విలన్‌ డెన్‌లో విదూషకుడు! | Sakshi Editorial On Chandrababu Politics In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

విలన్‌ డెన్‌లో విదూషకుడు!

Published Sun, Mar 17 2024 3:36 AM | Last Updated on Sun, Mar 17 2024 1:30 PM

Sakshi Editorial On Chandrababu Politics In Andhra Pradesh

జనతంత్రం

శంఖం మోగింది. యుద్ధం మొదలైంది. ఎన్నికల ప్రకటనకు కొన్ని గంటల ముందుగానే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల జాబితాను పూర్తిగా ప్రకటించింది. జాతీయ స్థాయిలోనే ఈ ఘనత సాధించిన మొదటి పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ. ఒక్క అనకాపల్లి లోక్‌సభ అభ్యర్థిని మాత్రమే పెండింగ్‌లో పెట్టింది. ఈ దూకుడు వల్ల పోల్‌ పొజిషన్‌లో దానికి అడ్వాంటేజ్‌ దక్కినట్టే.

విప్లవాత్మక ఆలోచనలతో మరో ఘనతను కూడా అది సొంతం చేసుకున్నది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలున్నాయి. ఈ రెండొందల స్థానాల్లో వంద స్థానాలను బలహీనవర్గాలకు కేటాయించి రాజకీయ ప్రపంచాన్ని వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆశ్చర్యంలో ముంచెత్తారు. సామాజిక న్యాయం తమ నినాదం మాత్రమే కాదు, విధానం కూడానని ఆయన చేతల ద్వారా మరోసారి నిరూపించుకున్నారు.

బీసీ వర్గాలకు 48 శాసనసభ స్థానాలు, 11 లోక్‌సభ స్థానాలను వైసీపీ కేటాయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 294 అసెంబ్లీ సీట్లు, 42 లోక్‌సభ సీట్లు ఉన్నప్పుడు కూడా బీసీలకు ఈ సంఖ్యలో సీట్ల కేటాయింపు ఎప్పుడూ జరగలేదు. బీసీ అంటే బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదు, బ్యాక్‌ బోన్‌ క్లాసని తరుచూ జగన్‌ మోహన్‌ రెడ్డి చెప్పే మాట. ఆ మాటను చేతల్లో చూపించారు. తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా తన కోటాలో ఉన్న 144 సీట్లలో 128 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

అందులో 24 స్థానాలు మాత్రమే బీసీలకు దక్కాయి. ఆ పార్టీ కోటాలో ఇంకో 16 స్థానాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. జనసేన పోటీ చేసే 21 స్థానాల్లో ఏడుగురు అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించారు. ఇందులో ఒక్క బీసీకే చోటు దక్కింది. మిగిలిన పధ్నాలుగులో ఇదే నిష్పత్తి కొనసాగుతుందో, పెరుగుతుందో వేచిచూడాలి. బీజేపీకి కేటాయించిన 10 సీట్ల అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు.


కూటమి తరఫున ఇంకో నలభై సీట్లకు అభ్యర్థులను ఎంపిక చేయవలసి ఉన్నది. ఇందులో 23 స్థానాలను బీసీలకు కేటాయించగలిగితేనే వైసీపీ బీసీ స్కోర్‌ను అది చేరుకోగలుగుతుంది. బ్రహ్మాండం బద్దలైతే తప్ప అది సాధ్యమయ్యే పనికాదు. ముస్లిం మైనారిటీలకు వైసీపీ 7 అసెంబ్లీ సీట్లను కేటాయించింది. కూటమి తరఫున ఇప్పటికి ముగ్గురే ఎంపికయ్యారు. మిగిలిన 40లో నాలుగు స్థానాలు దక్కే అవకాశాలు మృగ్యం. ఏకంగా 11 లోక్‌సభ స్థానాలకు బీసీ అభ్యర్థులనే వైసీపీ ఎంపిక చేసింది. ఈ రికార్డును అందుకోవడం కూడా సాధ్యమయ్యే పని కాదు.

కూటమి కట్టిన తర్వాత ప్రచారాన్ని పరుగెత్తించగల ఒక శుభ శకునం కోసం బాబు ఎదురుచూస్తున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న తాడేపల్లిగూడెం సభ అట్టర్‌ఫ్లాప్‌ కావడంతో తెలుగుదేశం శిబిరం డీలా పడిపోయింది. ఇప్పుడు ప్రధానమంత్రి పేరుతోనైనా చిలకలూరిపేట సభ సక్సెస్‌ చేయాలని ఆ పార్టీ శ్రేణులు చెమటోడ్చుతున్నాయి. మొత్తం 175 నియోజక వర్గాల నుంచి జనసమీకరణ చేస్తున్నారు.

‘సిద్ధం’ పేరిట వైసీపీ నిర్వహించిన నాలుగు ప్రాంతీయ సభలు చరిత్ర సృష్టించడం టీడీపీ కూటమికి పెనుసవాల్‌గా మారింది. ఒక్కో సభకు యాభై కంటే తక్కువ నియోజకవర్గాల నుంచే అభిమానుల సమీకరణ జరిగింది. మొదటి రెండు సభలు ఐదు లక్షల మార్కును దాటితే, చివరి రెండు సభలు పది లక్షల మార్కును దాటాయి. జాతీయ స్థాయిలోనే ఇదొక రికార్డు. రాష్ట్రవ్యాప్త సమీకరణ చేస్తే తప్ప గతంలో ఎన్నడూ కూడా ఐదు లక్షల పైచిలుకు జనసమీకరణ జరగలేదు.

ఇప్పుడు ప్రధాని సభ టీడీపీ కూటమికి జీవన్మరణ సమస్యగా మారింది. అందుకే రాష్ట్రవ్యాప్త సమీకరణకు టార్గెట్లు పెట్టారు. రెండు మూడు లక్షలమంది హాజరైనా సరే యెల్లో మీడియా సహకారంతో సభ విజయవంతమైనట్టు ప్రకటించుకోవచ్చని ప్రయాసపడుతున్నారు. నరేంద్రమోదీ రూపంలో ఓ శుభశకునం కోసం ఎదురుచూస్తున్న కూటమికి అమిత్‌ షా రూపంలో అపశకునం ఎదురైంది.

అది కూడా సరిగ్గా ఎన్నికల ప్రకటనకు ఒకరోజు ముందు! శుక్రవారం నాడు ఢిల్లీలో జరిగిన ‘ఇండియా టుడే’ కాన్‌క్లేవ్‌లో అమిత్‌ షా పాల్గొన్నారు. ‘ప్రధానిని టెర్రరిస్టని విమర్శించిన చంద్రబాబుతో మీరెలా పొత్తుపెట్టుకున్నార’న్న ప్రశ్నకు అమిత్‌ షా బదులిచ్చారు. ‘అలా అని ఆయనే ఎన్డీయే నుంచి వెళ్లిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు బుద్ధొచ్చింది. మళ్లీ మా దగ్గరకు వచ్చాడు’ అనగానే అక్కడున్న అతిథులందరూ పడిపడి నవ్వడం కనిపించింది. ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబు పరువుపై పంచనామా జరిగింది.

ఇదే కాన్‌క్లేవ్‌లో జగన్‌మోహన్‌ రెడ్డి ప్రస్తావన వచ్చినప్పుడు అమిత్‌ షా హుందాగా మాట్లాడారు. ఒక వ్యక్తి ఇతరుల నుంచి గౌరవాన్ని పొందాలంటే ఆ వ్యక్తికి నిబద్ధత, క్యారెక్టర్‌ ఎంత ముఖ్యమో ఈ ఘటన ఎత్తిచూపింది. ‘పార్లమెంట్‌లో కొన్ని బిల్లులకు వైసీపీ మద్దతు ఇచ్చింది కదా... మరి ఆ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకోలేద’ని అమిత్‌ షాను యాంకర్‌ ప్రశ్నించారు.

‘‘మేం పెట్టిన ప్రతి బిల్లుకూ ఆ పార్టీ మద్దతు ఇవ్వలేదు. కొన్నిటికి మాత్రమే ఇచ్చింది. అది కూడా ఆ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉంటేనే ఇచ్చింది తప్ప బీజేపీ కోసం కాద’’ని అమిత్‌ షా చెప్పారు. అమిత్‌ షా మాటల సారాంశాన్ని విడమర్చి చెప్పుకుంటే చంద్రబాబు, జగన్‌మోహన్‌ రెడ్డిల వ్యక్తిత్వం మధ్యన ఉన్న తేడా స్పష్టంగా అర్థమవుతుంది.

చంద్రబాబుకు సిద్ధాంతాలతో, రాద్ధాంతాలతో సంబంధం లేదు. అవకాశవాది! అవసరం ఉంటే వస్తాడు. లేకపోతే వెళ్లిపోతాడని అమిత్‌ షా భావన. జగన్‌మోహన్‌ రెడ్డికి సైద్ధాంతిక నిబద్ధత ఉన్నది. ఆ పార్టీ విధానాలకు అనుగుణమైతే మద్దతు ఇస్తారు. లేకపోతే లేదు. సిద్ధాంతపరంగా ఆయన పార్టీకీ, మాకూ పొత్తు పొసగదని కూడా ఆయన పరోక్షంగా చెప్పినట్టు! మనం సినిమాల్లో చూస్తూ వుంటాం, విలన్‌ డెన్‌లో ఉండే విదూషక క్యారెక్టర్‌కు ఆ డెన్‌లోనే ఏపాటి గౌరవం ఉంటుందో! చంద్రబాబు పరిస్థితి కూడా అంతే! ఎన్డీఏ కూటమిలో చేరినా, కూటమి సభ్యుల దృష్టిలో ఆయనో విదూషకుడు, అసందర్భ ప్రేలాపి, అవకాశవాది.

అవకాశవాదంతో అటూ ఇటూ తిరిగినా, బీజేపీ ప్రవచించే పెట్టుబడిదారీ అభివృద్ధి నమూనాతో చంద్రబాబుకు కెమిస్ట్రీ బాగానే కుదురుతుంది. ఈ నమూనా వ్యవస్థలో అధికారంలో ఉన్నవాడు పెత్తందారీ శక్తుల భజంత్రీగా మారితే భారీగా వెనకేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ వెసులుబాటును పద్నాలుగేళ్లపాటు బాబు బాగానే ఒడిసిపట్టుకున్నాడు. కొద్దిమంది పెట్టుబడిదారుల అభివృద్ధే దేశాభివృద్ధిగా, వారి పెరుగుదలే దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుదలగా పరిగణించే బీజేపీ శిబిరమే చంద్రబాబుకు సహజ ఆవాసం.

అందుకే మూడుసార్లు విడాకులు తీసుకున్నా మళ్లీ నాలుగోసారి అదే పార్టీని మనువాడేందుకు ఆయన ఏమాత్రం సిగ్గుపడలేదు. పైగా వాజ్‌పేయి కార్గిల్‌ ఊపుమీద ఉన్నప్పుడు, మోదీ గుజరాత్‌ మోడల్‌ ఊపుమీద ఉన్నప్పుడు వారి గాలితో గెలిచిన అనుభవం బాబుది. ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి బలహీనంగా కన్పిస్తున్నందువల్ల మళ్లీ మోదీ గాలివాటు బాబుకు అవసరమైంది. అన్నిటినీ మించి తరుముకొస్తున్న అవినీతి కేసుల నుంచి రాబోయే కేంద్ర ప్రభుత్వం ఆయన్ను కాపాడాలి. ఆ రాబోయే ప్రభుత్వం మోదీ సర్కారేనని బాబు నమ్ముతున్నారు.

దేశంలో చాలామందికి బాబుకున్న అభిప్రాయమే ఉండవచ్చు. ప్రతిపక్ష శిబిరం బాగా బలహీనంగా కనిపించడం అందుకు ఒక కారణం కావచ్చు. స్వతంత్ర మీడియా సంపూర్ణంగా అంతర్ధానం కావడం మరో కారణం కావచ్చు. ఈ కారణాల వల్ల, దేశానికి అన్నంపెట్టే రైతు తన పంటకు చట్టబద్ధమైన మద్దతు ధర కావాలని ఎలుగెత్తడం మనకు న్యాయమైన కోర్కెగా కనిపించడం లేదు.

రోజురోజుకూ వేలాదిమంది యువకులు నిరుద్యోగ సైన్యంలో చేరిపోతున్నా మన కళ్లకు వికసిత భారత విశ్వరూపమే కనిపిస్తున్నది. తరతరాలుగా ఈ నేలపైనే పుట్టి ఈ నేలపైనే శ్వాసిస్తున్న కోట్లాదిమంది ‘మైనారిటీ’ ముద్రకు భయపడి వణికిపోతుంటే విజయోద్వేగంతో మన హృదయాలు ఉప్పొంగుతున్నవి.

కనుక చాలామంది మళ్లీ మోదీయే గెలుస్తాడని అనుకుంటే అనుకోవచ్చు. వారికా స్వేచ్ఛ ఉన్నది. మన బాబు కూడా ఆ గుంపులోని గోవిందుడే! ఉత్తరాది మోదీ గాలి అంతో ఇంతో దండకారణ్యాన్ని దాటుకుని రాకపోతుందా, తనను కరుణించకపోతుందా అనే ఆశ ఆయనలో మిణుకుమిణుకుమంటూ ఉండవచ్చు. కానీ తూరుపు కనుమలది తలలు వంచే నైజం కాదు. ఉత్తరాదిలో లేనిదీ... ఏపీలో ఉన్నదీ ఒక ప్రత్యామ్నాయ కార్యక్రమం.

పేదల సాధికారతే తారకమంత్రంగా సాగుతున్న ప్రభుత్వ ప్రాయోజిత విప్లవోద్యమం. భారత రాజ్యాంగ స్ఫూర్తిని తు.చ. తప్పకుండా అమలుచేస్తూ, ఆ రాజ్యాంగ కర్తను నగరం నడిబొడ్డున విశ్వరూపంతో నిలబెట్టిన రాష్ట్రమిది. ఆ భారత రాజ్యాంగాన్ని మార్చాలంటే కేంద్రానికి పెద్ద ఎత్తున సీట్లు కావాలి. అందుకు కూటములు కావాలి. రాజ్యాంగ రక్షణ కవచంతో సాధికారత సంతరించుకుంటున్న ప్రజలు ఈ ప్రయత్నాలను ఓడిస్తారు. ఆ కూటములనూ ఓడిస్తారు.

భారతదేశ ఉజ్వల భవిష్యత్తును గానం చేసిన విశ్వకవి రవీంద్రుని కవిత అందరికీ తెలిసిందే. ‘‘ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనుషులు తలెత్తుకుని తిరుగుతారో, ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా ఉంటుందో, ఎక్కడ సంకుచిత భావాలతో సమాజం ముక్కలుగా విడిపోదో... ఓ తండ్రీ! అటువంటి స్వర్గసీమకు నా దేశాన్ని తీసుకుని వెళ్లు’’. కవీంద్రుని కలను నిజం చేసే శక్తి మన రాజ్యాంగానికి ఉన్నది.

అటువంటి రాజ్యాంగాన్ని మార్చి అసమానతలకు, భయం బతుకులకు బాటలు వేసే ప్రయత్నాలను ఇక్కడి ప్రజలు సహించే పరిస్థితి ఉండదు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుకు మార్గదర్శకాలను విడుదల చేసిన నేపథ్యంలో రాజ్యాంగ మార్పుల చర్చ మళ్లీ ముందుకొచ్చింది. భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్నే మార్చే సవరణలు చెల్లబోవని గతంలోనే సుప్రీంకోర్టు చాటి చెప్పింది. ప్రస్తుత చట్టం (సీఏఏ) పౌరసత్వానికి మత ప్రాతిపదికను రుద్దుతున్నదని విమర్శకులు గట్టిగా భావిస్తున్నారు. ఇది రాజ్యాంగ లౌకిక స్వభావానికి విరుద్ధం కనుక చెల్లదని వారి వాదన. ఈ వ్యాజ్యం సుప్రీంకోర్టు విచారణకు రాబోతున్నది.

ఒకవేళ న్యాయస్థానం కొట్టివేస్తే భారీ మెజారిటీతో వచ్చే ప్రభుత్వం కొత్త రాజ్యాంగాన్ని ముందుకు తేబోతున్నదని విమర్శకులు అనుమానిస్తున్నారు. మన దేశంలోనే కాదు, ప్రపంచమంతటా దీనిపై విస్తృతమైన చర్చ జరుగుతున్నది. ఇంత గంభీరమైన అంశంపై నాలుగోసారి బీజేపీతో జతకట్టిన చంద్రబాబు ఎంత సింపుల్‌గా సమాధానం చెబుతున్నారో చూడండి.

‘‘ఏ దేశానికి వెళ్లినా సిటిజన్‌షిప్‌ అనేది పారదర్శకంగా ఉంటుంది. అక్కడి నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాల’’ని తేల్చేశారు. కానీ, మత ప్రాతిపదిక అవసరమా అనే కీలక విషయం జోలికి వెళ్లలేదు. పోనీ, ఈ ప్రాతిపదిక చట్టంలో చెప్పినట్టు మూడు దేశాలకూ, నిర్ణీత కాలానికే పరిమితం కావాలి. అంతకుమించి అనుమతించేది లేదని చెప్పినా అదొక లెక్క. కానీ మన నాయకుడు బ్లాంక్‌ చెక్‌ ఇచ్చేశాడు. అంతే మరి! విలన్‌ డెన్‌లో చేరిన విదూషకుల పరిస్థితి ఇలాగే ఉంటుంది.

వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement