విజయనగరం క్రైం: మోటూరు హనుమంతరావు 14వ స్మారక ఉత్తమ జర్నలిస్టు అవార్డును హైదరాబాద్‌కు చెందిన సాక్షి రిపోర్టర్ అమరయ్యకు గురువారం ప్రదానం చేయనున్నట్టు ప్రజాశక్తి ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎస్.వెంకటరావు తెలిపారు. బుధవారం ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 14 సంవత్సరాల నుంచి మోటూరు హనుమంతరావు పేరున ఉత్తమ జర్నలిస్టులకు అవార్డులను అందిస్తున్నామన్నారు. ఈ ఏడాది భూమి, బతుకు, భద్రత అనే అంశాలపై చక్కటి వార్తలు రాసిన వారికి అవార్డుకు పరిశీలించినట్టు చెప్పారు.
రాష్ట్ర రాజధాని నిర్మాణ ప్రాంతం అమరావతిలో రైతు కూలీలు ఇబ్బందులు పడుతున్న తీరుపై అమరయ్య చక్కటి వార్తలు రాశారని తెలిపారు. న్యాయనిర్ణేతలుగా పొత్తూరు వెంకటేశ్వరరావు, సీనియర్ పాత్రికేయులు సి.రాఘవాచారి, నాగార్జున యూనివర్సిటీ జర్నలిజం విభాగం అధిపతి జి.అనిత వ్యహరించారని చెప్పారు. గురువారం మోసానిక్ టెంపుల్లో జరిగే అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో హన్స్ ఇండియా ఎడిటర్, మాజీ ఎమ్మెల్సీ కె.నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రత్యేక హోదా అనే అంశంపై స్మారకోపన్యాసం చేస్తారన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాశక్తి ఎడిటర్ పాటూరి రామయ్య, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శోభాస్వాతిరాణి, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, విజయనగరం ఎమ్మెల్యే మీసాలగీత, కలెక్టర్ ఎం.ఎం.నాయక్, ప్రజాశక్తి సాహితి సంస్థ చైర్మన్ వి.కృష్ణయ్య, నవతెలంగాణ ఎడిటర్ ఎస్.వీరయ్య, ప్రజాశక్తి జనరల్ మేనేజర్ పి.ప్రభాకర్ పాల్గొంటారని తెలిపారు. విలేకరుల సమావేంలో ఎడిటోరియల్ రాష్ట్ర బాధ్యులు కె.గెడ్డన్న, ప్రజాశక్తి శ్రీకాకుళం ఎడిషన్ మేనేజర్ ఎం.వెంకటేష్, జిల్లా ఇన్‌ఛార్జ్ గణేష్ పాల్గొన్నారు.
సాక్షి రిపోర్టర్ అమరయ్యకు ఉత్తమ జర్నలిస్టు అవార్డు
Published Thu, Jun 18 2015 12:53 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement