breaking news
Governor K Sankaranarayanan
-
‘సాక్ష్యాలు లేనందునే నిరాకరించా’
న్యూఢిల్లీ: ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణంలో మాజీ సీఎం ఆశోక్ చవాన్ పాత్ర ఉన్నట్టు ఎలాంటి ఆధారాలను సీబీఐ చూపించలేకపోయిందని రాష్ట్ర గవర్నర్ కె.శంకర నారాయణన్ అన్నారు. ఈ సొసైటీలో రాజకీయ నాయకులకు కూడా అవకాశం కల్పించేలా రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి హోదాలో అశోక్ చవాన్ ప్రయత్నాలు చేశారన్న ఆరోపణలపై సాక్ష్యాన్ని సీబీఐ సేకరించలేకపోయిందని న్యూఢిల్లీలో బుధవారం విలేకరులతో అన్నారు. దీన్ని ఆధారంగానే చేసుకునే చవాన్‌ను విచారించేందుకు సీబీఐకి అనుమతించలేదని వివరించారు. 2000వ సంవత్సరంలో ఫ్లాట్ల కేటాయింపులో చవాన్ క్రిడ్ ప్రో కోకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయని, అయితే 2004లో జూన్ 18న చవాన్ వదిన చేసుకున్న దరఖాస్తును తిరస్కరణకు గురైందన్నారు. 2000 సమావేశానికి, 2004 దరఖాస్తుకు చాలా కాలం వ్యత్యాసముందన్నారు. చివరగా 2008, నవంబర్ 10న ఆమెకు సభ్యత్వం ఇచ్చారని తెలిపారు. అయితే ఆ సమయంలో చవాన్ రెవెన్యూ శాఖ మంత్రి కానీ, సీఎం హోదాలో కానీ లేరని తెలిపారు. సీఆర్పీసీ 197 సెక్షన్ కింద మాత్రమే చవాన్‌ను విచారించేందుకు సీబీఐ అనుమతి కోరిందని, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 19 కింద కాదని చెప్పారు. తన వద్దకు వచ్చిన అన్ని పత్రాలను పరిశీలించాకే సీబీఐ విచారణకు అనుమతించలేదని వివరించారు. గతంలో ఆదర్శ్ కుంభకోణంలో ఆరోపణలు రావడంతో సీఎం పదవికి అశోక్ చవాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ కుంభకోణం నుంచి చవాన్ పేరును తప్పించాలంటూ ఇటీవల బాంబే హైకోర్టుకు వెళ్లిన సీబీఐకి చుక్కెదురైంది. -
మల్టీపర్పస్ వర్చువల్ క్లాస్రూమ్ ప్రారంభం
ముంబై: యూనివర్సిటీ విద్య ఇక రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో లక్షలాది మంది విద్యార్థులకు అందుబాటులోకి వచ్చింది. ముంబై యూనివర్సిటీలో శనివారం బహుళార్ధసార్థక వాస్తవిక తరగతి గది (ఎంవీసీ)ని గవర్నర్ శంకర్ నారాయణన్ ప్రారంభించారు. హార్వర్డ్ యూనివర్సిటీ తరహాలో పని చేసే ఈ ఎంవీసీ ద్వారా మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులు సైతం నిపుణులైన బోధకుల నుంచి ప్రత్యేక ప్రసంగాలు వినవచ్చు. వర్క్‌షాప్‌లు, సదస్సులను తిలకించవచ్చు. ఈ సందర్భంగా గవర్నర్ కె.శంకర్ నారాయణన్ మాట్లాడుతూ ప్రపంచస్థాయి వర్సిటీల సరసన ముంబై యూనివర్సిటీ ఉండేలా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. దీనికోసం కాలపరిమితిని నిర్దేశించుకొని తగిన రోడ్‌మ్యాప్ ద్వారా లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేయాలని వైస్ చాన్సలర్ రాజన్ వెలుకర్‌కు సూచించారు. ప్రపంచంలోని టాప్ 200 వర్సిటీల్లో భారత్‌లోని ఒక్క వర్సిటీ కూడా లేకపోవడం విచారంగా ఉందన్నారు. అయితే ఈ అంశంలో ముంబై వర్సిటీ సరికొత్త చరిత్ర సృష్టించాలని ఆకాంక్షించారు. ‘మన విద్యార్థులు అమెరికా, జర్మనీలోని యూనివర్సిటీలకు ఎందుకు ప్రాధాన్యతనిస్తున్నారు. అక్కడి స్థాయి విద్యను మనం ఎందుకు అందించలేకపోతున్నామ’ని ఆయన ప్రశ్నించారు. దీన్ని అధిగమించేందుకు క్యాంపస్ అభివృద్ధితో పాటు తాజా కోర్సులను ఎప్పటికప్పుడు విద్యార్థులకు పరిచయం చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మాట్లాడుతూ అధ్యాపక బృందం లేకపోవడంతోనే ప్రపంచ ర్యాంకింగ్‌లో భారత వర్సిటీలకు స్థానం లభించడం లేదన్నారు. ఆధునిక సాంకేతిక నిపుణులైన అధ్యాపకులు రానంతవరకు మన వర్సిటీలు ప్రపంచస్థాయి ర్యాంకింగ్‌ను దక్కించుకోలేవని తెలిపారు. ఎంవీసీ లాంటివి అమలుచేసేందుకు రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన సహకారం అందుతుందన్నారు. ఈ వర్చువల్ క్లాస్రూమ్ ఉపాధ్యాయుల శిక్షణకు, నైపుణ్యాన్ని మెరుగుపరచుకునేందుకు, పనిచేసే వారికి సాయంత్రం వేళలో విద్యను అందించేందుకు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హార్వర్డ్ యూనివర్సిటీ తరహాలో... రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది విద్యార్థుల చెంతకు అన్లైన్ చదువు పాఠాలు చేరేలా ముంబై యూనివర్సిటీ సరికొత్త పంథాను ఎంచుకుంది. హార్వర్డ్ యూనివర్సిటీ స్థాయిలో కొత్త మల్టీపర్పస్ వర్చువల్ క్లాస్రూమ్ (ఎంవీసీ)ను పరిచయం చేసింది. నిపుణుల ప్రత్యేక బోధనలు, చర్చాగోష్టి, సదస్సులను ఎంవీసీ సహాయంతో ముఖాముఖి నిర్వహించే వెసులుబాటును కల్పించింది. దీనివల్ల లెక్చరర్ల కొరత సమస్యకు కూడా పరిష్కారం లభించనుంది. పరిమిత వనరులతో ఆయా అంశాలపై విద్యార్థులు పట్టు సాధించుకునే అవకాశం ఉంది. ఎంవీసీలో భవిష్యత్‌లో అన్లైన్ కోర్సులను కూడా చేర్పించే అవకాశముంది. ఇప్పటికే ఈ వర్సిటీకి చెందిన 700 అనుబంధ కళాశాలల్లో 420 కళాశాలలు ఈ డిజిటల్ వ్యవస్థ కోసం పేరును నమోదుచేసుకున్నాయి. అయితే ఏ-వ్యూ వర్చువల్ లెర్నింగ్ టూల్‌ను అమృతా యూనివర్సిటీ డిజైన్ చేసింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్య శాఖ మంత్రి డీపీ సావంత్, ముంబై వర్సిటీ వైస్ చాన్సలర్ నరేశ్ చంద్ర, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.