
నమ్మించి.. వంచించి!
బాబు పాలనకు వంద రోజులు
ఎన్నికల ముందు నుంచే ఎన్నెన్నో హామీలు. ఆచరణ సాధ్యం కాదని తెలిసినా అధికారంలోకి రావడమే ధ్యేయంగా నమ్మ బలికారు. అరచేతిలో వైకుంఠం చూపి ఎట్టకేలకు చంద్రబాబు ముఖ్యమంత్రి కాగలిగారు. నెల.. రెండు నెలలు.. మూడు నెలలు.. ఇలా వంద రోజులు గడిచిపోయాయి. అదిగో ఇదిగో అంటూ కాలయాపనే తప్పిస్తే.. చేతల్లో ఏ ఒక్క హామీని
అమలు చేయలేకపోయారు. ప్రభుత్వ తీరు చూస్తే అవన్నీ కార్యరూపం దాలుస్తాయో లేదోననే సందిగ్ధం ప్రజల్లో వ్యక్తమవుతోంది.
సాక్షి ప్రతినిధి, కర్నూలు:
టీడీపీ ప్రభుత్వ వంద రోజుల పాలనలో జిల్లా ప్రజలకు ఒరిగింది శూన్యం. స్వాతంత్య్ర దినోత్సవం సాక్షిగా వరాల జల్లు కురిపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. అందుకు అనుగుణంగా నిధుల విడుదలలో విఫలమయ్యారు. రైతులు.. డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల ముందు ఊదరగొట్టినా ఇప్పుడు వెనుకంజ వేస్తుండటం చర్చనీయాంశమవుతోంది. రోజుకో నిబంధనను తెరపైకి తీసుకొస్తూ.. మెలికలు పెడుతుండటం మొదటికే మోసం తీసుకొస్తారేమోననే భావన కలిగిస్తోంది. మొదటి సంతకంతో మాయ చేసి.. కమిటీ పేరిట కాలయాపన చేసి.. రీషెడ్యూల్ పేరిట ఊరించి.. తాజాగా ఆధార్, రేషన్ కార్డులకు లింకు పెట్టడం రుణ మాఫీ అమలుపై అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇక డ్వాక్రా రుణాల మాఫీ లేదని తేలిపోయింది. రివాల్వింగ్ ఫండ్‌తో సరిపెట్టడం మహిళల ఆగ్రహానికి కారణమవుతోంది. జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి స్వాతంత్య్ర వేడుకలు.. బడ్జెట్ సమావేశాల సందర్భంగా జిల్లాకు ఇచ్చిన హామీలను టీడీపీ సర్కారు అటకెక్కిస్తోంది. ప్రధానంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం.. ఉర్దూ విశ్వవిద్యాలయం మాటే మరిచారు. అసంపూర్తి రిజర్వాయర్లను పూర్తి చేస్తామని ప్రకటించినా.. బడ్జెట్‌లో కేటాయించిన అరకొర నిధులు మరమ్మతులకు కూడా సరిపోవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజధాని విషయంలోనూ జిల్లాకు అన్యాయం జరిగింది. ఉద్యమాలు చేసినా.. దీక్ష బూనినా.. గొంతెత్తి నినదించినా చంద్రబాబు పెడచెవిన పెట్టారు. లక్షలాది మంది సీమ ప్రజల ఆత్మఘోషను కాదని.. కార్పొరేటర్లకు తొత్తుగా వ్యవహరించారు. విజయవాడ ప్రాంతంలోనే రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రకటించి సీమ అభివృద్ధి అవకాశాలను చేజేతులా కాలరాశారు. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ పార్టీ నేతలు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.ఈ.కృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు బి.సి.జనార్దన్‌రెడ్డి, బి.వి.జయనాగేశ్వరరెడ్డిలు సైతం రాజధాని విషయంలో నోరెత్తకపోవడం విమర్శలకు తావిస్తోంది.
అధికారుల్లో అభద్రత
టీడీపీ అధికార పగ్గాలు చేపట్టాక పాలనలో స్తబ్దత నెలకొంది. అభివృద్ధిలో కీలకమైన అధికారులపై ఒత్తిళ్లు అధికమయ్యాయి. చెప్పినట్లు నడుచుకోవాలని తెలుగుతమ్ముళ్లు హుకం జారీ చేస్తుండటం.. లేదంటే బదిలీలకు సిద్ధమవ్వాలని హెచ్చరించడం పరిపాటిగా మారింది. సెలవు రోజుల్లోనూ మంత్రి, ఎమ్మెల్యేలు తమ ఇళ్లకు పిలిపించుకుని ఆదేశాలు జారీ చేస్తుండటంతో అధికారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇక ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కంటి మీద కునుకు కరువైంది.
మైనింగ్, ఇసుక అక్రమ రవాణా: ప్రకృతి వనరులను దోచుకునేందుకు కొందరు టీడీపీ నేతలు సన్నద్ధమయ్యారు. మైనింగ్, ఇసుకను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకపోయినా ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తున్నారు. లీజుదారులపైనా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయితీ తమకే ముట్టజెప్పాలని దౌర్జన్యం చేస్తున్నారు. రేషన్ డీలర్లు.. ఫీల్డ్ అసిస్టెంట్లు.. మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులను ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నారు. వంద రోజులు గడిచిపోయినా ప్రజలను మభ్యపెట్టడం మినహా ఏమీ చేయలేకపోవడం టీడీపీ ప్రభుత్వ నైజాన్ని తెలియజేస్తోంది.