నీట్‌ రాష్ట్ర ర్యాంకులు విడుదల | NEET state ranks released | Sakshi

నీట్‌ రాష్ట్ర ర్యాంకులు విడుదల

Aug 4 2024 4:45 AM | Updated on Aug 4 2024 4:45 AM

NEET state ranks released

టాపర్‌గా 711 మార్కులతో అనురాన్‌ ఘోష్‌ 

తెలంగాణ విద్యార్థులకు 49,184 ర్యాంకులు 

రేపటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు 

స్థానికతకు 9, 10 తరగతులు.. ఇంటర్‌తో కలిపి నాలుగేళ్లు కొలమానం

వైద్య సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌

సాక్షి, హైదరాబాద్‌: ఎంబీబీఎస్, బీడీఎస్‌ కన్వినర్‌ కోటా సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం షెడ్యూల్‌ విడుదల చేసింది. రాష్ట్రం నుంచి నీట్‌ రాసిన విద్యార్థుల ప్రాథమిక ర్యాంకుల జాబితాను కూడా విడుదల చేసింది. తెలంగాణ టాపర్‌గా అనురాన్‌ ఘోష్‌ నిలిచాడు. అతనికి నీట్‌లో 711 మార్కులు వచ్చాయి. 

రాష్ట్ర సెకండ్‌ టాపర్‌గా సుహాస్‌ నిలిచాడు. తెలంగాణ నుంచి ఈసారి 49,184 మంది నీట్‌లో అర్హత పొందారు. వారికొచ్చిన మార్కులు, ఆలిండియా ర్యాంకులను జాబితాలో పొందుపర్చారు. ఈ జాబితాలో ఉన్న విద్యార్థులు కన్వీనర్‌ కోటాలో ప్రవేశాల కోసం ఈ నెల 4న ఉదయం 6 గంటల నుంచి ఈ నెల 13న సాయంత్రం 6 గంటల వరకూ వర్సిటీ వెబ్‌సైట్‌లో (https://tsmedadm.tsche.in) దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ సూచించింది.

 విద్యార్హత, స్థానికత, కమ్యూనిటీ తదితర సర్టిఫికెట్లను అప్‌లోడ్‌ చేయాలని సూచించింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ అనంతరం మెరిట్‌ లిస్ట్‌ (స్టేట్‌ ర్యాంక్స్‌)ను విడుదల చేస్తామని తెలిపింది. ఆ తర్వాత వెబ్‌ ఆప్షన్లు తీసుకుంటామని, కాలేజీలు, సీట్ల వివరాలను వెబ్‌ఆప్షన్లకు ముందు వెల్లడిస్తామని పేర్కొంది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపీకి, తెలంగాణకు ఉన్న 15 శాతం అన్‌ రిజర్వ్‌డ్‌ కోటాను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు అడ్మిషన్‌ నిబంధనల్లో మార్పు చేస్తూ ప్రభుత్వం గత నెలలో జీవోను విడుదల చేసింది. 

ఈ జీవో ప్రకారమే సీట్ల భర్తీ చేపడుతామని నోటిఫికేషన్‌లో యూనివర్సిటీ పేర్కొంది. ఈ జీవో ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లోని 85 శాతం సీట్లను కన్వినర్‌ కోటాలో భర్తీ చేస్తారు. ఇంకో 15 శాతం సీట్లను ఆలిండియా కోటాలో భర్తీ చేస్తారు. ఇక ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోని 50 శాతం సీట్లను కన్వీనర్‌ కోటాలో, ఇంకో 50 శాతం సీట్లను మేనేజ్‌మెంట్‌ కోటాలో భర్తీ చేయనున్నారు. గతంలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లోని 15 శాతం సీట్లను ఓపెన్‌లో పెట్టి, వాటిని తెలంగాణ, ఏపీ విద్యార్థుల్లో ఎవరికి మెరిట్‌ ఉంటే వారికి కేటాయించేవారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు కావడంతో ఈ కోటాను (అన్‌ రిజర్వ్‌డ్‌) ప్రభుత్వం రద్దు చేసింది.  

వరుసగా నాలుగేళ్లు చదవాల్సిందే...  
స్థానికతను గుర్తించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 6వ తరగతి నుంచి ఇంటర్‌ సెకండియర్‌ వరకు అంటే ఏడేళ్లలో నాలుగేళ్లు తెలంగాణలో చదివితే స్థానికత ఉన్నట్లుగా గుర్తించేవారు. ఈసారి ఆ నిబంధనలో మార్పు చేశారు. 9వ తరగతి నుంచి ఇంటర్‌ సెకండియర్‌ వరకు వరుసగా 4 ఏళ్లు తెలంగాణలో చదివిన వాళ్లనే తెలంగాణ స్థానికులుగా గుర్తిస్తామని పేర్కొన్నారు. 9వ తరగతి కంటే ముందు ఎక్కడ చదివారనే దాంతో సంబంధం లేదని స్పష్టం చేశారు. దీనివల్ల స్థానికతకు కచి్చతత్వం ఉంటుందని అంటున్నారు.  

ఎంబీబీఎస్‌ సీట్లు 8,690 
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో మొత్తం 8,690 సీట్లు ఉండగా వాటిల్లో 31 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 3,990 సీట్లున్నాయి. అలాగే 29 ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో 4,700 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. మరో నాలుగు ప్రభుత్వ మెడికల్‌  కాలేజీల అనుమతి కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కౌన్సెలింగ్‌ పూర్తయ్యేలోగా అవి వస్తే మరో 200 ఎంబీబీఎస్‌ సీట్లు ప్రభుత్వ కాలేజీల్లో అందుబాటులోకి రానున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement