నెల్లూరు (రవాణా): టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా తమ్ముళ్లకు ఝలకిచ్చారు. ఎమ్మెల్సీల ఎంపికలో జిల్లాకు మొండిచేయి చూపారు. ఎమ్మెల్సీగా అవకాశం దక్కుతుందని పలువురు ఆశావాహులు ఎదురుచూశారు. పార్టీ సీనియర్ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రలు పోటీపడ్డారు. ఎమ్మెల్సీ పదవి కోసం ఇద్దరు నేతలు అధినేత చుట్టూ ప్రదక్షణలు చేశారు. గత ఎన్నికల్లో పోటీచేసిన వ్యక్తులకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చేదిలేదని పార్టీ తీసుకున్న నిర్ణయంతో బీదాకు ఆశలు మరింత పెరిగాయి. టీడీపీకి దక్కే 3 ఎమ్మెల్సీల్లో బీద రవిచంద్ర పేరు దాదాపు ఖరారైందని జోరుగా ప్రచారం నడిచింది.
ఈ నేపథ్యంలో ఒక ఎమ్మెల్సీ భారతీయ జనతాపార్టీకి కేటాయించాల్సిందిగా ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు ప్రతిపాదనను తెర పైకి తీసుకువచ్చారు. దీంతో ఇరు పార్టీల మధ్య కొంత తర్జనభర్జన జరిగింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు బీజేపీ నేతలకు నచ్చజెప్పడంతో చివరి నిమిషం వరకు ఎమ్మెల్సీగా బీద రవిచంద్ర పేరు వినిపించింది.
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున అధినేతను కలిసేందుకు బీద తరఫున పాస్‌లు కూడా జారీచేశారు. అయితే సోమవారం పార్టీ మంత్రులు, సీనియర్ నాయకులు సమావేశం తర్వాత బీద అశలపై అధినేత నీళ్లు చల్లారు. రాయలసీమ, గోదావరి, విజయనగరం జిల్లాలకు చెందిన నేతలకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించారు. దీంతో జిల్లాకు చెందిన తెలుగు తమ్ముళ్లు చంద్రబాబు నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
గ్రూపులు కారణంగానే..
జిల్లాలో తెలుగు తమ్ముళ్లు 3 గ్రూపులుగా ఏర్పడటంతోనే ఎమ్మెల్సీ పదవి దక్కలేదనే ప్రచారం జోరుగా సాగుతుంది. జిల్లాలో తెలుగు తమ్ముళ్లు సోమిరెడ్డి, మంత్రి నారాయణ, ఆదాల గ్రూపులుగా చెలామణి అవుతున్నారు. పార్టీ కార్యక్రమాల సైతం గ్రూపుల వారీగానే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీగా బీసీలకు అవకాశం కల్పిస్తే, రెడ్డి సామాజికవర్గం దూరమవుతుందన్న కారణంతో పార్టీ అధినేత నిర్ణయాన్ని మార్చుకున్నారన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. మొదట నుంచి జిల్లాలో సీనియర్ నాయకుడిగా తనకు అవకాశం కల్పించాలని సోమిరెడ్డి పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్షంలో పదేళ్లు పార్టీని నెట్టుకువచ్చిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.
బీద మాత్రం తనకు ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తామన్న హామీతోనే గత ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్న విషయాన్ని తెరపైకి తీసకువస్తున్నారు. అయితే ఇద్దరు నేతల ఆశలపై పార్టీ అధినేత చంద్రబాబు నీళ్లు కుమ్మరించారు. వచ్చే నెలలో మరో 8 ఎమ్మెల్సీ ఖాళీలు రానున్నట్లు తెలిసింది. అయితే టీడీపీకి 5 దక్కే అవకాశం ఉంది. వాటిలో జిల్లాకు రెండు ఎమ్మెల్సీ లు కేటాయిస్తారనే ఆశల్లో తెలుగు తమ్ముళ్లు ఉన్నారు.
ఒకే ఎమ్మెల్సీ పదవి కేటాయిస్తే అప్పుడు పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతుంది. మళ్లీ ఇప్పటి మాదిరి జిల్లాలో తమ్ముళ్లు పోటీపడితే అసలు ఎమ్మెల్సీ పదవి కేటాయించకపోవచ్చన్న ప్రచారం సాగుతోంది. పార్టీ అధినేత వద్ద మంత్రి నారాయణ మాట మాత్రమే చెల్లుబాటవుతుంది. ఆయన మనసులో మాట ఏంటోనన్న విషయం బయటకు రాలేదు. మరో నెలరోజులు తెలుగు తమ్ముళ్లు ఎమ్మెల్సీ పదవి కోసం ఎదురుచూడాల్సిందే.