
రుణవిముక్తి పత్రమా.. టీడీపీ కరపత్రమా?
పెద్దాపురం : రైతు సాధికార సదస్సు పేరిట గ్రామాల్లో మూడు రోజులుగా కార్యక్రమాలు నిర్వహించి, రైతులకు అందిస్తున్న రుణ విముక్తి పత్రాలు పైసా కూడా ఉపయోగం ఉండడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవి టీడీపీ కరపత్రాలుగా మారాయని పలువురు ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతుల నుద్దేశించి ఆత్మీయ సందేశాన్ని ఈ పత్రంలో పొందుపరిచి, అధికారులతో సభల్లో చదివి వినిపిస్తున్నారు. నెట్‌ల ద్వారా వచ్చిన సమాచారాన్ని పత్రంలో చేర్చి మొక్కుబడిగా రైతులకు అందజేస్తున్నారు.
వీటిని అందుకుని రైతులు బ్యాంకులకు వెళితే అక్కడ ఈ కాగితాలు చూసి బ్యాంకు అధికారులు చెప్పిన సమాధానంతో రైతులు బిక్కమొహం వేస్తున్నారు. కర పత్రం రూపంలో ఉన్న కాగితానికి విలువలేదని బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. ఈ పత్రాలు ఎవరూ ఇచ్చారో కూడా స్పష్టంగా లేదు. చంద్రబాబునాయుడి నమూనా సంతకంతో ఈ కరపత్రం ఉంది. కనీసం రైతు సాధికార సంస్థ అధికారుల సంతకం కూడా లేదు. ఏ ఖాతా నుంచి రుణమాఫీ సొమ్ము వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.