
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గడంతో విద్యుత్ వినియోగం ఒక్కసారిగా పడిపోయింది. వారం క్రితం వరకూ రోజుకు 187 మిలియన్ యూనిట్లున్న డిమాండ్ శుక్రవారం 157 మిలియన్ యూనిట్లకు తగ్గింది. వినియోగం పరిస్థితి ఇలా ఉంటే.. పవన విద్యుత్ ఉత్పత్తి మాత్రం అనూహ్యంగా పెరిగింది. రాష్ట్ర విద్యుత్ సంస్థలు మాత్రం అత్యధిక ధర చెల్లించి ప్రైవేటు పవన విద్యుత్‌నే కొనేందుకే మొగ్గు చూపుతున్నాయి. దీనివల్ల చౌకగా అందే ఏపీ జెన్‌కో థర్మల్ విద్యుత్‌ను తగ్గించాల్సిన పరిస్థితేర్పడింది.
సంప్రదాయేతర, పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నందున పవన, సౌర విద్యుత్‌ను తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే వినియోగంలో కేవలం 5 శాతమే ఈ విద్యుత్‌ను తీసుకోవాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వ ఒత్తిడి కారణంగా పెద్ద ఎత్తున తీసుకుంటున్నారు. ఇందుకోసం ఏపీజెన్‌కో థర్మల్ యూనిట్లలో ఉత్పత్తికి అనివార్యంగా కోత పెడుతున్నారు.
వారంక్రితం రోజుకు 15 మిలియన్ యూనిట్లున్న పవన విద్యుత్.. శుక్రవారం 50 మిలియన్ యూనిట్లకు చేరగా.. మరోవైపు సౌరవిద్యుత్ 10 మిలియన్ యూనిట్ల వరకు అందుతోంది. కేంద్ర విద్యుత్ వాటాలో ప్రస్తుతం 25 మిలియన్ యూనిట్ల వరకు విద్యుత్ లభిస్తోంది. ఇంకోవైపు దీర్ఘకాలిక విద్యుత్ ఒప్పందాలున్న స్వతంత్ర విద్యుత్ సంస్థలు(ఐపీపీ) 30 మిలియన్ యూనిట్ల వరకు అందిస్తున్నాయి. మొత్తం కలిపి 115 మిలియన్ యూనిట్ల విద్యుత్ లభిస్తోంది. ఈ నేపథ్యంలో డిమాండ్‌కు అవసరమైన మిగిలిన 42 మిలియన్ యూనిట్లను మాత్రమే థర్మల్ విద్యుత్‌ను ప్రోత్సహిస్తున్నారు.
థర్మల్ ఉత్పత్తికి కోత..
ఈ నేపథ్యంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి కోత పెట్టారు. 1,600 మెగావాట్ల సామర్థ్యమున్న కృష్ణపట్నంలోని ఒక యూనిట్‌లో ఉత్పత్తి పూర్తిగా తగ్గించగా.. మరో యూనిట్‌లో అరకొర ఉత్పత్తి జరుగుతోంది. ఈ కేంద్రం నుంచి రోజుకు 45 మి. యూనిట్లు అందే వీలుంది. కానీ 20 మిలియన్ యూనిట్లు కూడా తీసుకోవట్లేదు. విజయవాడ, కడప థర్మల్ విద్యుత్ కేంద్రాల్లోనూ ఉత్పత్తికి భారీగా కోత విధించారు.
ఏపీ జెన్‌కో థర్మల్ విద్యుత్ 105 మిలియన్ యూనిట్లు అందే వీలున్నా.. కేవలం 42 మిలియన్ యూనిట్లే తీసుకుంటున్నారు. జెన్‌కో విద్యుత్ ధర యూనిట్ సగటున రూ.4 ఉంటుంది. ప్రైవేటు సోలార్ విద్యుత్ ధర యూనిట్ రూ.5.25 వరకూ ఉంది. నిబంధనల ప్రకారం ముందుగా తక్కువ ధర ఉన్న విద్యుత్ ప్లాంట్లకే ప్రాధాన్యమివ్వాలి. ప్రైవేటు విద్యుత్‌కోసం అడ్డగోలుగా వ్యవహరించడం వల్ల థర్మల్ ప్లాంట్లు ఆర్థిక నష్టాల్లోకి వెళ్లే వీలుందని, అంతిమంగా వినియోగదారులపైనా భారం పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment