సాక్షి, హైదరాబాద్: కళారంగంలో విశేష ప్రతిభ కనబర్చిన వారికి ఎన్టీఆర్ పేరుతో అవార్డు అందజేస్తున్నట్లుగానే.. ఏఎన్నార్ (అక్కినేని నాగేశ్వరరావు) పేరు మీదుగా కూడా ఒక అవార్డును నెలకొల్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సహచర ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, కె.శ్రీనివాసులు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డితో కలసి ఆయన బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడారు. అక్కినేని కోట్లాది మంది గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. తెలుగు భాషకు ఒక నిఘంటువులా నిలిచిన ఏఎన్నార్ గొప్పతనాన్ని భవిష్య త్తరాలకు తెలియజేసే విధంగా ఒక మెమోరియల్ ట్రస్టు ఏర్పాటు చేయాలని కోరారు. ఇదే విషయాన్ని అసెంబ్లీ వేదికగా డిమాండ్ చేయాలని తమ పార్టీ భావించినప్పటికీ అవకాశం రాలేదన్నారు. ఏఎన్నార్ మృతి పట్ల ప్రగాఢ సంతాపంతో పాటు, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు.