
● అసెంబ్లీలో మళ్లీ తీర్మానం ● చర్చ సమయంలో తీవ్ర వాగ్వాద
కచ్చదీవుల సాధనే లక్ష్యంగా అసెంబ్లీలో
బుధవారం తీర్మానం చేశారు. ఈ వ్యవహారంపై చర్చ సమయంలో సీఎం స్టాలిన్, ప్రధాన ప్రతి పక్ష నేత పళణి స్వామి మధ్య మాటల తూటాలు పేలాయి. కాంగ్రెస్ సభ్యుడు
సెల్వ పెరుంతొగై, అన్నాడీఎంకే సభ్యుడు
సెంగోట్టయన్ మధ్య మరోవైపు వ్యాఖ్యల తూటాలు పేలాయి. ఇక బీజేపీ సభ్యురాలు వానతీ శ్రీనివాసన్ పలువురు మంత్రుల మధ్య వాడివేడి చర్చసాగింది.
అసెంబ్లీలో ప్రసంగిస్తున్న సీఎం స్టాలిన్
సాక్షి, చైన్నె: అసెంబ్లీ సమావేశాలలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యుల ప్రశ్నలకు మంత్రులు నెహ్రూ, శేఖర్‌బాబు, ఏవీ వేలు, తదితరులు సమాధానాలు ఇచ్చారు. కోయంబత్తూరుకు సురక్షిత తాగు నీరు సంవృద్ధిగా అందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి నెహ్రూ వివరించారు. సిరువాపురి మురుగన్ ఆలయానికి వెళ్లేందుకు ప్రత్యామ్నాయ రోడ్డు మార్గంకు రూ. 45 కోట్లు కేటాయించామని మంత్రి శేఖర్‌బాబు ప్రకటించారు. చైన్నె మదుర వాయిల్ – హార్బర్ మధ్య డబుల్ డెక్కర్ వంతెన మార్గం పనులకు పూర్తి స్థాయిలో సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు మంత్రి ఏవీ వేలు పేర్కొన్నారు. ప్రశ్నోత్తరాల అనంతరం పశు సంవర్థక, మత్స్య శాఖ నిధుల కేటాయింపునకు సంబంధించిన బడ్జెట్ చర్చ జరగాల్సిన నేపథ్యంలో స్పీకర్ అప్పావు అనుమతితో సీఎం స్టాలిన్ ఓ తీర్మానం సభ ముందుకు తెచ్చారు.
బరువెక్కిన హృదయంతో.
బరువెక్కిన హృదయంతో తాను ఈ తీర్మానం తీసుకొస్తున్నట్టు సీఎం ప్రసంగించారు. తమిళనాడు జాలర్లపై నిరంతరం జరుగుతున్న దాడులను గుర్తు చేస్తూ తమిళనాడుకు చెందిన మత్స్యకారులు భారతీయులే అన్న విషయాన్ని కేంద్రంలోని యూనియన్ ప్రభుత్వం గుర్తెరగాలని హితవు పలికారు. తమిళ జాలర్ల సమస్యలపై పదే పదే వారికి గుర్తు చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. 2014 పార్లమెంటరీ ఎన్నికలకు ముందు ప్రచార సమయంలో నరేంద్ర మోడీ దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నామని, దీనికి ముగింపు పలుకుతామని హామీ ఇచ్చారన్నారు. అయితే శ్రీలంకలో ప్రభుత్వాలు మారినా తమిళనాడు జాలర్లు పరిస్థితి మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకారులపై దాడులు ఆగడం లేదన్నారు. వారి హక్కులను సాగరంలో కాలరాస్తున్నారని మండిపడ్డారు. ఆదేశ చెరలో బందీలుగా తమిళ జాలర్లు గడపాల్సిన దుస్థితి ఉందన్నారు. జాలర్ల విషయంపై ఇప్పటి వరకు తాను 74 లేఖలను కేంద్రానికి రాసినట్టు గుర్తుచేశారు. పడవలను కోల్పోవడమే కాకుండా, భారీ జరీమానాను సైతం చెల్లించుకునే పరిస్థితులు జాలర్లకు ఎదురు అవుతున్నాయని పేర్కొన్నారు. రెండు దేశాల మత్స్యకారుల మధ్య నిర్మాణాత్మక చర్చలకు చర్యలు తీసుకోవాలని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా ఖాతరు చేయడం లేదన్నారు. జాలర్లు ఆదేశ చెరలో బందీలుగా ఉంటే, ఇక్కడ వారి కుటుంబాలు కన్నీటి మడుగులో మునగాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఈ దాడులకు ముగింపు పలకాలంటే కచ్చదీవులను తిరిగి స్వాధీనం చేసుకోవడం ద్వారా మాత్రమే సాధ్యమని స్పష్టం చేశారు. జాలర్ల సమస్యకు శాశ్వత పరిష్కారం లక్ష్యంగా కచ్చదీవులను స్వాధీనం చేసుకునేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని సభలో దాఖలు చేస్తున్నట్టు ప్రకటించారు. రాజకీయ లాభం కోసం పార్టీలు చేసే తప్పునే కేంద్రంలోని యూనియన్ ప్రభుత్వం కూడా చేస్తున్నట్టు విమర్శించారు. కచ్చదీవులపై గతంలో ఒప్పందాలు జరిగినప్పుడు అప్పటి సీఎం కరుణానిధి తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తు చేశారు. 1974లో జరిగిన ఈ ఒప్పందాలకు వ్యతిరేకంగా తీర్మానం కూడా చేసినట్టు పేర్కొన్నారు. 1991, 2013, 2014లో సైతం కచ్చదీవుల తిరిగి స్వాధీనం విషయంగా సభభలో తీర్మానాలు ఆమోదించ బడ్డాయన్నారు. 2023లో భారత ప్రధానమంత్రికి రాసిన లేఖలో చారిత్రాత్మకంగా కచ్చదీవు భారతదేశంలో ఓ భాగం అని, తమిళనాడు జాలర్లు సాంప్రదాయకంగా కచ్చదీవుల చుట్టూచేపల వేటకు అనుమతి ఇవ్వాలని, జాలర్ల హక్కులను , జీవోనోపాధిని పరిరక్షించాలని కోరినట్టు వివరించారు. గత ఏడాది కూడా కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్‌కు తాను రాసిన లేఖను ప్రస్తావిస్తూ, ఇంత వరకు సమస్య అన్నది పరిష్కరించ బడ లేదని ఆవేదన వ్యక్తంచేశారు. తాజాగా శ్రీలంక పర్యటనకు వెళ్తున్న ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు మత్స్యకారుల సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొని, కచ్చదీవును తిరిగి స్వాధీనం చేసుకునేందుకు నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలని అసెంబ్లీ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నామని ప్రకటించారు. ఆ దేశ ప్రభుత్వంతో చర్చించి శ్రీలంక చెరలో ఉన్న జాలర్లను విడుదల చేయించాలని, వారి పడవలన్నీ విడుదల తిరిగి అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని, కచ్చదీవుల సాధనే లక్ష్యంగా , జాలర్ల ప్రయోజనాల ధ్యేయంగా చర్యలు విస్తృతం చేయాలని డిమాండ్ చేస్తూ సభలో తీర్మానం ప్రవేశ పెట్టారు. సభలో చర్చ సమయంలో వాగ్యుద్దాలు సాగినా, చివరకు డీఎంకే కూటమి, అన్నాడీఎంకే, బీజేపీతో సహా అన్ని పార్టీలు కచ్చదీవులను తిరిగి స్వాధీనం చేసుకోవడం లక్ష్యంగా సభలో దాఖలు చేసిన తీర్మానానికి ముక్తకంఠంతో ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం విశేషం. కాగా, సభ అనంతరం పళణి స్వామి మీడియాతో మాట్లాడుతూ, డీఎంకే ప్రభుత్వంపై కచ్చదీవుల వ్యవహారానికి సంబంధించి తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ఇందుకు న్యాయమంత్రి రఘుపతి ఎదురు దాడిచేస్తూ వ్యాఖ్యల తూటాలను పేల్చడం గమనార్హం. అనంతరం సభలో 2025–26 సంవత్సరానికి గాను వ్యవసాయ బడ్జెట్ – నిధులు – చర్చలో ఆ శాఖ మంత్రి ఎంఆర్‌కే పన్నీరు సెల్వం, మత్స్య, పశు సంవర్ధక శాఖ నిధుల చర్చలో ఆ శాఖ మంత్రి అనిత ఆర్ రాధాకృష్ణన్, పాడి పరిశ్రమలకు సంబంధించి ఆ శాఖమంత్రి రాజకన్నప్పన్ ప్రసంగించారు. తమ తమ శాఖలో చేపట్టనున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, లబ్దిదారులకు ప్రోత్సాహకాలు, సహకారం , ప్రాజెక్టులకు నిధుల కేటాయింపునకు సంబంధించిన సమగ్ర వివరాలను ప్రకటించారు.
కచ్చదీవుల సాధన తీర్మానం
తమిళ జాలర్ల పై కచ్చదీవులలో శ్రీలంక నావికాదళం దాష్టీకాలను సీఎం స్టాలిన్ ప్రస్తావించారు. దీంతో కచ్చదీవుల విషయంగా చర్చ ఊపందుకుంది. ఈ విషయంపై సీఎం స్టాలిన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు అన్నాడీఎంకే నేత, ప్రధాన ప్రతి పక్ష నేత పళణి స్వామికి ఆగ్రహాన్ని తెప్పించాయి. మీరంటే, మీరే ధారాదత్తం చేశారంటూ, జాలర్లపై చిత్త శుద్ధి లేదంటూ పరస్పరం మాటల తూటాలతో వాగ్యుద్దానికి దిగారు. కచ్చదీవుల గురించి మాట్లాడే అర్హత డీఎంకేకు లేదంటూ పళణి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ సభ్యుడు సెల్వ పెరుంతొగై కచ్చదీవుల విషయంలో దివంగత అన్నాడీఎంకే వర్గాల అమ్మ జయలలిత వైఖరిని తప్పుబట్టే విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని ఆ పార్టీ సీనియర్ సభ్యుడు సెంగోట్టయన్ తీవ్రంగా పరిగణించారు. సెల్వ పెరుంతొగై వ్యాఖ్యలపై తొలి గళాన్ని వినిపిస్తూ అన్నాడీఎంకే సభ్యులందరీలో చైతన్యం తెస్తూ విరుచుకు పడ్డారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. జయలలితకు వ్యతిరేకంగా స్పందించిన సెల్వపెరుంతొగై తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. ఇక బీజేపీ సభ్యురాలు వానతీ శ్రీనివాసన్ మాట్లాడే సమయంలో పలువురు మంత్రులు ఎదురు దాడితో వ్యాఖ్యల తూటాలను అందుకున్నారు. పీఎం మోదీ ద్వారానే జాలర్లకు న్యాయం జరుగుతోందంటూ వానతీ శ్రీనివాసన్ విరుచుకుపడ్డారు. సభలో నెలకొన్న గందరగోళాన్ని స్పీకర్ అప్పా సద్దుమణిగేలా చేశారు. చివరకు సీఎం స్టాలిన్ తన ప్రసంగాన్ని పూర్తి చేశారు.

● అసెంబ్లీలో మళ్లీ తీర్మానం ● చర్చ సమయంలో తీవ్ర వాగ్వాద

● అసెంబ్లీలో మళ్లీ తీర్మానం ● చర్చ సమయంలో తీవ్ర వాగ్వాద