
అందరికీ ఉపాధి
ఆర్థిక సంవత్సరం ముగిసే లోగా
లక్ష కుటుంబాలకు 100 రోజుల పనిదినాలు
పని ప్రదేశాల్లో పూర్తి స్థాయిలో వసతులు
వేతనం రూ 169 వచ్చేలా కొలతలు
ఎండలో మాడిపోతూ... రక్తాన్ని చెమటగా మార్చి చిందిస్తున్న కూలీలకు దక్కుతున్నది ఎంత...?, వారి శ్రమకు తగిన వేతనం అందుతోందా...? కావలసిన వారికి పనులు లభిస్తున్నాయా ? వేతన దారుల సొమ్ము పరుల జేబుల్లోకి వెళుతోందా...? అంటే ఇవన్నీ ప్రశ్నార్థకంగానే మిగిలిపోతున్నాయి. సమున్నత లక్ష్యంతో అమలవుతున్న ఈ పథకం కొందరు అక్రమార్కుల కారణంగా అబాసుపాలవుతోంది. కోట్లకు కోట్లు పథకం నిధులు ఖర్చవుతున్నా...లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు. జిల్లా నుంచి వలసలు ప్రతి ఏడాదీ పెరుగుతున్నాయి. వేతనదారుల సమస్యలను తెలుసుకునేందుకు డ్వామా ఏపీడీ ఎస్.అప్పలనాయుడు ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్‌గా మారారు. నెల్లిమర్ల మండలం వల్లూరు గ్రామ పంచాయతీ శివారుల్లో జరుగుతున్న ఉపాధి పనుల వద్దకు వెళ్లి ప్రతి వేతనదారునితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
వేతనదారులతో ఏపీడీ సంభాషణ ఇలా సాగింది....
ఏపీడీ : ఏమ్మా మీ పేరేంటి..? ఎప్పుడు నుంచి ఉపాధి పనులకు వస్తున్నారు..?
దుర్గాభవాని(మేట్) : నా పేరు దుర్గాభవానీ సార్. మూడేళ్లుగా పనిలోకి వస్తున్నాను. నేనే మా జట్టుకి మేట్‌ని.
ఏపీడీ: ప్రతి రోజు ఎన్ని గంటల పాటు పనులు చేస్తారు..?
మేట్: ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు మళ్లీ మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తాం.
ఏపీడీ: రోజుకు ఎంత కూలి గిట్టుబాటవుతోంది..?
మేట్: జట్టులో ఉన్న వారందరికీ ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట వేత నం వచ్చేలా కొలతలు ఇస్తున్నాం. రెండు మీటర్ల వెడల్పు, 10 మీటర్ల పొడవు , అరమిటరు లోతును రోజుకు తవ్వితే రూ.160 వరకు వస్తుంది.
ఏపీడీ: మీ గ్రూపులో ఎంత మంది కూలీలు ఉన్నారు...?
మేట్: ఈ రోజు 10 మంది వచ్చారు.
ఏపీడీ : ఏమమ్మా నీ పేరు..?
బోర విజయ (ఉపాధి వేతనదారు): నా పేరు బోర విజయ అండి.
ఏపీడీ: ప్రతి రోజు ఉపాధి పనులకు వస్తారా..?
విజయ: ఔనండి. నాతో పాటు మా యజమాని అప్పుడప్పుడు వస్తారు. వ్యవసాయ పనులు ఉంటే రాడు.
ఏపీడీ: ఉపాధి పనితో వచ్చే డబ్బులతో ఏం చేస్తుంటారు..?
విజయ: పిల్లల్ని చదివించుకుంటున్నామండి
ఏపీడీ: గునపాం పట్టుకుని నువ్వు పని చేస్తున్నావేంటి.?
సంతోషి (ఉపాధి వేతనదారు): నా పేరు బోర.సంతోషి . మా జట్టు లో ఈ రోజు మగవాళ్లు రాలేదు . అందుకే గునపాం పని మేమేం చేసుకుంటాం.
ఏపీడీ: నీ పేరేంటమ్మ..? ఇక్కడ నువ్వు ఏం చేస్తుంటావు..?
చంద్రకళ(ఫీల్డ్‌అసిస్టెంట్): నా పేరు బి.చంద్రకళ. ఈ గ్రామానికి నేనే ఫీల్డ్ అసిస్టెంట్‌ని సార్.
ఏపీడీ: ఉపాధి పనులు ప్రారంభం కాకముందు ఏం చేసేవారు..?
ఎఫ్‌ఏ : ఇంటి దగ్గరే ఉండేదాన్ని. ఉపాధి హమీ పథకం వచ్చిన తరువాత ఫీల్డ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నా.
ఏపీడీ: నువ్వు చేసే పని ఏంటి..?
ఎఫ్‌ఏ: పని కోసం వచ్చే వారికి పనులు కల్పించడం, కొలతలు ప్రకారం పనులు చేయించి, గరిష్ట వేతనం వచ్చేలా చూస్తాను సర్.
ఏపీడీ: గరిష్ట వేతనాలు రావాలంటే ప్రత్యేక కార్యాచరణ ఏమైనా పాటిస్తున్నారా..?
ఎఫ్‌ఏ: ప్రణాళిక ప్రకారం పనులు చేస్తుంటాం. ఉదయం పనిలోకి రాగానే ఎంత మంది కూలీలు వచ్చారో చూసుకుని వారికి గరిష్ట వేతనం గిట్టుబాటు అయ్యేలా కొలతలు ఇస్తాం.
ఏపీడీ : మీ గ్రామంలో ఎంత మంది 100 రోజుల పాటు పనులు పూర్తి చేసుకున్నారు..? మిగిలిన వారి విషయంలో ఏం చర్యలు తీసుకుంటున్నావు..?
ఎఫ్‌ఏ: మా గ్రామంలో ఇప్పటి వరకు 36 కుటుంబాల వారు 100 రోజుల పనులు పూర్తి చేసుకున్నారు. మరి కొంతమంది 80 నుంచి 90 రోజులకు దగ్గరల్లో ఉన్నారు. ముందుగా వారికి పని కల్పించడంతో పాటు 60 నుంచి 70 రోజులు పనులు పూర్తి చేసుకున్న వారికి ప్రాధాన్యతా క్రమంలో పనులకు హాజరుకావాలని సూచిస్తా.
ఏపీడీ: ఏమయ్యా నీ పేరు..? ఇంతకు ముందు నువ్వు ఏం పని చేసేవాడివి?
తౌడు (ఉపాధి కూలి): నా పేరు తౌడు అండి. గతంలో ఉంటే వ్యవసాయం పనులు చేసే వాడిని. లేకపోతే ఇంట్లో ఖాళీగా కూర్చునే వాడ్ని. ఐదు సంవ త్సరాలుగా ఉపాధి పనులు చేస్తున్నా.
ఏపీడీ: నీకు రోజుకు ఎంత కూలి గిట్టుబాటు అవుతోంది..?
తౌడు: రోజుకు రూ 150 వరకు వస్తంది. జట్టులో అందరూ వస్తే పని బాగా జరుగుతుంది.
ఏపీడీ : ఏమమ్మా నీ పేరు..? మీకు పని ప్రదేశంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయా..?
లెంకగౌరి(ఉపాధి వేతనదారు): నా పేరు లెంక గౌరి. ప్రతి రోజు పనికి వస్తా. ఇక్కడ ఎండైతే కూర్చువటానికి టెంటు ఉంది. మంచి నీళ్లు మేమే తెచ్చుకుని తాగుతాం.
ఏపీడీ: మంచినీటికిప్రభుత్వండబ్బులుఇస్తుంది .. తెలుసా..?
గౌరి: అవున ండి ఎవరి నీరు వారే తెచ్చుకుంటాం. అందుకు ప్రభుత్వం రోజుకు రూ 5 ఇస్తుంది. అదేవిధంగా గునపానికి రూ10 , తట్టకు రూ10 చొప్పున ఇస్తోంది.
ఏపీడీ: ఇవన్నీ మీకు ఇచ్చే వేతనం స్లిప్పులో ఉంటుంది .. చూస్తారా..?
గౌరి: చూస్తానండి. నేనే పదోతరగతి చదివా..
ఏపీడీ : నీ పేరేంటి ? ఎన్ని రోజు లు పని చేశావు..?
కె.జయమ్మ (ఉపాధి వేతనదారు) : నాపేరు కె.జ యమ్మ. ఈ సంవత్సరం నేను ఇప్పటికి 80 రోజులు పని చేశాను.
ఏపీడీ: ప్రభుత్వం ఏడాదిలో 100 రోజులు పనులు కల్పిస్తోంది..అవి సరిపోతున్నాయా..?
జయమ్మ: ఇంట్లో ఇద్దరు, ముగ్గురు పనులకు వస్తే వంద రోజులు చాలవు. అప్పుడప్పుడు వ్యవసాయం పనులు ఉంటే వాటికే వెళిపోతాం.
ఏపీడీ: కిందటి సంవత్సరం 100 రోజులు పనులు పూర్తి చేసుకున్నారా..?
జయమ్మ: పూర్తి చేసేశాం.
ఏపీడీ: ప్రతి రోజు పనిలోకి ఎన్ని గంటలకు వస్తారు..?
జయమ్మ: ఉదయం 7.30 గంటలకు వచ్చి 11.00 గంటల వర కు చేస్తాం. మళ్లీ మధ్యాహ్నం వచ్చి ఆ రోజు పని పూర్తి చేస్తాం.
ఏపీడీ: రాబోయేది వేసవి కాలం కదా.. అప్పుడు ఎలా పనులు చేస్తారు..?
జయమ్మ: అప్పుడు తెల్లారే వచ్చేస్తామండి.
ఏపీడీ: ఏమమ్మానీపేరేంటి..?ఎవరెవరుపనులకు వస్తారు..?
రవణమ్మ : నా పేరు రెల్లి.రవణమ్మ అండి. నేను నా భర్తా పనులకు వస్తాం.
ఏపీడీ: నీ పేరేంటమ్మ ..? నీకు రోజు కూలి ఎంత వస్తోంది ?
విజయ ( మేట్) నా పేరు విజయ. రోజుకు రూ140 వరకు కూలి వస్తోంది.
ఏపీడీ: మీ జట్టులో సభ్యులు ఎంత మంది ఉన్నారు ?
మేట్: జట్టులో ఏడుగురు మగాళ్లు, నలుగురు ఆడవారు ఉన్నారు. ఉదయం రాగానే కొలతలు ఇచ్చి పనిప్రారంభిస్తా. వారితో పాటు నేనూ పని చేస్తా.
ఏపీడీ: నీ పేరేంటమ్మ..? ఇక్కడ నువ్వు ఏంటి..?
రేణుక(మేట్): నా పేరు రేణుక. పది వరకు చదివా.. నేనే మా జట్టుకు మేట్‌ని.
ఏపీడీ: మీ జట్టులో వంద రోజుల పని దినాలు పూర్తి చేసుకున్న వారు ఎంత మంది ఉన్నారు..?
మేట్: ఇప్పటికే నాలుగు కుటుంబాలు 100 రోజుల పని దినాలు పూర్తి చేసుకున్నాయి. మిగిలిన కుటుంబాల వారు 60 నుంచి 70 రోజులు పనులు పూర్తి చేసుకున్నారు.
ఏపీడీ : నీ పేరేంటమ్మ..?ఎన్ని సంవత్సరాలు నుంచి పనిలోకి వస్తున్నావు..?
రమణమ్మ: నాపేరు మండల.రమణమ్మ. మూడు సంవత్సరాల నుంచి పనిలోకి వస్తున్నా.
ఏపీడీ:గతంలోఎంతకూలివచ్చేది..?ఇప్పుడుఎంత వస్తోంది..?
రమణమ్మ: గతంలో రూ120 వరకు వచ్చేది... ఇప్పుడు రూ140 నుంచి రూ150 వరకు వస్తోంది.
ఏపీడీ:నీపేరు..?ఉపాధిపనులుఎలాఉపయోగపడుతున్నాయి...?
మంగ : నా పేరు మంగ. నాలుగు సంవత్సరాలుగా ఉపాధి పనులకు వస్తున్నా. మాకు ఇద్దరు పిల్లలు . విజయనగరంలో చదువుకుంటున్నారు. మాకు వచ్చే డబ్బులతో వారిద్దరిని బాగా చదివించాలనుకుంటున్నాం.
ఏపీడీ: నీ పేరేంటమ్మా ? మీ పిల్లలు ఏం చేస్తుంటారు..?
లక్ష్మి : నా పేరు లక్ష్మి. నేను నా భర్త ఇద్దరం పనిలోకి వస్తాం. ఇద్దరిదీ ఒకే సంఘం. మా పిల్లలు బొప్పడాం హైస్కూల్‌లో చదువుతున్నారు.
ఏపీడీ: మీ భర్తపేరు..?ఉపాధి లేని రోజుల్లో ఏంచేసేవారు..?
లక్ష్మి: నా భర్త పేరు దుర్గాప్రసాద్. నాయీ బ్రాహ్మణుడు. గతంలో కులవృత్తి చేసుకునే వాళ్లం .ఇప్పుడు ఉపాధి పనులు చేసుకుంటూ రోజుకు రూ150 సంపాదిస్తున్నాం.
ఏపీడీ: నీ పేరు...? ఇక్కడ ఏం చేస్తుంటావు..
రమణమూర్తి (టెక్నికల్ అసిస్టెంట్) : నా పేరు శ్రీను. ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నా.
ఏపీడీ: నీ బాధ్యతలు ఏంటి..?
టీఏ: గ్రామంలో పనులు కావాలని వచ్చే వారందరికీ పనులు కల్పించటం. ప్రతి వారం వచ్చే దరఖాస్తులను స్వీకరించడంతో పాటు, నా పరిధిలో ఉన్న గ్రామాలకు వారంలో రెండు సార్లు వెళ్లి పనులు పరిస్థితిని పరిశీలిస్తాను. పని చేసే నైపుణ్యం లేని వారికి నైపుణ్యం కల్పించి వారితో పనులు చేయిస్తున్నాం.
ఏపీడీ: ఎంపీడీఓగారూ...మండలంలో పరిస్థితి ఎలా ఉంది...?
రాజకుమార్(ఎంపీడీఓ) ః మా మండలంలో ఏడాదికి సరాసరిన 10 నుంచి 12 వేల కుటుంబాల వారు ఉపాధి పనులకు హాజరవుతుంటారు. మారుతున్న విధి విధానాలకు అనుగుణంగా ప్రతి బుధవారం ఫీల్డ్ అసిస్టెంట్‌లకు మండల స్థాయిలో అవగాహన కల్పిస్తాం. మేట్‌లకు ఏడాదికి ఒక సారి శిక్షణా తరగుతలు నిర్వహించి చట్టం నిర్ధేశించిన మేర వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం.