అనుమానాస్పదస్థితిలో అధ్యాపకుడి మృతి
కావలిఅర్బన్: అనుమానాస్పదస్థితిలో అధ్యాపకుడు మృతిచెందిన సంఘటన బుడమగుంట గేటు సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. తుఫాన్‌నగర్‌కు చెందిన బోగిశెట్టి శ్రీనివాసులు (25) రైలు పట్టాలపై మృతి చెంది కన్పించారు. రైల్వే పోలీసులు, బంధువుల కథనం మేరకు వివరాలు.. స్టీలు సామాను వ్యాపారం చేసుకునే కృష్ణయ్య, భాస్కరమ్మకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. పెద్దకుమారుడు శ్రీనివాసులు నెల్లూరులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు.
వెంగళరావునగర్‌లో గురువారం రాత్రి జరిగిన తన సోదరి శ్రీలేఖ వివాహానికి శ్రీనివాసులు కావలి వచ్చారు. పెళ్లిలో చాలా ఉత్సాహంగా గడిపారు. తెల్లవారుజామున నిద్రించేందుకు తన రూముకు వెళ్లారు. 4.30 సమయంలో బంధువులు ఫోన్‌చేస్తే రూములో ఉన్నానని చెప్పారు. శుక్రవారం ఉదయం బుడమగుంట గేటు సమీపాన దిగువ లైను రైలుపట్టాల వద్ద పడి ఉన్న శ్రీనివాసులు మృతదేహాన్ని కీ మ్యాన్ రమేష్ గుర్తించి రైల్వే అధికారులకు సమాచారం అందించారు.
విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఏరియా వైద్యశాలకు తరలించారు. ఆస్పత్రికి చేరుకున్న కటుంబసభ్యులు, బంధువులు క న్నీరుమున్నీరయ్యారు. శ్రీనివాసులు మృతి అనుమానాస్పదంగా ఉందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి పందిటి కామరాజు తెలిపారు. పోలీసులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.