పెరిగిన నిత్యావసర ధరలు, కంట తడిపెట్టిస్తున్న కూరగాయలు, సగటు మనిషి జీవనం ఇబ్బందికరంగా మారడంతో నిరసన తెలిపేందుకు వివిధ రాజకీయ పక్షాల నేతృత్వంలో గళమెత్తిన ప్రజల పట్ల పోలీసులు తమదైన శైలిలో వ్యవహరించారు. శుక్రవారం పోలీసు పరేడ్ గ్రౌండ్‌కు సమీపంలో మధ్యాహ్నం 12.10నిమిషాలకు జరిగిన ఈ సంఘటన ప్రజా సంఘాలను కలచి వేసింది. తమ సమస్యలపై నినదిస్తూ ర్యాలీగా వస్తున్న ఆందోళనకారులను అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో మండిపడిన ఉద్యమకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అప్రమత్తమైన ఏఆర్ డీఎస్పీ భరత్ వారిని హెచ్చరించారు. కొంతమంది పోలీసులు లాఠీలు ఝలిపించి ముందుకు ఉరికే ప్రయత్నం చేశారు. ఆగ్రహించిన ప్రజలు వారిపై రాళ్లు రువ్వారు. కట్టెలతో ఎదుర్కొనే ప్రయత్నం చేశారు.
ఈ సంఘటనతో రెచ్చిపోయిన పోలీసులు లాఠీచార్జికి ఉపక్రమించారు. మరో మారు హెచ్చరికలు చేసి టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇది మరీ ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రతిఘటన తీవ్రమైంది...వెంటనే పోలీసులు నాలుగు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అయినా ప్రజాసంఘాల వారు తగ్గలేదు. కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో వారిని ఎదుర్కొనే ప్రయత్నం చేశారు. దీనితో ‘కాప్స్’ నేరుగా కాల్పులకు దిగారు. ఈ సంఘటనలో ఒక వ్యక్తి గాయపడ్డాడు. మిగతావారు పరుగులు తీశారు. అక్కడ భీకర యుద్ధవాతావరణం తలపించింది. పోలీసుల బలప్రయోగంతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. ఎస్పీ నాగేంద్రకుమార్ రంగంలోకి దిగి చక్కదిద్దారు.
మహబూబ్‌నగర్ క్రైం, న్యూస్‌లైన్: మరి కొన్ని వారాల్లో పోలీసు శాఖలోకి ఉన్నతాధికారులుగా బాధ్యతలు చేపట్టనున్న ట్రైనీ ఐపీఎస్‌లకు జిల్లాకేంద్రంలోని పోలీసు మైదానంలో ఇక్కడి పోలీస్ యంత్రాంగం వివిధ అంశాలపై ప్రత్యక్ష శిక్షణ ఇచ్చింది.
హైద్రాబాద్‌లోని శివరాంపల్లి సర్దార్ వల్లభాయి పటేల్ నేషనల్ పోలీసు శిక్షణ అకాడమీలో ఇండియన్ పోలీసు సర్వీసెస్‌లో శిక్షణ పొందుతున్న 66వ బ్యాచ్‌కు చెందిన 161 మందిలో శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లాకు 51 మంది ట్రైనీ ఐపిఎస్‌లు వచ్చారు. వారికి ఉన్నాతాధికారులు పోలీసు వ్యవస్థపై ఆవగాహన కల్పించారు. పోలీసు చట్టాలు, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర, ప్రజలతో సంబంధాలు, నేరాలను అదుపు చేసేందుకు తీసుకునే చర్యలు, పోలీసు సంక్షేమనికి తీసుకోవలసిన ప్రణాళికలు వంటి వివిధ అంశాలపై బోధించారు.జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అల్లర్లు, ధర్నాలు చోటు చేసుకుంటే వాటిని ఎలా ఎదుర్కోవాలో పోలీసులే రెండు జట్లుగా విడిపోయి మాక్ లాఠీచార్జి, ఫైరింగ్, టియర్ గ్యాస్ ప్రయోగం వంటివి చేసి ఆందోళనను కళ్లకు కట్టినట్లు చూపారు. దీంట్లో ఒక ృందం పోలీసులు అచ్చం ప్రజా సంఘాల వారిగా వేషాలు వేసుకొని ఆందోళన చేపట్టారు. ఈ అంశం ట్రైనీ ఐపీఎస్‌లను విశేషంగా ఆకట్టుకుంది.
ఆకట్టుకున్న డాగ్‌స్క్వాడ్...
డాగ్‌స్కాడ్‌తో నిర్వహించిన పేలుడు పదార్థా ల గుర్తింపు , వాటిని నిర్వీర్యం చేయడం సవి వరంగా చూపారు . అనంతరం డీసీఆర్‌బీ వి భాగంలోని పోలీస్ వ్యవస్థకు అనుసంధానం చేసిన వ్యవస్థను క్షుణంగా ట్రైనీలు పరిశీలించారు. ఎస్‌బీ శాఖాధికారులతో నేరాల అదుపులోకి తీసుకుంటున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం వన్‌టౌన పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఎఫ్‌ఐఆర్‌ల నమోదు, ఫి ర్యాదుల స్వీకరణ వంటి అంశాలతోపాటు మహిళలకు రక్షణగా ఏర్పాటు చేసిన రక్షిత అప్లికేషన్ వివరాలను తెలుసుకున్నారు.
శాంతి భద్రతల పరిరక్షణలో
పోలీస్ భేష్...
అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావే శంలో జిల్లా కలెక్టర్ గిరిజాశంకర్‌తోపాటు ఎస్పీ నాగేంద్రకుమార్ సమావేశమయ్యారు. పౌరుల హక్కులు, ప్రజాస్వామ్యబద్దంగా ఏర్పాటు చేసిన చట్టాలపై ప్రత్యేకంగా కలెక్టర్ వారితో చర్చించారు. తర్వాత పిల్లలమర్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ట్రేనర్ డీఐజీ ప్రవీణ్‌కుమార్‌సిన్హా మాట్లాడుతూ దేశంలోనే ఆంధ్ర ప్రదేశ్ నేరాలను అదుపు చేయడంతోపాటు శాంతిభద్రతలు కాపాడడంలో ముందంజలో ఉందని చెప్పారు. సమాజంలో శాంతిభద్రతలు కాపాడడమే పోలీసుల ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ సందర్భంగా ట్రైనీ ఐపీఎస్‌లు కొందరు ‘నూస్‌లైన్’ వద్ద తమ అభిప్రాయాలను పంచుకున్నారు. వారి మాటల్లోనే...
మహిళలల ప్రాధాన్యం పెరగాలి
మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలు సర్వసాధారణం అయ్యాయి. వీటిని నిరోధించేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వారికి రక్షణగా మహిళా అధికారులే పోలీస్ శాఖలోఉంటే బాధితులకు త్వరితగతిన న్యాయం చేసే వీలు కలుగుతుందనే ఆశయంతోనే పోలీసు శాఖలో చేరాను.
- ఇందిరాముఖర్జీ, కోల్‌కత
ప్రజలకు సేవచేసేందుకే..
పోలీస్‌శాఖలో ఉన్నత అధికారుల స్థానంలో ఉంటే ప్రజలకు నేరుగా సేవలందించవచ్చనే ఈ శాఖలో చేరాను. యువత కూడా చెడుమార్గాలవైపు పయనించకుండా సమాజానికి సేవ చేసే భాగ్యం పోలీస్‌శాఖలో కలుగుతుందని గుర్తించాలి. ప్రతి ఒక్కరు ఆ దిశగా కృషి చేయాలి.
- రాహుల్‌తిరుపతి, అయోధ్య, ఉత్తరప్రదేశ్
నా తండ్రి కల సాకారమైంది..
నాకు ఇంజనీర్ కావాలని ఉన్నా మా నాన్నకు నన్ను పోలీసు అధికారిని చేయాలని ఉండేది. తనకు పోలీస్ వృత్తి అంటే చాలా ఇష్టం. ఆ మేరకు ఇంజనీరింగ్‌ను పక్కకు పెట్టి కష్టమైన పోలీస్ శాఖలో ఉన్నత అధికారి కావాలనే నా తండ్రి అశయం కోసం ఈ ఉద్యోగం సాధించాను. కష్టపడి చదివితే సాధించలేనిది లేదనే విషయాన్ని రుజువు చేశాను.
- రామకృష్ణ, విజయవాడ
డ్రస్సుపై మమకారంతోనే..
పోలీసు డ్రస్సుపై మమకారంతో ఈ శాఖలోకి రాావాలనుకున్నా. అందుకే ఐపీఎస్‌కు ప్రిపేర్ అయి సెలెక్ట్ అయ్యాను. సమాజంలో మార్పులు తెచ్చేందుకు నా వంతు కృషి చేస్తాను. పోలీస్ వ్యవస్థ అంటే ప్రజల్లో ఉన్న భయాన్ని పూర్తిగా తొలగించి ప్రజలకు పోలీస్ వ్యవస్థను దగ్గరికి చేరుస్తా. పోలీస్ చేరుందుకు మహిళలు ఎటువంటి భాయాందోళనకు లోను కావాల్సిన అవసరం లేదు.
- దివ్య, తమిళనాడు
విరిగిన లాఠీ... పేలిన తుపాకీ
Published Sat, Feb 1 2014 4:08 AM | Last Updated on Tue, Aug 21 2018 7:39 PM
Advertisement
Advertisement