ముప్పుతిప్పలు పెడుతున్న హనీప్రీత్‌ | Honeypreet not co-operating in police interrogation | Sakshi

ముప్పుతిప్పలు పెడుతున్న హనీప్రీత్‌

Oct 6 2017 2:24 PM | Updated on Oct 6 2017 7:08 PM

Honeypreet not co-operating in police interrogation

సాక్షి, చండీగఢ్‌ : హరియాణా పోలీసుల నుంచి 38 రోజులపాటు తప్పించుకు తిరుగుతూ ముప్పు తిప్పలు పెట్టిన డేరా బాబా గుర్మీత్‌ సింగ్‌ దత్త పుత్రిక హనీప్రీత్‌ ఇన్సాన్‌ పోలీసుల ప్రశ్నలకు ఇప్పటికీ సరైన సమాధానాలు ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు. పంచకుల అల్లర్ల కేసులో పోలీసు అధికారులు ఆమెను మొత్తం 40 ప్రశ్నలు అడగ్గా కేవలం రెండు ప్రశ్నలకు మాత్రమే సూటిగా సమాధానం ఇచ్చారు. 13 ప్రశ్నలకు అసలు సమాధానం ఇవ్వడానికే హనీప్రీత్‌  నిరాకరించారు. మిగతా 25 ప్రశ్నలకు కాదని, లేదా గందరగోళమైన సమాధానాలు ఇచ్చారు. కోర్టు మొత్తం ఆరు రోజుల కస్టడీ ఇచ్చినందున మరో రెండు పర్యాయాలు ఆమెను విచారిస్తామని, అప్పటికీ హనీప్రీత్‌ సరైనా సమాధానాలు ఇవ్వక పోయినట్లయితే నార్కో పరీక్షలకు అనుమతి కోరుతామని పంచకుల పోలీసు కమిషనర్‌ ఏస్‌ చావ్లా తెలిపారు.

డేరా వాహనాల్లో ఎందుకు అక్రమ ఆయుధాలు తీసుకెళ్లారు, సిర్సా వద్ద డేరా వాహనాలన్ని ఎందుకు తగలబెట్టారు, అల్లర్లు సృష్టించేందుకు డేరా అనుచరులకు ఐదు కోట్ల రూపాయలు ఎవరు ఇచ్చారు,  అంతర్జాతీయ సిమ్‌ కార్డుతోపాటు పలు భారత సిమ్‌ కార్డులను మార్చి మార్చి మాట్లాడడం గురించి అడిగిన ప్రశ్నలకు హనీప్రీత్‌ ఎలాంటి సమాధానం ఇవ్వకుండా మౌనం వహించారు. డేరా నుంచి పారిపోయిన డాక్టర్‌ ఆదిత్యతో వాట్సాప్‌లో చేసిన చాటింగ్‌కు సంబంధించిన రెండు ప్రశ్నలకు మాత్రమే ఆమె సరైన సమాధానాలు ఇచ్చారని పోలీసు కమిషనర్‌ చావ్లా చెప్పారు. ఆజ్‌తక్, ఇండియా టుడీ టీవీలకు గురువారం ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత హానీప్రీత్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెల్సిందే. పంచకులలో జరిగిన అల్లర్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను అమాయకురాలినని ఆమె టీవీ ఛానళ్లతో చెప్పారు.

పంచకుల అల్లర్లలో 30 మంది మరణించడం, 350 మందికిపైగా గాయపడడం తెల్సిందే. ఈ కేసులో హనీప్రీత్‌ను అరెస్ట్‌ చేయగానే హరియాణా పోలీసులు ఆమెను 43 మోస్ట్‌ వాంటెడ్‌ నేరస్థుల జాబితాలో చేర్చారు. కోర్టు ఆమెను ఆరు రోజుల కస్టడీకి అప్పగించాక  ఇన్ని రోజులు పాటు పంజాబ్, హరియాణాలోని ఏయే ప్రాంతాల్లో తలదాచుకున్నారో అక్కడకి హనీప్రీత్‌ను తీసుకొని పోలీసు వెళ్లారు. ఆమెతో కొన్ని రోజులు గడిపిన డేరా బాబా గుర్మీత్‌ డ్రైవర్‌ ఇక్బాల్‌ సింగ్‌ భార్య సుఖ్‌దీప్‌ సింగ్‌ను కూడా తీసుకొని బటిండాకు పోలీసులు వెళ్లారు. అక్కడ హానీప్రీత్‌ నాలుగు రోజులపాటు తన మామతో కూడా ఉన్నారు. ఆమె వెళ్లిన సంగ్రూర్, తాపమండి, రాంపుర ప్రాంతాలకు కూడా పోలీసులు వెళ్లి ప్రాథమిక విచారణ జరిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement