11 వేల పోస్టులతో డీఎస్సీ! | TS Govt Likely to Issue Notification for 11000 DSC Posts | Sakshi

11 వేల పోస్టులతో డీఎస్సీ!

Feb 24 2024 4:38 AM | Updated on Feb 24 2024 4:38 AM

TS Govt Likely to Issue Notification for 11000 DSC Posts - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లోపే వీలైనంత త్వరగా డీఎస్సీ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. డీఎస్సీ ద్వారా మొత్తం 11 వేల టీచర్‌ పోస్టుల భర్తీ ఉండొచ్చని అధికార వర్గాలు సూచనప్రాయంగా చెబుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని రెండ్రోజుల క్రితం కలిసిన ఉన్నతాధికారులు.. టీచర్‌ పోస్టుల ఖాళీలు, వాటి భర్తీ విధానం, న్యాయపరమైన చిక్కుల గురించి వివరించారు. పదోన్నతుల ద్వారా భర్తీ చేసే ఖాళీలు విడిచిపెట్టి మిగతా వాటిని డీఎస్సీలో చేర్చాలని ఈ భేటీలో సీఎం నిర్ణయించారు. దీంతో టీచర్‌ పోస్టుల భర్తీకి విద్యాశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదానికి ఫైల్‌ను పంపింది. దానికి అనుమతి రావాల్సి ఉంది. ఒకట్రెండు రోజుల్లో ఇది పూర్తవుతుందని, వెనువెంటనే ఏ క్షణమైనా నోటిఫికేషన్‌ ఇచ్చే వీలుందని అధికార వర్గాల సమాచారం.  

ఇప్పటికే ఓసారి నోటిఫికేషన్‌... 
గత ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు 5,089 టీచర్‌ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఈ పోస్టులకు 1,77,502 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే డీఎస్సీ పరీక్ష తేదీల సమయంలోనే అసెంబ్లీ పోలింగ్‌ తేదీలు రావడంతో డీఎస్సీని రద్దు చేయాల్సి వచ్చింది. అదీగాక.. డీఎస్సీలో ప్రకటించిన 5,089 పోస్టులు కూడా రోస్టర్‌ విధానం తర్వాత కొన్ని జిల్లాల్లో ఖాళీల్లేని పరిస్థితి తలెత్తింది. నాన్‌–లోకల్‌ జిల్లా కోటాలో డీఎస్సీకి వెళ్లేందుకూ పోస్టులు లేకపోవడం నిరుద్యోగులను నిరాశపరిచింది.  

లోపాల్లేకుండా చూడాలి.. 
నిరుద్యోగుల్లో డీఎస్సీ నిర్వహణ ఆనందం నింపు తోంది. ఈ ప్రక్రియలో ఎలాంటి లోపాల్లే కుండా చూడాలి. వీలైనంత త్వరగా టీచర్ల పదోన్నతులు చేపట్టి.. ఖాళీలను భర్తీ చేయాలి.   – రామ్మోహన్‌రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు, డీఎడ్, బీఎడ్‌ అభ్యర్థుల సంఘం 

ఖాళీలు ఎన్ని?.. భర్తీ చేసేవి ఎన్ని? 
రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో డీఈవోలు, డిప్యూటీ డీఈవోలు సహా మొత్తం టీచర్‌ పోస్టులు 21 వేల వరకూ ఖాళీగా ఉన్నాయి. వాటిలో స్కూల్‌ అసిస్టెంట్లకు పదోన్నతి కలి్పంచడం ద్వారా 1,974 హెచ్‌ఎం పోస్టులను, ప్రమోషన్ల ద్వారా 2,043 ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎం పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 7,200 వరకూ ఖాళీలు ఉండగా వాటిలో 70 శాతం ప్రమోషన్ల ద్వారా మిగిలిన 30 శాతం పోస్టులను నేరుగా భర్తీ చేయాల్సి ఉంటుంది.

పదోన్నతుల ప్రక్రియకు కోర్టు చిక్కులున్నాయి. కాబట్టి నేరుగా భర్తీ చేసే పోస్టులను డీఎస్సీ పరిధిలోకి తెచ్చే యోచనలో అధికారులు ఉన్నారు. అలాగే సెకండరీ గ్రేడెడ్‌ ఉపాధ్యాయుల పోస్టుల్లో 6,775 ఖాళీలున్నాయి. వాటిని భర్తీ చేసేందుకే ప్రయత్నిస్తున్నారు. పండిట్, పీఈటీ పోస్టులు దాదాపు 800 వరకూ ఉండొచ్చని అంచనా వేశారు. ఈ లెక్కన మొత్తంగా 11 వేలకుపైగా పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement