ఇస్రోకు మరో రెండు లాంచ్‌ ప్యాడ్లు  | Isro to get two new launchpads in two states | Sakshi

ఇస్రోకు మరో రెండు లాంచ్‌ ప్యాడ్లు 

Mar 10 2025 6:17 AM | Updated on Mar 10 2025 6:17 AM

Isro to get two new launchpads in two states

ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో నిర్మాణం  

వచ్చే రెండేళ్లలో అందుబాటులోకి 

న్యూఢిల్లీ: వినూత్నమైన అంతరిక్ష ప్రయోగాల్లో దూసుకెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన శక్తి సామర్థ్యాలను మరింత పెంచుకునే ప్రయత్నాల్లో భాగంగా మరో రెండు నూతన లాంచ్‌ప్యాడ్లను సమకూర్చుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో, తమిళనాడులోని కులశేఖరపట్నంలో వీటిని నిర్మిస్తున్నట్టు ఇస్రో చైర్మన్‌ వి.నారాయణన్‌ ధ్రువీకరించారు. వీటిని రెండేళ్లలో అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. వాటిద్వారా అత్యాధునిక రాకెట్లను నింగిలోకి పంపనున్నారు. 

కొత్త లాంచ్‌పాడ్‌లతో ఇస్రో రాకెట్‌ ప్రయోగ సామర్థ్యం మరింత ఇనుమడించనుందని చైర్మన్‌ అన్నారు. చంద్రయాన్‌–4కు సంబంధించి ఆయన కీలక ప్రకటన చేశారు. 2028లో ప్రయోగం చేపట్టనున్నట్లు తెలిపారు. చంద్రయాన్‌–3 ఉపగ్రహం మొత్తం బరువు 4,000 కిలోలు కాగా చంద్రయాన్‌–4 9,200 కిలోలుంటుందని వెల్లడించారు. చందమామపైకి చేరుకొని, అక్కడి నమూనాలను సేకరించి విజయవంతంగా రావడం చంద్రయాన్‌–4 మిషన్‌ లక్ష్యం. చంద్రుడిపై మన ప్రయోగాల్లో ఇది కీలక మలుపు కానుందని చెబుతున్నారు. 

మహిళా సైంటిస్టులకు ప్రాధాన్యం 
అంతరిక్ష ప్రయోగాల్లో పురుషులతో సమానంగా మహిళా సైంటిస్టులకు ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు నారాయణన్‌ పేర్కొన్నారు. చంద్రయాన్, మార్స్‌ ఆర్బిటార్‌ మిషన్‌ ప్రయోగాల్లో మహిళలది కీలక పాత్ర అని ప్రశంసించారు. అమెరికా, భారత్‌ ఉమ్మడిగా ‘నిసార్‌’ శాటిలైట్‌ను అభివృద్ధి చేస్తున్నాయన్నారు. దాన్ని జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–2 రాకెట్‌ ద్వారా ప్రయోగించనున్నట్లు తెలియజేశారు. పర్యావరణ మార్పులపై అధ్యయనానికి ఈ ఉపగ్రహం తోడ్పడుతుందన్నారు. వాతావరణ పరిస్థితులపై అధ్యయనానికి జి–20 శాటిలైట్‌ రూపకల్పనలో ఇస్రో నిమగ్నమైంది. ఇందులో 40 శాతం పేలోడ్లు దేశీయంగా అభివృద్ధి చేసినవే కావడం విశేషం. భారత తయారీ రాకెట్లతో ఇప్పటిదాకా 34 దేశాలకు చెందిన 433 ఉపగ్రహాలను ప్రయోగించినట్టు వి.నారాయణన్‌ వెల్లడించారు. ఇందులో 90 శాతం ప్రయోగాలు గత పదేళ్లలోనే జరిగాయన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement