శ్రీకాకుళం అర్బన్: ఆంధ్రాబ్యాంకు గ్రామీణాభివృద్ధి సంస్థ 2014-15వ సంవత్సరంలో ఇచ్చిన శిక్షణ కార్యక్రమాలకు గాను కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ నుంచి ఉత్తమ సంస్థగా గుర్తింపు పొందిందని సంస్థ డెరైక్టర్ బగాన శ్రీనివాసరావు చెప్పారు. శ్రీకాకుళంలోని ఆంధ్రా బ్యాంకు గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అత్యుత్తమ గుర్తింపు అయిన ‘ఏఏ’ గ్రేడ్ రేటింగ్ పొందినట్టు చెప్పారు.
ఆంధ్రాబ్యాంకు గ్రామీణాభివృద్ధి సంస్థ(ఆబర్డ్)ను శ్రీకాకుళంలో 2002లో ప్రారంభించినట్టు తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ 333 నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహించి జిల్లాలోని 8,325 మంది నిరుద్యోగ యువతీ, యువకులకు శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. వీరిలో 5,390 మంది యువతీ, యువకులు వారు పొందిన శిక్షణ ద్వారా జీవితంలో స్థిరపడి, అధిక ఆదాయం పొందుతున్నట్టు తెలిపారు. 2015-16 సంవత్సరంలో 32 శిక్షణ కార్యక్రమాలలో 816 మందికి శిక్షణ ఇచ్చామన్నారు.
గ్రామీణ యువకులకు సెల్‌ఫోన్ సర్వీసింగ్, కారు డ్రైవింగ్, కంప్యూటర్ కోర్సులు, మహిళలకు టైలరింగ్, బ్యూటీపార్లర్ మేనేజ్‌మెంట్, జ్యూట్ బ్యాగుల తయారీ, సాఫ్ట్‌టాయ్స్ తదితర వాటిలో శిక్షణ ఇచ్చినట్టు పేర్కొన్నారు. రైతులకు పశుపోషణ, గొర్రెల పెంపకం, పుట్టగొడుగుల పెంపకం, వర్మీకంపోస్ట్ తయారీ తదితర వాటిలో శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమాలన్నీ ఉచిత వసతి, భోజన సౌకర్యాలతో ఇస్తున్నామన్నారు. 2016-17 సంవత్సరంలో 30 శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి 750 మంది నిరుద్యోగ యువతీ, యువకులకు, రైతులకు శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు.
సంస్థ ద్వారా జనచేతన ఆర్థిక అక్షరాస్యత, రుణ అవగాహన కేంద్రాన్ని నెలకొల్పి సమన్వయకర్తగా ఆర్‌ఆర్‌ఎం పట్నాయక్‌ను నియమించామన్నారు. ఈ కేంద్రం ద్వారా బ్యాంకులు అందిస్తున్న పలు రకాల రుణ సదుపాయాలు, పొదుపు పథకాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన పలు రకాల సంక్షేమ పథకాలు, రిజర్వ్‌బ్యాంకు నిబంధనలను గ్రామీణ ప్రాంతాల్లో సభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. సంస్థలో ఏదైనా శిక్షణ పొందాలనుకున్నవారు 08942-211216, 222369 నంబర్లకు ఫోన్ చేసి వారి పేర్లను నమోదు చేసుకోవచ్చని ఆయన సూచించారు. సమావేశంలో సిబ్బంది బి.ప్రసాదరావు, కె.హేమకుమార్, ఎం.జ్యోతి పాల్గొన్నారు.
ఉత్తమ సంస్థగా ‘ఆబర్డ్’
Published Wed, Apr 20 2016 12:46 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement