58 నెలలుగా తమకు కాపు కాసిన నాయకుడి కోసం జనం ఆరాటం
కళ్లారా చూసేందుకు పరితపిస్తున్న ప్రజానీకం.. రోడ్ షోలో ఊరూరా ఘన స్వాగతం
మండుటెండైనా.. అర్ధరాత్రయినా ఆత్మీయ నేత కోసం ఉప్పొంగుతున్న అభిమానం.. మూడు జిల్లాల్లో అతి పెద్ద ప్రజా సభలుగా ప్రొద్దుటూరు, నంద్యాల, ఎమ్మిగనూరు సభలు
పేదలకు మరింత గొప్ప భవిష్యత్తు కోసం అసమాన్యుడు చేస్తున్న యుద్ధ కవాతు.. మాటకు కట్టుబడి.. నిబద్ధతతో నిలబడే నేతను గుండెల్లో దాచుకుంటున్న జనం
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర దేశ చరిత్రలో మహోజ్వలఘట్టంగా నిలుస్తుందంటున్న పరిశీలకులు
చంద్రబాబు కూటమి వెన్నులో వణుకు పుట్టించేలా సాగుతున్న బస్సు యాత్ర
మాటపై ఎన్నడూ నిలబడని బాబును ఛీకొడుతున్న జనం.. టీడీపీ సూపర్ సిక్స్ హామీలను ఏమాత్రం పట్టించుకోని వైనం
చంద్రబాబు కుట్రలను చిత్తు చేసేందుకు తామంతా సిద్ధమంటూ లక్షల మంది సెల్‌ఫోన్ టార్చిలైట్లు వెలిగించి సభలలో సీఎం జగన్‌కు సంఘీభావం
రామగోపాల్ ఆలమూరు – సాక్షి, అమరావతి: మార్చి 27వతేదీ మిట్ట మధ్యాహ్నం.. 42 డిగ్రీల మండుతున్న ఎండలో వైఎస్సార్ జిల్లా వేంపల్లి మండలం వీరన్నగట్టుపల్లె క్రాస్ వద్ద సీఎం జగన్‌ను చూసేందుకు ఏడాదిన్నర వయసున్న చంటిబిడ్డను చంకనేసుకుని ఓ మహిళ పొలాల్లో నుంచి పరుగెత్తుతూ వచ్చింది. రోడ్ షోలో జననేతను చూసి సంతోషం వ్యక్తం చేసింది. యాత్ర ముందుకు కదులుతుంటే ఐదారు వందల మీటర్ల దూరం బస్సు వెంట పరుగులు తీసింది.
చంటిబిడ్డను చంకలో వేసుకుని అలా పరుగెత్తుతున్నావ్..! కిందపడతావన్న భయం లేదా అక్కా? అని పలకరిస్తే.. ‘‘నేను నిరుపేదను. జానెడు భూమి లేదు. కూలీనాలీ చేసుకుని బతికేవాళ్లం. మాకు జగనన్న ఇంటి స్థలం ఇచ్చి కట్టిచ్చినాడు. నా పెద్ద బిడ్డకు అమ్మ ఒడి కింద, నాకు ఆసరా కింద డబ్బులు ఇచ్చినాడు. వాటితో కుట్టు మిషన్ కొనుక్కుని బట్టలు కుట్టుకుంటూ ఇబ్బంది లేకుండా బతుకుతున్నాం. మాకు జీవితం ఇచ్చిన జగనన్నను ఎంత చూసినా తనివి తీరలేదు. అందుకే పరుగెత్తుతున్నా’ అని బదులిచ్చింది.
మార్చి 28 మధ్యాహ్నం 12 గంటలు.. సూర్యుడు చుర్రుమంటున్నాడు. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం ఎర్రగుంట్ల వద్ద దివ్యాంగ దంపతులు అపర్ణ, ప్రసాద్‌లు రోడ్డుపై కూర్చున్నారు. వేడికి తారు రోడ్డు కాలిపోతోంది. ఎందుకన్నా రోడ్డుపై కూర్చున్నారని అడిగితే.. ‘నేను, నా భార్య ఇద్దరూ దివ్యాంగులం. మాకు జగనన్న ఇంటి స్థలం ఇచ్చి పక్కా ఇంటిని నిర్మించి ఇచ్చారు. మా ఇద్దరికీ కలిపి పెన్షన్ నెలకు రూ.6 వేలు ఇస్తున్నారు.
ఆ డబ్బులతో జీవనం సాగిస్తూ టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) పాసయ్యాం. టీచర్ ఖాళీల భర్తీ కోసం జగనన్న నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ పరీక్షలు రాస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి. మమ్మల్ని ఇంటివాళ్లను చేయడంతోపాటు జీవితాన్ని ఇచ్చిన జగనన్న చూసేందుకు ఎంత ఎండలోనైనా కూర్చుంటాం’ అని చెప్పారు. ఇంతలో బస్సు యాత్రతో అటువైపు వచ్చిన సీఎం జగన్ వారిని చూసి బస్సు నుంచి కిందకు దిగి ఆప్యాయంగా పలకరించడంతో దివ్యాంగ దంపతులు ఆనందపరవశులయ్యారు.
మార్చి 29 మధ్యాహ్నం 2 గంటలు.. ఎండ నిప్పుల కొలిమిని తలపిస్తోంది. 70 ఏళ్ల పార్వతమ్మ రోడ్డుపై నిలుచుని ఉంది. అవ్వా.. ఎండ కాలిపోతోంది.. రోడ్డుపై నిలబడితే వడదెబ్బ తగులుతుందన్న భయం లేదా? అని పలకరిస్తే.. ‘నా భర్త చనిపోయినాడు.. నాకు పిల్లలు లేరు.. ఈ వయసులో ఏ పనీ చేయలేను.. నెలకు రూ.3 వేల చొప్పున జగనన్న ఇచ్చే పింఛన్‌తోనే బతుకుతున్నా.. మనవడిలా నన్ను ఆదరిస్తున్న జగనన్న మా ఊరికి వస్తున్నాడు. నా మనవడిని చూడటానికి ఎంత ఎండలోనైనా నిలబడే ఉంటా’ అని ఆ అవ్వ చెప్పింది.
మార్చి 30 రాత్రి 10.40 గంటలు.. అనంతపురం జిల్లా రాప్తాడు వద్ద పెద్దక్క తన ఇద్దరు పిల్లలతో కలిసి నిలబడింది. ముగ్గురి చేతుల నిండా బంతి పువ్వులు ఉన్నాయి.. అక్కా రాత్రయింది.. పిల్లలతో కలిసి రోడ్డుపై ఎందుకు నిలబడ్డారు? అని పలకరిస్తే.. ‘నా భర్త 2019 ఫిబ్రవరిలో చనిపోయినాడు. నా అత్తింటివాళ్లు, పుట్టింటివాళ్లు నన్ను పట్టించుకోలేదు.
ఇద్దరు పిల్లలతో కలసి ఆత్మహత్య చేసుకుందామనుకున్నా.. జగనన్న అధికారంలోకి వచ్చాక నాకు ఇంటి స్థలం ఇచ్చి, ఇళ్లు కట్టించి ఇవ్వడంతోపాటు వితంతు పెన్షన్, అమ్మ ఒడి, ఆసరా, చేయూత, రైతు భరోసా పథకాల ద్వారా సొంత అన్నలా అండగా నిలిచినాడు. నాకున్న రెండు ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ.. జగనన్న ఇచ్చిన డబ్బులతో రెండు పాడి పశువులు కొనుక్కుని పాలు అమ్ముకుంటూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నా. జగనన్న గవర్నమెంట్ బడిలో ఇంగ్లిషు మీడియంలో నా ఇద్దరు పిల్లలకు చదువులు చెప్పిస్తున్నాడు. నాకు అండగా నిలిచిన జగనన్న కోసం అర్ధరాత్రైనా వేచి ఉంటా’ అని ఆత్మస్థైర్యంతో చెప్పింది.
మార్చి 28 మిట్ట మధ్యాహ్నం.. నంద్యాల జిల్లా శిరివెళ్లలో హుస్సేన్ బాష మండే ఎండలో నిలబడ్డాడు.. ఇంత ఎండలో రోడ్డుపై ఎందుకు ఉన్నావన్నా? అని అడిగితే.. ‘నేను ప్రైవేట్ ఉద్యోగిని. నా కుమారుడు అనారోగ్యం పాలైతే ఆస్పత్రికి తీసుకెళ్లా. డాక్టర్లు చాలా పెద్ద సమస్య అని చెప్పారు. జగనన్న ఉన్నాడనే ధైర్యంతో ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని తిరుపతి ఆస్పత్రికి వెళ్లా. రూ.5 లక్షల విలువైన సర్జరీలలో ఇప్పటికే రెండు సర్జరీలు చేశారు.
మంచానికే పరిమితమైన నా కుమారుడు ఇవాళ లేచి నిలబడగలుగుతున్నాడు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పరిమితిని జగనన్న రూ.25 లక్షలకు పెంచాడు. మూడో సర్జరీ కూడా త్వరలో జరగబోతోంది. నా బిడ్డ ప్రాణాన్ని నిలబెట్టిన దేవుడు జగనన్న. పైన ఉన్న యముడికి, కింద ఉన్న ప్రజలకు అడ్డుగా నిలబడే నాయకుడు జగనన్న. పేదల పక్షాన నిలిచిన సీఎం జగనన్న వెంటే నడుస్తా’ అని చెప్పాడు.
మాట కోసం ఎందాకైనా..
ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఎందాకైనా పోరాడాలన్నది సీఎం జగన్ సిద్ధాంతం. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం అనంతరం పదేళ్లు ఆయన ఆశయాల కోసం ప్రజల తరఫున పోరాడారు. రాజకీయంగా వైరిపక్షాలైన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఏకమై అక్రమ కేసులు బనాయించి 16 నెలలపాటు జైల్లో నిర్భందించినా తల వంచలేదు. తమ తరపున నిలబడిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీకి 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు అఖండ విజయాన్ని కట్టబెట్టారు.
2019 మే 20న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపై నుంచే నేను పాలకుడిని కాదు సేవకుణ్ని అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. గత 58 నెలలుగా అదే పంథాతో సేవలు అందిస్తున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 95 శాతం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే అమలు చేసిన సీఎం జగన్ ఇప్పటి వరకు 99 శాతం నెరవేర్చి చిత్తశుద్ధి చాటుకున్నారు. నవరత్నాలు పథకాల ద్వారా అర్హతే ప్రామాణికంగా ఎలాంటి వివక్ష చూపకుండా, లంచాలకు తావు లేకుండా 87 శాతం పేద కుటుంబాల ఖాతాల్లోకి రూ.2.70 లక్షల కోట్లను డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో జమ చేశారు.
31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇంటి స్థలాలు లాంటి నాన్ డీబీటీ పథకాల ద్వారా మరో రూ.1.79 లక్షల కోట్ల మేర లబ్ధి కలిగింది. డీబీటీ, నాన్ డీబీటీ కలిపి మొత్తం రూ.4.49 లక్షల కోట్ల దాకా ప్రయోజనాన్ని చేకూర్చారు. దేశ చరిత్రలో ఇదో రికార్డు. కేబినెట్ నుంచి నామినేటెడ్ వరకూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సింహభాగం పదవులు ఇచ్చి సామాజిక న్యాయమంటే నినాదం కాదు అమలు చేయాల్సిన విధానమని చాటిచెప్పి ఆ వర్గాల రాజకీయ సాధికారతకు బాటలు వేశారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో సంస్కరణల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపారు.
గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ, జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ ద్వారా ప్రభుత్వ సేవలను ఇంటి గుమ్మం వద్దకే చేరవేశారు. కరోనాతో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపకుండా కొనసాగించారు. విపత్తు వేళ ఉచితంగా వైద్య సేవలు అందించి ప్రజల ప్రాణాలకు భరోసా కల్పించారు. దాంతో సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం బలంగా నాటుకుపోయింది. మండుటెండైనా.. అర్ధరాత్రైనా సీఎం జగన్ బస్సు యాత్రలో ప్రజలు లెక్క చేయకుండా నీరాజనాలు పలకడానికి ఇదే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నాయకుడంటే జగన్‌లా ఉండాలని ప్రజలే చాటిచెబుతున్నారని, దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇదో మహోజ్వల ఘట్టమని ప్రశంసిస్తున్నారు.
‘‘మేమంతా సిద్ధం...’’ పేరుతో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న బస్సు యాత్రలో కనిపించిన దృశ్యాల్లో ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. సూరీడు నిప్పులు గక్కుతున్నా.. ఎండ మండుతున్నా.. రాత్రి పొద్దుపోయినా చిన్నపిల్లలు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, అన్నాదమ్ములు బస్సు యాత్ర జరిగే రహదారి వెంబడి కిలోమీటర్ల కొద్దీ బారులు తీరుతున్నారు. సీఎం జగన్ తమ వద్దకు చేరుకోగానే పూల వర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. జనం కోసం నిలబడ్డ నాయకుడికి జననీరాజనం పలుకుతున్నారు.
ఆత్మీయ నేత కోసం అర్ధరాత్రయినా అభిమానం ఉప్పొంగుతోంది. ఐదేళ్లు తమను కాపు కాసిన నాయకుడిని చూసేందుకు జనం ఆరాటపడుతున్నారు. తమ నాయకుడిని కళ్ల నిండా నిలుపుకొనేందుకు తాపత్రయపడుతున్నారు. జననేత తమకు చేసిన మంచిని గుర్తు చేసుకుంటూ ఎన్నికల మహాసంగ్రామంలో పెత్తందార్ల పీచమణిచేందుకు ‘మేమంతా సిద్ధం’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తున్నారు. పేదలకు మరింత గొప్ప భవిష్యత్తు కోసం.. రాష్ట్రాన్ని సమున్నతంగా నిలిపేందుకు సామాన్యులతో కలిసి అసమాన్యుడు సీఎం జగన్ బస్సు యాత్ర ద్వారా చేస్తున్న యుద్ధ కవాతు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నేతృత్వంలోని కూటమిలో వణుకు పుట్టిస్తోంది.
ఇచ్చిన మాటకు కట్టుబడి నిజాయితీ, నిబద్ధతతో సేవ చేసే నాయకుడిని ప్రజలు తమ గుండెల్లో పెట్టుకుంటారనేందుకు ఇవన్నీ తార్కాణమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జైత్రయాత్రను తలపిస్తున్న సీఎం జగన్ బస్సు యాత్రను చూస్తుంటే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సృష్టించే ప్రభంజనం ముందుగానే కనిపిస్తోందని స్పష్టం చేస్తున్నారు. సీఎం జగన్ ప్రొద్దుటూరు, నంద్యాల, ఎమ్మిగనూరులో నిర్వహించిన ఎన్నికల సభలకు కుంభమేళాను తలపిస్తూ జనం పోటెత్తారు. బస్సు యాత్రలో భాగంగా అక్కడ నిర్వహించిన సభలు మూడు జిల్లాల చరిత్రలో అతి పెద్ద ప్రజాసభలుగా రికార్డు సృష్టించాయి.
ఇక వైఎస్సార్ కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో నిర్వహించిన రోడ్ షోలలో ప్రతి చోటా జనం బారులు తీరారు. చంటిబిడ్డలను ఎత్తుకున్న మహిళలు, అవ్వాతాతలు కదలివచ్చారు. చంద్రబాబు లాంటి మోసగాళ్ల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి నేను సిద్ధం.. మీరంతా సిద్ధమైతే సెల్‌ఫోన్‌లో టార్చ్ లైట్ ఆన్ చేయాలని సీఎం జగన్ కోరడంతో ఒక్కసారిగా లక్షల మంది సెల్‌ఫోన్లలో టార్చ్ లైట్ వెలిగించడంతో ఎమ్మిగనూరులో సభా ప్రాంగణం ఆకాశంలో చుక్కలను తలపించింది. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు, ఎత్తులు, జిత్తులను చిత్తు చేసేందుకు తామంతా సిద్ధమేనంటూ పిడికిళ్లు బిగించి దిక్కులు పిక్కటిల్లేలా సింహనాదం చేశారు.
అవకాశవాద నాయకులకు చెంపపెట్టు
విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల్లో జనసేన, బీజేపీతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు జట్టుకట్టారు. తాము అధికారంలోకి వస్తే వ్యవసాయ రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని.. ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతిగా ఇస్తానని.. ఆడపిల్ల పుడితే రూ.25 వేలు డిపాజిట్ చేస్తానని.. అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తానని.. చేనేత, పవర్ లూమ్స్ రుణాలు మాఫీ చేస్తానని ప్రధానమైన హామీలు ఇస్తూ మోదీ, పవన్ కళ్యాణ్‌లతోపాటు తన ఫోటో కూడా ముద్రించి, తాను సంతకం చేసిన లేఖను చంద్రబాబు ప్రతి ఇంటికీ పంపించారు.
ఇవి కాకుండా మరో 650 హామీలు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చింది. అధికారం దక్కించుకున్నాక హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయకుండా చంద్రబాబు దారుణంగా మోసం చేశారు. అనంతరం 2019 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా అధికారంలోకి వచ్చేందుకు జనసేన, బీజేపీతో చంద్రబాబు వేరుపడ్డారు. ఆ ఎన్నికల్లో చంద్రబాబు కుట్రలను పసిగట్టిన ప్రజలు టీడీపీని 23 శాసనసభ స్థానాలకే పరిమితం చేసి గట్టి గుణపాఠం నేర్పారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు అదే కూటమితో పొత్తులతో ఎన్నికలకు సిద్ధమయ్యారు.
సూపర్ సిక్స్ అంటూ హామీలిస్తూ ఊదరగొడుతున్న చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెంలో నిర్వహించిన జెండా సభకు, ప్రధాని మోదీని రప్పించి చిలకలూరిపేటలో నిర్వహించిన ప్రజాగళం సభకు జనం మొహం చాటేయడం ద్వారా అవకాశవాద పొత్తులను ఛీకొట్టారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు మోసం చేస్తారనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోవడం వల్ల ప్రజాగళం పేరుతో ఆయన నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారాన్ని జనం పట్టించుకోవడం లేదని.. అందుకే ఆ సభలు అట్టర్ ప్లాప్ అవుతున్నాయని పేర్కొంటున్నారు చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ కాల్ïÙట్ రాజకీయాలు చేస్తారని గుర్తించిన ప్రజలు ఆయన నిర్వహించే ప్రచారం, సభలకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదని స్పష్టం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment