యాల పంటలు కూడా అధికంగా పండుతున్నాయి. వరి సాగు కూడా జిల్లాలో ఉంటుంది. ఇలా ఈ పంటల దిగుబడులు కూడా అధికంగా ఉండటంతో జీడీడీపీ విషయంలో సంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలతో పోటీ పడుతోంది.
తలసరి ఆదాయంలో జిల్లా రాష్ట్ర సగటు కంటే అధికం
జిల్లా స్థూల వార్షిక ఉత్పత్తి రూ.60,298 కోట్లు
హైదరాబాద్ జిల్లాలు మినహాయిస్తే రాష్ట్రంలోనే తొలిస్థానం
పారిశ్రామిక, వ్యవసాయ అభివృద్ధే కారణం
తెలంగాణ గణాంక శాఖ–2024 నివేదికలో వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment