సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలకమైన నిర్ణయం తీసుకుంది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి ఏపీ ప్రభుత్వం సాధారణ సమ్మతి (జనరల్ కన్సెంట్)ని పునరుద్ధరించింది. రాష్ట్రంలో సీబీఐ సోదాలు చేపట్టే అధికారాన్ని నిరాకరిస్తూ గతేడాది నవంబర్‌లో టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన జోవో ను రద్దు చేస్తూ.. సీబీఐ ప్రవేశానికి వీలుగా సాధారణ సమ్మతిని పునరుద్దరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తాజా జీవోతో రాష్ట్రలోని కేసుల విచారణకు సీబీఐకి మార్గం సులభం కానుంది. ఇక మీదట ఆంధ్రప్రదేశ్‌లో సీబీఐ ఎప్పుడైనా దర్యాప్తు చేసుకునే అవకాశాలు ఉన్నాయి.
రాష్ట్రంలో సీబీఐ ప్రవేశానికి అనుమతి నిరాకరిస్తూ గతేడాది నవంబర్ 8న టీడీపీ ప్రభుత్వం జోవో జారీ చేసింది. ఐటీ, సీబీఐ దాడులతో టీడీపీ నేతలను ఇబ్బందులు పెడుతున్నారని కుంటి సాకులు చెబుతూ అనుమతి నిరాకరించారు. అంతకు ముందు ఇచ్చిన సమ్మతి నోటిఫికేషన్‌ను విత్ డ్రా చేసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ మినహా మిగతా రాష్ట్రాల్లో సీబీఐ తన అధికారాలను వినియోగించుకోవాలంటే ఆయా రాష్ట్రాలు సాధారణ సమ్మతి తెలపాల్సి ఉంటుంది. అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆ ఉత్తర్వులను రద్దు చేయడంలో రాష్ట్రంలో దాడులు, దర్యాప్తు చేసేందుకు సీబీఐ పరిధి రద్దు అయినట్టు పేర్కొంది. జనరల్ కన్సెంట్ లేకుంటే రాష్ట్రంలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను విచారించడానికి కూడా సీబీఐకి అధికారం ఉండదు. తద్వారా రాష్ట్రంలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై కూడా రాష్ట్ర ఏసీబీనే దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. తాజాగా వైఎస్ జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవోతో రాష్ట్రంలో కేసుల విచారణకు సీబీఐకి మార్గం సులభమైంది.
Comments
Please login to add a commentAdd a comment