పరాయి రాష్ట్రంలో ఏపీ ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు. సమైక్యంగా ఉన్న రోజుల్లో తెలంగాణలో ఉపాధ్యాయులుగా చేరినవారు ఇప్పుడు విభజనానంతరం తిరిగి సొంత రాష్ట్రానికి రాలేక నానా తిప్పలు పడుతున్నారు. అక్కడివారి అవహేళనతో దినదినగండంగా జీవనం సాగిస్తున్నారు. ఇక్కడ బీసీలుగా ఉన్నవారు సైతం అక్కడ ఓసీలుగా మారి... అక్కడ హెల్త్‌కార్డులు ఏపీలో పనిచేయక అయోమయంలో గడుపుతున్నారు.
విజయనగరం, పార్వతీపురంటౌన్/విజయనగరం అర్బన్ : ఒక రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయిన సందర్భంలో ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలు, ఉద్యోగులు, వ్యాపార వర్గాల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమన్వయంతో మాట్లాడి సమస్యలను అధిగమించాలి. కానీ ఆ దిశగా అడుగులు పడకపోవడంతో అనేక రంగాలు ఇరకాటంలో పడ్డాయి. ముఖ్యంగా విద్యాశాఖలో పనిచేస్తున్న ఆంధ్రా ఉపాధ్యాయుల పరిస్థితి తెలంగణలో దయనీయంగా మారింది. కన్న తల్లిదండ్రులను, కట్టుకున్న భార్యను, కడుపున బుట్టిన పిల్లలను విడిచిపెట్టి రాష్ట్రం కాని రాçష్ట్రంలో మనసు చంపుకొని అడుగడుగునా అవమానాలు ఎదుర్కొని విధులు నిర్వహించాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది.
రాష్ట్ర విభజన జరిగిన తరువాత పోలవరం ముంపు గ్రామాల్లో పనిచేస్తున్న తెలంగాణా ఉపాధ్యాయులను తమ రాష్ట్రానికి తీసుకుపోవడానికి అక్కడి ప్రభుత్వం ప్రత్యేక చొరవచూపింది. కానీ రాష్ట్ర విభజన తరువాత తెలంగాణాలో ఉండిపోయిన 470మంది ఏపీ ఉపాధ్యాయులను మన రాష్ట్రానికి తీసుకురావడంలో మన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. కేవలం వీరికి జీతాలు ఇవ్వాలనే కారణంతో వీరిని ఆంధ్రాకు తీసుకురాకుండా ముఖం చాటేసింది.