పోటెత్తిన వోటర్లు! | Sakshi Editorial On Andhra Pradesh Elections 2024 | Sakshi
Sakshi News home page

పోటెత్తిన వోటర్లు!

Published Tue, May 14 2024 3:43 AM | Last Updated on Tue, May 14 2024 3:43 AM

Sakshi Editorial On Andhra Pradesh Elections 2024

సార్వత్రిక ఎన్నికల తొలి మూడు దశల తీరు వేరు... సోమవారంనాటి నాలుగో దశ పోలింగ్‌ తీరు వేరు. దేశవ్యాప్తంగా మొత్తం 96 లోక్‌సభ స్థానాల్లో జనం పెద్దయెత్తున వోటింగ్‌లో పాల్గొన్నారు. ఈ నాలుగో దశలో లోక్‌సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. అందుకోసమే కాక ఈ రాష్ట్రంవైపు దేశమంతా ఆసక్తిగా చూడటానికి ప్రత్యేక కారణం ఉంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తన అయిదేళ్ల పాలన తర్వాత ప్రజల ఆశీస్సులు కోరుతూ నిర్వహించిన ‘సిద్ధం’ సభలకూ, బస్సు యాత్రకూ పోటెత్తిన జనవాహినిని చూసి దేశం మొత్తం ఆశ్చర్యపోయింది. 

‘మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు వోటేయండి’ అంటూ ప్రజానీకానికి పిలుపునీయటం, అందుకు వచ్చిన సానుకూల స్పందన అసాధారణమైనవి. విపక్షం పూనకం వచ్చినట్టు వ్యక్తిగత దూషణలకు దిగినా, కులాల పేరిట ప్రాంతాల పేరిట చిచ్చురేపాలని చూసినా జగన్, ఆయన పార్టీ హుందాగా వ్యవహరించారు. ఈ ఎన్నికలు ‘పేదలకూ, పెత్తందార్లకూ జరిగే యుద్ధం...ఇందులో మీరు ఎటువైపో తేల్చుకోండ’ని ఇచ్చిన ఆయన పిలుపును పల్లెసీమల నుంచి నగరాలు, పట్టణాల వరకూ అన్నిచోట్లా అందరూ అందుకున్నారు. 

కొత్తగా వోటు హక్కు వచ్చిన యువత మొదలుకొని వృద్ధుల వరకూ...వికలాంగులు మొదలుకొని అనారోగ్యంతోవున్న పెద్దల వరకూ... వేసవి తీవ్రతను కూడా లెక్కచేయకుండా పోలింగ్‌ కేంద్రాలకు తరలిరావటంలోని ఆంతర్యం అదే. కనుకనే ఈసారి పోలింగ్‌ శాతం పెరిగింది. వోటేయటానికి బారులు తీరిన మహిళలు, వృద్ధుల్ని చూసి టీడీపీ కూటమి వణికింది. దానికి తోడు గతంలో ఎవరూ సాహసించని, యోచించని ఒక వినూత్న ప్రయోగం చేశారు జగన్‌. అన్ని సామాజిక వర్గాలకూ పాలనలో సమ భాగస్వామ్యం కల్పించాలన్న పట్టుదలతో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో దాదాపు సగభాగం అట్టడుగు వర్గాలకు కేటాయించారు. 

అందువల్లే జనం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ను గుండెల నిండా హత్తుకున్నారు. సాధారణంగా అయిదేళ్ల పాలన ఏ ప్రభుత్వం పైన అయినా ఎంతో కొంత అసంతృప్తి తీసుకొస్తుంది. అత్యంత జనాకర్షణగల సినీ దిగ్గజం ఎన్టీరామారావు కొత్తగా పార్టీ స్థాపించినప్పుడు రోడ్లపైకి భారీయెత్తున వచ్చిన జనమే... ఆయన పాలన చూశాక మొహం చాటేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. దాన్నుంచి కోలుకుని ప్రజాభిమానాన్ని చూరగొనడానికి ఆయనకు మరో అయిదేళ్లు పట్టింది. 

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు వచ్చే నెల 4న వెల్లడయ్యాక దేశ రాజకీయ ముఖచిత్రమే మారిపోతుంది. జనరంజక పాలన అంటే ఏమిటో... ఏం చేస్తే ప్రజల ఆదరాభిమానాలు సాధించుకోవచ్చునో అన్ని రాష్ట్రాల రాజకీయ నాయకులూ గ్రహిస్తారు. సంక్షేమం అంటే కేవలం తాయిలాలు పంచటం కాదని, వారి భవిష్యత్తును వారే నిర్మించుకునే విధంగా ఆసరాగా నిలబడటమని నిరూపించిన జగన్‌ను ఇకపై వారంతా రోల్‌ మోడల్‌గా తీసుకుంటారు. పిల్లలు బాగా చదువుకుని వృద్ధిలోకి వస్తేనే కుటుంబాలు బాగుపడతాయని గుర్తించి ఆ రంగాన్ని ప్రక్షాళన చేయటం, ప్రామాణికమైన విద్యనందించటం, ‘నాడు–నేడు’ పేరిట బడులన్నిటినీ తీర్చిదిద్దటం కనీవినీ ఎరుగనిది. 

వైద్యరంగంపైనా ఆయన అంతే శ్రద్ధ పెట్టారు. భారీయెత్తున సిబ్బందిని నియమించి ఆస్పత్రులను తీర్చిదిద్దటం, ఆధునాతన వైద్య పరికరాలు, ఔషధాలు సమకూర్చటం, పల్లెలకు సైతం వైద్య సేవలు చేరేయటం మామూలు విషయం కాదు. అలాగే రైతు కోసం ఏర్పాటైన వ్యవస్థలైతేనేమి... వలంటరీ వ్యవస్థద్వారా ప్రభుత్వ సేవలు ప్రజల ముంగిట్లోకి తీసుకెళ్లటమైతేనేమి జగన్‌ విజయాల్లో మచ్చుకు కొన్ని. దేశంలో ప్రజాభిమానాన్ని చూరగొనాలనుకునే నాయకులెవరైనా వీటిని అనుసరించక తప్పదు.

అయితే జనం మనస్సుల్లోంచి దీన్నంతటినీ తుడిచేయాలని చూసిన జిత్తులమారి టీడీపీ–బీజేపీ–జనసేన కూటమి గురించీ, వారి చేష్టలకు వంతపాడిన ఎన్నికల సంఘం గురించీ ప్రస్తావించుకోవాలి. వారి నుంచి ఫిర్యాదు రావటమే తడవుగా ఉన్నతాధికారులను బదిలీ చేయటం, అయిదేళ్ల నుంచి అమలవుతున్న పథకాలకు మోకాలడ్డటం,వారు కోరిన విధంగా అడ్డగోలుగా అధికారుల్ని నియమించటం... టీడీపీ పోకడలపై ఫిర్యాదు చేసినా బేఖాతరు చేయటం లేదా ఆలస్యంగా స్పందించటం తటస్థంగా వుండాల్సిన వ్యవస్థకు తగదు. 

సాక్షాత్తూ బాబే ఎన్నికల సభల్లో సీఎంనుద్దేశించి దూషించినా... ఆయన్ను రాళ్లతో కొట్టాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా బాబును ఆపే ప్రయత్నం చేయలేదు. వేరే రాష్ట్రాల్లో ప్రధానినుద్దేశించి చిన్న వ్యాఖ్య చేసినా నొచ్చుకున్న ఆ వ్యవస్థ ఏపీలో వీటన్నిటినీ ఎలా కొనసాగనిచ్చింది? అన్నీ ఒక ఎత్తయితే ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంపై బాబు అండ్‌ కో సాగించిన దుష్ప్రచారం, ప్రజలను భయపెట్టడం మరో ఎత్తు. బాబు, లోకేష్‌లపై కేసులు పెట్టాలని ఆదేశించారు సరే... కానీ ఆ తర్వాత అదే అంశంపై నిబంధనలకు విరుద్ధంగా మీడియాలో పూర్తి పేజీ ప్రకటనలిస్తే ఎందుకు సంజాయిషీ కోరలేదు? నిజానికి పోలింగ్‌ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగిందంటే అందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సంయమనమే కారణం. 

అయినదానికీ, కానిదానికీ రాయలసీమపై అభాండాలేయటం బాబు దురలవాటు. కానీ చిత్రంగా అక్కడ అత్యంత ప్రశాంతంగా పోలింగ్‌ ముగిసింది. ఇతరచోట్లే టీడీపీ బరితెగింపుతో సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఈవీఎంల ధ్వంసం, పెట్రోల్‌ బాంబులతో దాడి, పోలింగ్‌ కేంద్రాల వద్ద మహిళలను బెదిరించటం, బౌన్సర్లతో హడలెత్తించటం, పోలీస్‌ స్టేషన్‌పై దండయాత్ర చేయటం దేనికి సంకేతం? ఎన్ని అవరోధాలెదురైనా నిర్భయంగా పోటెత్తి వోటేసిన ప్రజానీకం అభీష్టానిదే అంతిమ విజయం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement