అసెంబ్లీ, లోక్‌సభ కలిపి 59 స్థానాలను ఆ వర్గాలకు కేటాయించిన సీఎం జగన్
గత ఎన్నికల కంటే ఇప్పుడు 11 స్థానాలు అధికం
దేశ చరిత్రలో బీసీలకు ఈ స్థాయిలో సీట్లు కేటాయించిన దాఖలాలు లేవంటున్న సామాజికవేత్తలు
గత 58 నెలల పాలనలో వారిని సమాజానికి వెన్నెముకగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి
2019, ఫిబ్రవరి 17న ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌లో చెప్పిన దానికంటే ఆ వర్గాలకు అధికంగా న్యాయం
మంత్రివర్గం నుంచి నామినేటెడ్ పదవుల వరకూ సమున్నత స్థానం
డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో వారికి రూ.1.73 లక్షల కోట్ల ప్రయోజనం
ఇలా చెప్పిన దానికంటే అధికంగా న్యాయం చేసిన జగన్ నాయకత్వాన్ని బలపరుస్తున్న బీసీలు
భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్ల సిద్ధం సభల్లో అది తేటతెల్లం
అదే 2012లో బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలన్నింటికీ చంద్రబాబు పాతర
కనీసం కేబినెట్‌లో కూడా ప్రాధాన్యత లేదు.. పైగా ఒక్క బీసీని రాజ్యసభకు పంపని టీడీపీ అధినేత
బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారని.. తోకలు కత్తిరిస్తానంటూ ఆ వర్గాలను హేళన చేసిన బాబు
ఇప్పుడు కేవలం 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించడంతో మరోసారి ఆయన తమను వంచించారంటూ ఫైర్.. తమ వెన్నువిరిచిన చంద్రబాబు నాయకత్వంపై బీసీల్లో ఆగ్రహావేశాలు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ,అగ్రవర్ణ పేదలు వైఎస్సార్‌సీపీ వెంట నడుస్తుండటంతో ఎన్నికల్లో వార్ వన్‌సైడే అంటున్న విశ్లేషకులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత 58 నెలలుగా సమాజానికి వెన్నెముకగా బీసీలను తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వారికి 48 శాసనసభ, 11 లోక్‌సభ స్థానాలు వెరసి మొత్తం 59 స్థానాలు కేటాయించి వారికి పెద్దపీట వేశారు. తద్వారా తన భవిష్యత్తు ప్రణాళికను కూడా ఆయన సుస్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 294 శాసనసభ, 48 లోక్‌సభ స్థానాలు ఉన్నప్పుడు కూడా ఈ స్థాయిలో బీసీలకు ఎవరూ అవకాశం ఇచ్చిన దాఖలాల్లేవు.
ఉత్తరప్రదేశ్‌లో బీసీ నేత అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూడా సీఎం జగన్ ఇచ్చిన రీతిలో బీసీలకు అవకాశం ఇవ్వలేదని.. దేశ చరిత్రలో ఇదో రికార్డు అని సామాజికవేత్తలు ప్రశంసిస్తున్నారు. నిజానికి.. రాష్ట్ర విభజనకు ముందు 2012, జూలై 9న ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌లో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీనీ ఆయన అధికారంలోకి వచ్చాక అమలుచేయకుండా తమను వంచించారని బీసీలు రగలిపోతున్నారు.
అదే వైఎస్ జగన్ గత ఎన్నికలకు ముందు 2019, ఫిబ్రవరి 17న ఏలూరులో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌లో తమకు చెప్పిన దానికంటే అధికంగా చేస్తుండడంపై బీసీలు హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తున్నారు. దీంతో ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు చంద్రబాబును ఛీకొట్టగా.. బీసీలు కూడా తమను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అక్కున చేర్చుకున్న సీఎం జగన్‌కు జేజేలు పలుకుతున్నారు.
భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్ల సిద్ధం సభలకు తరలివచ్చిన జనసందోహం ఇందుకు నిదర్శనమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలు వైఎస్సార్‌సీపీ వెంట నడుస్తుండటంతో వచ్చే ఎన్నికల్లో వార్ వన్‌సైడేనని వారు స్పష్టంచేస్తున్నారు. మొత్తం మీద శాసనసభ, లోక్‌సభ స్థానాలు కలిపి గత ఎన్నికల కంటే ఇప్పుడు అదనంగా 11 స్థానాలను సీఎం జగన్ తమకు కేటాయించడంపై వారు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
అవమానించి, అవహేళన చేసిన బాబు..
నిజానికి.. రాష్ట్ర విభజనకు ముందు 2012, జూలై 9న చంద్రబాబు బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించారు. 2014 ఎన్నికల్లో 100 అసెంబ్లీ స్థానాల్లో టికెట్లు ఇస్తామని.. బీసీ సబ్‌ప్లాన్ ద్వారా ఏటా రూ.పది వేల కోట్లు చొప్పున కేటాయిస్తామని.. చేనేత, పవర్‌లూమ్స్ రుణాలను మాఫీ చేస్తానని అందులో ప్రకటించారు. కానీ.. 2014 ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలోనే బీసీలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వారి సబ్‌ప్లాన్‌కు పాతరేశారు.
అలాగే, ఐదేళ్లలో బీసీ సబ్‌ప్లాన్ ద్వారా రూ.50 వేల కోట్ల వరకు ఆ వర్గాల సంక్షేమం కోసం ఖర్చు చేస్తానని హామీ ఇచ్చి.. అందులో సగం కూడా ఖర్చుచేయలేదు. పైగా.. మంత్రివర్గంలో వారికి సముచిత స్థానం కల్పించని చంద్రబాబు.. 2014–19 మధ్య ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదు. అంతేకాక.. న్యాయమూర్తులుగా బీసీలు పనికిరారంటూ వారిని అవహేళన చేశారు.
ఇచ్చిన హామీలు అమలుచేయాలని అడిగిన బీసీలను తాటతీస్తా.. తోకలు కత్తిరిస్తానంటూ బెదిరించి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో తమపై వల్లమాలిన ప్రేమను ఒలకబోస్తున్న చంద్రబాబు.. ఇప్పటిదాకా ఖరారు చేసిన 128 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 24 స్థానాలనే తమకు కేటాయించడంపై బీసీలు భగ్గుమంటున్నారు.
ఇచ్చిన మాటకంటే అధికంగా..
ఇక గత ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించారు. అందులో వారికిచ్చిన మాట కంటే గత 58 నెలలుగా అధికంగానే న్యాయం చేశారు. ఉదా..
► గత ఎన్నికల్లో 41 శాసనసభ స్థానాలు, ఏడు లోక్‌సభ స్థానాల్లో బీసీ వర్గాల అభ్యర్థులను బరిలోకి దించిన జగన్.. అధికారంలోకి వచ్చాక కేబినెట్‌లో ఆ వర్గాలకు చెందిన 11 మందికి మంత్రి పదవులిచ్చారు. ఒకరిని డిప్యూటీ సీఎంగా నియమించడంతోపాటు ప్రధానమైన రెవెన్యూ, విద్యా, పౌరసరఫరాలు, వైద్యం, ఆరోగ్యం లాంటి ప్రధానమైన శాఖలను ఆ వర్గాలకే అప్పగించి పరిపాలనలో వారికి సముచిత భాగస్వామ్యం కల్పించారు. శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారామ్‌కు అవకాశమిచ్చారు.
► ఈ వర్గాలకే చెందిన నలుగురిని రాజ్యసభకు పంపిన సీఎం జగన్ శాసనమండలిలో సైతం సింహభాగం పదవులు వారికే ఇచ్చారు.
► ఇక స్థానిక సంస్థల్లో వైఎస్సార్‌సీపీకి దక్కిన 13 జెడ్పీ చైర్మన్ పదవులకుగాను ఆరు బీసీలకే ఇచ్చారు.
► 84 మున్సిపల్ చైర్మన్ పదవులకుగానూ 44 వారికే కేటాయించారు. 14 కార్పొరేషన్ల మేయర్ పదవులకుగానూ తొమ్మిది బీసీలకే దక్కేలా చేశారు.
► అలాగే, నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు కేటాయించేలా ఏకంగా చట్టం చేసి మరీ ఇచ్చారు.
► మరోవైపు.. గత 58 నెలలుగా సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో రూ.1.23 లక్షల కోట్లు, నాన్ డీబీటీ రూపంలో రూ.50 వేల కోట్లు వెరసి రూ.1.73 లక్షల కోట్ల ప్రయోజనాన్ని బీసీలకు చేకూర్చారు. దీంతో.. రాజకీయ, ఆర్థిక, విద్యా, మహిళా సాధికారత ద్వారా బీసీలు సామాజిక సాధికారతను సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment