
సాక్షి, న్యూఢిల్లీ: ఉచితాల హామీలు ఇవ్వకుండా రాజకీయ పార్టీలను తాము అడ్డుకోలేమని సుప్రీంకోర్టు వెల్లడించింది. ప్రజల సంక్షేమం ప్రభుత్వాల బాధ్యతని.. ప్రజాధనాన్ని సరైన పద్ధతిలో వెచ్చించడమే ఇక్కడ ప్రధాన అంశమని పేర్కొంది. ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ఓటర్లకు ఉచిత హామీలు చేయకుండా నిరోధించాలని కోరుతూ లాయర్ అశ్విని ఉపాధ్యాయ్ దాఖలుచేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం విచారించింది.
ఉచితం అనే పదాన్నే నిర్వచించాల్సిన అవసరం ఉందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకం, ఉచిత తాగునీరు, విద్య, వైద్య సదుపాయాలను ఉచితాలుగా వర్ణించలేమనిపేర్కొన్నారు. ఎన్నికల్లో రాజకీయ పార్టీల విజయానికి ఉచిత హామీలే కారణమని చెప్పలేమన్నారు. ఉచిత వాగ్దానాలు చేసినా ఎన్నికల్లో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు.
ఉచిత వాగ్దానాల సమస్య జఠిలమవుతోందన్న జస్టిస్ ఎన్వీ రమణ అసలు ఉచిత హామీ, సంక్షేమ పథకం అని తేల్చేది ఎలా అంటూ ప్రశ్నించారు. ఉచిత తాయిలం అంటే ఏంటో అర్థాన్ని వివరించాల్సిన అవసరం ఉందని, దీనిపై మరింత చర్చ జరగాలని పేర్కొన్నారు. శనివారం (ఆగస్టు 20)లోగా తమ సూచనలు దాఖలు చేయాలని రాజకీయ పార్టీలను సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 22కు వాయిదా వేసింది.
చదవండి: బిహార్‌లో న్యాయశాఖ మంత్రి అరెస్టు కలకలం... తనకేం తెలియదన్న సీఎం