జర్నలిజంలో గోపాలకృష్ణకు గోల్డ్ మెడల్
జర్నలిజంలో విస్తృత పరిశోధన చేసిన గోపాలకృష్ణకు గోల్డ్మెడల్ లభించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆధ్యాత్మిక పత్రికలు - భాష, విషయ విశ్లేషణ అన్న అంశంపై M Phil పరిశోధన చేసిన సీనియర్ జర్నలిస్ట్ మల్లాది వెంకట గోపాలకృష్ణకు శ్రీ బొప్పన్న స్మారక స్వర్ణ పథకం లభించింది. రవీంద్ర భారతిలో జరిగిన విశ్వవిద్యాలయం 16వ స్నాతకోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళసై చేతుల మీదుగా గోపాలకృష్ణ స్వర్ణ పథకాన్ని అందుకున్నారు.
జర్నలిజం కమ్యూనికేషన్ థియరీస్, ఆధ్యాత్మికత, తెలుగు భాష అనే నాలుగు విస్తృతమైన పరిధి కలిగిన రంగాలను మేళవించి, ప్రతిపాదనలు చేసి శాస్త్రబద్ధంగా ఆ ప్రతిపాదనను నిరూపించినందుకు గాను మల్లాది పరిశోధన స్వర్ణ పథకానికి ఎంపికయింది. సబ్ ఎడిటర్ కం రిపోర్టర్ గా వృత్తి జీవితాన్ని మొదలుపెట్టి పలు ఛానళ్లు, పత్రికల్లో పని చేసిన మల్లాది తనదైన శైలిలో ప్రతిభను కనబరిచారు. కవి, రచయిత, భాషావేత్తగా, అనువాదకుడు. బోధకుడిగా నిబద్ధత కలిగిన జర్నలిస్టుగా రాణించారు. పరిశోధన రంగంలో విస్తృతంగా పని చేసిన మల్లాదిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు తంగడి కిషన్ రావు, రిజిస్ట్రార్, గైడ్ ఆచార్య కడియాల సుధీర్ కుమార్, ఆచార్య వెంకటరామయ్య అభినందించారు. పథకాలు అందుకున్న పరిశోధక విద్యార్థిని విద్యార్థులందరికీ గవర్నర్ తమిళసై శుభాకాంక్షలు తెలిపారు.