కర్నూలు(అర్బన్): ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేకంగా బీసీ డిక్లరేషన్ ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక బీసీలను పూర్తిగా విస్మరించినట్లు కనిపిస్తోంది. గత ఏడాది కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం బీసీల ఆర్థిక చేయూతకు మంగళం పాడింది. ఈ క్రమంలోనే ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఇంతవరకు బీసీ కార్పొరేషన్లకు నయాపైసా విదల్చ లేదు సరికదా, కనీసం మార్గదర్శకాలు కూడా విడుదల చేయలేదు.
దీంతో జిల్లా వ్యాప్తంగా బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందేందుకు ఏడాదిన్నర కాలంగా బీసీలు ఎదురుచూస్తున్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 1627 మంది జీరో బ్యాలెన్స్ బ్యాంకు ఖాతా నెంబర్లు ఇచ్చినా వారికి ఇంతవరకు సబ్సిడీ విడుదల కాకపోవడం గమనార్హం. ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు మార్గదర్శకాలను విడుదలచేసిన ప్రభుత్వం బీసీ రుణాలపై ఎలాంటి మార్గదర్శకాలు వెల్లడించలేదు. దీనిపై బీసీ వర్గాలు ఆందోళన ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
గత ఏడాది విడుదల కాని సబ్సిడీ రూ.826.918 లక్షలు..
2013-14 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల వారికి మార్జిన్ మనీ పథకం కింద 3968 మందికి 1085.30 లక్షలు, మున్సిపల్ ప్రాంతాల వారికి రాజీవ్ అభ్యుదయ యోజన పథకం కింద 893 మందికి రూ.243.45 లక్షలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించి దరఖాస్తులను స్వీకరించారు. వీరిలో 1834 మంది గ్రామీణ ప్రాంతాల వారికి రూ.655.458 లక్షలు, 359 మంది మున్సిపల్ ప్రాంతాల వారికి రూ.171.450 లక్షలు సబ్సిడీ విడుదల చేసేందుకు ప్రొసీడింగ్స్‌ను అందించారు. ప్రొసీడింగ్స్ అందుకున్న వారిలో 1402 మంది గ్రామీణ ప్రాంతాల వారు, 225 మంది మున్సిపల్ ప్రాంతాల వారు జీరో బ్యాలెన్స్ బ్యాంకు ఖాతా నెంబర్లను అప్పట్లోనే అందించారు. అయితే వారికి నేటి వరకు నయాపైసా సబ్సిడీ విడుదల కాలేదు.
పేరు మారినా ఫలితం సున్నా..
2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మున్సిపల్ ప్రాంతాల్లో ఉన్న రాజీవ్ అభ్యుదయ యోజన పథకం పేరులో రాజీవ్‌ను తీసివేసి బీసీ అభ్యుదయ యోజనగా మార్చినా, బీసీ కార్పొరేషన్లకు ఎలాంటి నిధులు విడుదల చేయలేదు. ఈ పథకం కింద 1211 మంది బీసీ వర్గాలకు చెందిన ప్రజలకు 50 శాతం సబ్సిడీతో 3.3250 కోట్లు, 8193 మంది గ్రామీణ ప్రాంతాల వారికి రూ.22. 5036 కోట్లు సబ్సిడీ అందించేందుకు వార్షిక ప్రణాళికలు రూపొందించారు. ఇంతవరకు మార్గదర్శకాలు మాత్రం విడుదల చేయకపోవడం బీసీ వర్గాలను కలచివేస్తోంది.
రుణం కోసం ఏడాదిగా తిరుగుత్నా
టైలరింగ్ యూనిట్ ఏర్పాటు కోసం గత ఏడాది ఫిబ్రవరిలో దరఖాస్తు చేసుకున్నాను. ఇంతవరకు రుణం అందలేదు. ఇప్పటికైనా రుణాలను విడుదల చేస్తే నాలాంటి వారికి ఎంతో మేలు జరుగుతుంది.
- టీ.శేఖర్, చిత్తారివీధి, కర్నూలు
కొత్త రుణాలు ఎప్పుడు ఇస్తారో
బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలపై నేటి వరకు ఎలాంటి సమాచారం లేదు. అసలు ఈ ఏడాది రుణాలు ఇస్తారో, లేదో ప్రభుత్వం తెలియజేయూలి. రుణాలు ఇస్తే పేదలకు సాపడినట్లవుతుంది.
- ఈ.విజయ్‌గౌడ్, కుమ్మరవీధి, కర్నూలు
బీసీలపై చిన్నచూపు
Published Wed, Nov 26 2014 3:12 AM | Last Updated on Sat, Sep 2 2017 5:06 PM
Advertisement
Advertisement