
ఈ–పాస్ విధానాన్ని పునఃసమీక్షించాలి
● మద్రాసు హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్
సేలం: ఊటీ, కొడైకెనాల్‌లలో పర్యాటక వాహనాల రాకపోకలను పరిమితం చేస్తూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పునఃసమీక్షించాలని కోరుతూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వారాంతాల్లో, సెలవు దినాల్లో, ఊటీ, కొడైకెనాల్ వంటి పర్యాటక ప్రదేశాలకు వచ్చే పర్యాటక వాహనాలు భారీ ట్రాఫిక్ రద్దీని కలిగిస్తాయి. ఈ నేపథ్యంలో పర్యాటక వాహనాలపై ఆంక్షలు విధించాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో ఊటి, కొడైకెనాల్ పర్యాటక ప్రదేశాలకు ఎంత మంది పర్యాటకులను అనుమతించవచ్చనే దానిపై ఐఐటీ మద్రాస్, ఐఐఎం బెంగళూరు ఒక అధ్యయనం నిర్వహించాయి. ఆ నివేదిక రావాల్సి ఉంది. వారాంతపు రోజుల్లో 8వేల వాహనాలను ఊటీకి అనుమతించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది, అయితే వారాంతపు రోజుల్లో 4వేలు వాహనాలను మాత్రమే కొడైకెనాల్‌కు అనుమతించాలని ఆదేశించింది. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తులు సతీష్ కుమార్, భరత చక్రవర్తితో కూడిన ధర్మాసనం స్థానిక వాహనాలపై ఎటువంటి ఆంక్షలు విధించవద్దని జిల్లా యంత్రాంగాలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఈ–పాస్ విధానం బుధవారం అమల్లోకి వచ్చింది. ఈ–పాస్ విధానం పర్యాటక పరిశ్రమను స్థానిక ప్రజల సాధారణ జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసిందని ఆరోపిస్తూ, వ్యాపార అసోసియేషన్ బుధవారం ఊటీ, కొడైకెనాల్‌లో దుకాణాలను మూసివేత నిరసన తెలిపారు. ఈ పరిస్థితిలో, ఈ–పాస్ విధానానికి సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులను మరోమారు సమీక్షించాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం గురువారం మద్రాస్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఊటీలోకి అనుమతించే వాహనాల సంఖ్యను ఐఐటీ, ఐఐఎంల అధ్యయన నివేదిక వచ్చిన తర్వాత నిర్ణయించవచ్చునని, ప్రస్తుత వాహన పరిమితుల వల్ల స్థానిక ప్రజలు ప్రభావితమవుతున్నందున ఈ ఉత్తర్వును పునఃసమీక్షించాలి అభ్యర్థిస్తున్నట్టు పిటిషన్‌లో కోరారు. పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.