తొండాట
కడప సెవెన్రోడ్స్:
జిల్లా ప్రజలకు మరోమారు నిరాశే ఎదురైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలన వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం కుదుర్చుకున్న పది ఎంఓయూలను పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది. ఇవ్వలేదనిపించుకోకుండా గాలివీడు సమీపాన ఒక అల్ట్రా మెగా సోలార్ పార్కును విదిల్చారు. మిగిలిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులన్నీ కడప కంటే అభివృద్ధిలో ఎంతో ముందంజలో ఉన్న ప్రాంతాలకు మళ్లించారు. విభజన చట్టంలోనే ఉన్న ఉక్కు ప్యాక్టరీ ఊసే లేదని, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 11జాతీయ స్థాయి సంస్థల్లో ఒక్కటి కూడా జిల్లాకు కేటాయించలేదని ఇప్పటికే అసంతృప్తితో ఉన్న జిల్లా వాసులు దీంతో మరింత రగిలిపోతున్నారు. కడప సమీపంలోని కొప్పర్తి వద్ద ఉన్న ఏపీఐఐసీ మెగా ఇండస్ట్రియల్ పార్కు భూముల్లో డిఫెన్స్ రీసెర్చి డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ల్యాబ్ (డీఆర్డీఓ) ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోందంటూ ఇటీవల వచ్చిన వార్తలతో ప్రజల్లో ఆశలు చిగురించాయి. ఈనెల 10వ తేదీన డీఆర్డీఓ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి కొప్పర్తి భూములను కేటాయించాలని కోరారు. ఇందువల్ల ప్రత్యక్షంగా 1500 మందికి ఉద్యోగ అవకాశాలతోపాటు పరోక్షంగా మరికొందరికి ఉపాధి లభిస్తుందని వారు ముఖ్యమంత్రికి వివరించారు. ఏపీఐఐసీ సుమారు ఏడు వేల ఎకరాల భూమిని సేకరించి సిద్దంగా ఉంచడం, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నందున కడపకు డీఆర్డీఓ రావడం ఖాయమని అందరూ భావించారు. అయితే రూ. 40 వేల కోట్ల పెట్టుబడితో చేపట్టే ఈ భారీ ప్రాజెక్టును చిత్తూరుజిల్లాకు తరలించడం, 1103 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఎంఓయూ కుదుర్చుకోవడం ఒకేసారి జరిగిపోయాయి. అలాగే హీరో మోటో కార్ప్నూ అదేజిల్లాలో ఏర్పాటు చేసేందుకు 600 ఎకరాలు కేటాయిస్తూ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ముఖ్యమంత్రి తన సొంత జిల్లాకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చి సెంటర్, ఏర్పేడు వద్ద ఎన్ఐఎంఎల్, ఐటీ హబ్, మెట్రో రైల్ వంటి పలు ప్రాజెక్టులను ఇప్పటికే ప్రకటించారు. మళ్లీ కొత్తగా డీఆర్డీఓ, హీరో మోటోకార్ప్లను కూడా అక్కడే ఏర్పాటు చేసేందుకు ఒప్పందాలు కుదర్చుకోవడం జిల్లా వాసులను నిరాశకు గురి చేస్తోంది. అభివృద్ధిలో జిల్లాల మధ్య ఉన్న అసమానతలకు ముఖ్యమంత్రి విధానాలు ఆజ్యం పోసేలా ఉన్నాయనే విమర్శలు జిల్లాలో సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అభివృద్దిలో ముందంజలో ఉన్నజిల్లాలకే పెట్టుబడులను తరలించడం సహేతుకం కాదంటున్నారు. స్థూల జిల్లా దేశీయోత్పత్తి (జీడీడీపీ), తలసరి ఆదాయం, పెట్టుబడులు అనే అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఒక జిల్లా లేదా రాష్ట్ర అభివృద్దిని అంచనా వేస్తున్నారు. వీటితో పోల్చి చూస్తే కడప కంటే చిత్తూరు ఎంతో ముందంజలో ఉందనే విషయాన్ని సోషియో ఎకనమిక్ సర్వే 2013-14 గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
జీడీడీపీలో...
వ్యవసాయం, పరిశ్రమలు, సర్వీసు సెక్టార్లలో అభివృద్ధిని లెక్కించి జీడీడీపీని రూపొందిస్తారు. ఈ అంశంలో విజయనగరం, శ్రీకాకుళం మినహా అన్ని జిల్లాల కంటే కడప వెనుకబడి ఉంది. 2012-13 ప్రస్తుత ధరల ప్రకారం కడప జీడీడీపీ 21,440 కోట్లు, స్థిర ధరల ప్రకారం 12,057 కోట్ల రూపాయలు ఉంది. ఇదే చిత్తూరుజిల్లాలో 30,593 కోట్లు, 16144 కోట్ల రూపాయలు ఉండడం గమనార్హం.
పెట్టుబడులు
భారీ పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలను పరిశీలిస్తే చిత్తూరుజిల్లా ముందంజలో ఉంది. 2013 మార్చి వరకు గణాంకాలను పరిశీలిస్తే చిత్తూరుజిల్లాలో 149 యూనిట్లు, 2400 కోట్ల పెట్టుబడులు, 30,906 మందికి ఉద్యోగాల కల్పన జరిగింది. 2013-14 గణాంకాల మేరకు ఆరు యూనిట్లు, 544 కోట్ల రూపాయల పెట్టుబడులు, 2519 మందికి ఉద్యోగాల కల్పన జరిగాయి. మొత్తంగా చూస్తే ఆ జిల్లాలో 2944 కోట్ల రూపాయల పెట్టుబడి, 33425 మందికి ఉద్యోగాల కల్పన జరిగినట్లు గణాంకాలు వివరిస్తున్నాయి. ఇక కడపజిల్లా విషయానికి వస్తే మార్చి 2013 మార్చి నాటికి 42 పరిశ్రమల్లో 5940 కోట్ల రూపాయల పెట్టుబడి, 16469 మందికి ఉపాధి లభించింది. 2013-14 సంవత్సరంలో ఒక్క యూనిట్ గానీ, ఒక్క రూపాయి పెట్టుబడిగానీ, ఒక్కరికీ ఉద్యోగ అవకాశం గానీ జిల్లాలో లభించలేదు. ఇక్కడి ప్రజలు ఓట్లు వేయలేదనే రాజకీయ కోణంతో ఆలోచించకుండా జిల్లా సమగ్రాభివృద్దికి అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞులు సూచిస్తున్నారు.