
కార్డులు ఇవ్వడానికి వెళ్తూ వరుడి మృతి
గుమ్మలక్ష్మీపురం: విజయనగరం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తన పెళ్లి కార్డులు ఇవ్వడానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. గుమ్మలక్ష్మీపురం మండలంలో ఆదివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. బొబ్బిలి మండలం రామన్న దొరవలసకు చెందిన రాజు (25)కు ఈ నెల 28న పెళ్లి నిశ్చయమైంది. ఈ క్రమంలో కార్డులు పెట్టి పెళ్లికి ఆహ్వానించడానికి మరో యువకుడితో కలిసి బైక్‌పై వెళ్లాడు.
దురదృష్టవశాత్తూ అమిటి జంక్షన్ వద్ద వీరి బైక్ అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో రాజు మృతిచెందగా, అతని వెంట వెళ్లిన మరో వ్యక్తికి గాయాలయ్యాయి. పెళ్లి నిశ్చయం అయి శుభలేఖలు పంచడానికి వెళ్లిన రాజు మృతిచెందాడని తెలియగానే అతడి కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.