దొనకొండకు 4 లేన్ల రోడ్లు
కర్నూలు-దొనకొండ, అద్దంకి- దొనకొండ రోడ్లకు ప్రతిపాదనలు
రోడ్ల అభివృద్ధికి మలేసియా కన్సల్టెన్సీ నివేదిక
ఇండస్ట్రియల్ హబ్‌గా మారాలంటే రోడ్ కనెక్టివిటీ తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: ప్రకాశం జిల్లాలో దొనకొండను పారిశ్రామిక హబ్‌గా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ముందుగా రోడ్ కనెక్టివిటీపై ప్రభుత్వం దృష్టి సారించింది. శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో సీఆర్‌డీఏ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు దొనకొండను ఇండస్ట్రియల్ హబ్‌గా తీర్చిదిద్దనున్నట్లు ప్రకటించారు. అంతకుముందే ఇక్కడున్న 45 వేల ఎకరాల ప్రభుత్వ భూముల్లో పారిశ్రామిక హబ్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై రాష్ట్ర ప్రభుత్వం మలేసియా కన్సల్టెన్సీ నివేదిక కోరింది. మలేసియా కన్సల్టెన్సీ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో ప్రధానంగా రోడ్ కనెక్టివిటీపై సూచనలు చేసింది. దొనకొండలో భూముల లభ్యత, అనుకూలత కారణంగా ఇక్కడ పరిశ్రమలు స్థాపించేందుకు, ప్రధానంగా ఫార్మా రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారని, రూ.500 కోట్ల మేర ఒక్క ఫార్మా రంగంలోనే పెట్టుబడులు పెడతారని నివేదిక స్పష్టం చేసింది.
మరోవైపు ప్రభుత్వం కూడా సోలార్ పరికరాల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలో కర్నూలు నుంచి దొనకొండకు, అద్దంకి నుంచి దొనకొండకు నాలుగు లేన్ల రహదారులు నిర్మించేందుకు ఆర్‌అండ్‌బీ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం దొనకొండకు రోడ్ కనెక్టివిటీ సరిగా లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతంలో రోడ్ల అభివృద్ధిపై దృష్టి సారించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు సొంత జిల్లా ప్రకాశం కావడం, దొనకొండపై ఆయన తరచూ ఏపీఐఐసీ, ఇతర అధికారులతో సమీక్షలు నిర్వహిస్తుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన దొనకొండకు రోడ్ కనెక్టివిటీ, అభివృద్ధిపై డీపీఆర్(డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి.