భారత్ గెలుపుకోసం మోకాళ్లపై కొండపైకి...
తిరుపతి: ప్రపంచకప్ క్రికెట్ పోటీల్లో భారత్ జట్టు గెలవాలని ఆకాంక్షిస్తూ తిరుపతికి చెందిన ఓ యువ క్రీడాకారుడు బుధవారం తిరుపతి అలిపిరి నుంచి తిరుమలకు మోకాళ్లపై నడిచి వెళ్లాడు. తిరుపతి ముత్యాలరెడ్డిపల్లెకు చెందిన తాళ్లపాక చాణక్య తిరుపతిలోని కేశవ రెడ్డి కాన్సెప్ట్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. ఆంధ్రక్రికెట్ అసోసియేషన్ వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకుంటూ, పలు రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో ప్రతిభను చాటుతున్నాడు. బుధవారం సాయంత్రం అలిపిరి పాదాల మండపం వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన మోకాళ్లపై తిరుమలకు బయలుదేరాడు. ఈసందర్భంగా చాణక్య మీడియాతో మాట్లాడుతూ గురువారం జరగనున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ జట్టు గెలవాలని, అనంతరం ఫైనల్స్‌లో గెలిచి దేశానికి ప్రపంచకప్ తీసుకురావాలన్న ఆకాంక్షించాడు. గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటానన్నారు. ఇదిలా ఉండగా చాణక్య ప్రస్తుతం ఆంధ్ర జట్టు అండర్ 14 విభాగంలో స్టాండ్ బై వికెట్ కీపర్‌గా ఉన్నాడు.