
కాలువ మరమ్మతు పనులు పూర్తి చేయండి
వేలూరు: వేలూరు కార్పొరేషన్‌లోని 60 వార్డుల్లో డ్రైనేజీ కాలువ మరమ్మతు పనులను వెంటనే పూర్తి చేసి పూడికతీత పనులు చేపట్టాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం వేలూరు కార్పొరేషన్ పరిధిలోని ముల్‌లైనగర్‌లో జరుగుతున్న డ్రైనేజీ కాలువ పనులను తనఖీ చేశారు. అనంతరం తాగునీటి ట్యాంకు నిర్మాణ పనులు, పైపులైన్ పనులను తనఖీ చేసి వర్షా కాలం రాక ముందే పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో డ్రైనేజి కాలువల్లోని పూడిక తీత పనులు చేపట్టాలన్నారు. డ్రైనేజి నీరు వర్షా కాలంలో రోడ్డుపైకి రాకుండా కాలువలో వెళ్లే విధంగా చూడాలన్నారు. అనంతరం సత్‌వచ్చారి సమీపంలో ఉన్న నెల్సన్ కాలనీలో రోడ్డుపై పేరుకు పోయిన డ్రైనేజి నీటిని తనిఖీ చేసి వెంటనే ఇక్కడ మరమ్మతు పనులు చేపట్టాలన్నారు. పట్టణంలో భూగర్భ డ్రైనేజీ పనులను మరో మాసంలో పూర్తి చేయాలని, వర్షాకాలం వస్తే పనులు చేయలేమన్నారు. తాగునీటిని సక్రమంగా సరఫరా చేయాలని అధికారులు తరచూ తాగునీటి సరఫరాపై తనిఖీలు చేపట్టాలన్నారు. కలెక్టర్‌తోపాటు కార్పొరేషన్ కమిషనర్ జానకి, ఆరోగ్యశాఖ అధికారి శివకుమార్, తాగునీటి సరఫరా చీఫ్ ఇంజినీర్ నిత్యానందం, అసిస్టెంట్ కమిషనర్ సతీష్‌కుమార్, అసిస్టెంట్ ఇంజినీర్ చంద్రశేఖర్, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.