చీరాల్లో మహిళ దారుణ హత్య | Brutal murder of woman in sari | Sakshi
Sakshi News home page

చీరాల్లో మహిళ దారుణ హత్య

Published Tue, Jan 27 2015 8:02 AM | Last Updated on Sat, Sep 2 2017 8:21 PM

Brutal murder of woman in sari

  • గొడ్డలితో నరికి చంపిన శాడిస్టు  
  •  పరారీలో నిందితుడు
  • చీరాల: పిండి రుబ్బుకుంటున్న మహిళను పక్కింటిలో నివాసముండే ఓ యువకుడు గొడ్డలితో విచక్షణా రహితంగా తలపై నరకడంతో అక్కడికక్కడే మృతిచెందిన ఘటన చీరాల వడ్డె నాగేశ్వరరావు బజారులో సోమవారం రాత్రి జరిగింది. స్థానికులు, మృతురాలి తల్లి తెలిపిన వివరాల మేరకు...వడ్డె నాగేశ్వరరావు బజారులో చిచ్చుల మల్లిక (33) స్థానిక ఒక షేర్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తోంది. సోమవారం పని ముగించుకుని ఇంటికి చేరింది.

    ఉదయం రోడ్డుపై ఉన్న రోలు వద్ద పిండి రుబ్బుతుండగా పక్కింటిలో నివాసముండే కన్నంరెడ్డి వెంకటేశ్వర్లు అలియాస్ చిన్నా అనే యువకుడు గొడ్డలితో ఆమె తలపై నరకడంతో అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి మృతి చెందింది. హత్య చేసిన వెంటనే నిందితుడు గొడ్డలి అక్కడే వదిలి పరారయ్యాడు. చిన్నా కొంతకాలంగా శాడిస్టుగా వ్యవహరిస్తున్నాడు. ఆ ప్రాంతంలో ఉన్న మహిళలతో ఘర్షణలకు దిగి దాడులకు పాల్పడడం చివ రకు తల్లిదండ్రులను కూడా వేధించడంతో వాళ్లు సైతం ఇల్లు వదిలి మరోచోటకు వెళ్లారు.

    ఒంటరిగా ఉండే చిన్న..మృతురాలు మల్లికతో కూడా పలుమార్లు ఘర్షణకు దిగాడు. తమ స్థలంలోకి గేదెలు వె ళ్తున్నాయంటూ కొద్ది రోజులు క్రితం ఘర్షణ  పెట్టుకున్నాడు. అప్పటి నుంచి తరచూ మల్లికను చంపుతానని బెదిరించడంతో మల్లిక తల్లి, ఆమె బంధువులు నిందితుడి తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు కూడా చెప్పారు. వాళ్లు మందలించినా ఫలితం లేదు. నిందితుడు మల్లికకు సమీప బంధువు. తమ్ముడి వరుస అవుతాడు.

    మృతురాలు పదేళ్ల నుంచి భర్తతో విభేదాలు వచ్చి తన కూతురితో కలసి తల్లి వద్దే ఉంటూ కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తోంది. హత్య వార్త తెలుసుకున్న డీఎస్పీ జయరామరాజు టూ టౌన్ సీఐ అబ్దుల్ సుభాన్, ఎస్సై రామానాయక్‌లు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ జయరామరాజు మీడియాతో మాట్లాడుతూ ఒంటరిగా ఉంటున్న మహిళను దారుణంగా హతమార్చిన నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని ఆయన తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement