సీఎం టెన్షన్ | CM tension | Sakshi
Sakshi News home page

సీఎం టెన్షన్

Published Sat, Feb 14 2015 12:19 AM | Last Updated on Sat, Sep 2 2017 9:16 PM

సీఎం టెన్షన్

సీఎం టెన్షన్

మూడు రోజుల వ్యవధిలో రెండోసారి నేడు చంద్రబాబు రాక
ఈ నెల 20న ముచ్చటగా మూడోసారి రావచ్చని సంకేతాలు
ఏర్పాట్లతో ఊపిరిసలపని అధికారులు
ఒకవైపు ఆర్మీ ర్యాలీ..మరోవైపు సీఎం బందోబస్తు
పోలీసులకు తలకుమించిన భారం
కార్యాలయాల్లో పనులు జరగక ప్రజల అవస్థలు

 
శ్రీకాకుళం పాతబస్టాండ్ : అటు పౌర అధికారులు.. ఇటు పోలీసు అధికారులకు ఊపిరి సలపడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు జరగడం లేదు. రోజుల వ్యవధిలో ముఖ్యమంత్రి వరుస పర్యటనలతో జిల్లా అధికార యంత్రాంగం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మూడు రోజుల వ్యవధిలో రెండోసారి జిల్లాకు వస్తున్న సీఎం చంద్రబాబు.. ముచ్చటగా మూడోసారి ఈ నెల 20న కూడా రావచ్చని సంకేతాలు అందుతుండటంతో ఈ ఒత్తిడి భరించలేమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తప్పనిసరి పరిస్థితుల్లో పర్యటన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే కళా వెంకట్రావు తనయుడి వివాహానికి ఈ నెల 11న వచ్చిన సీఎం గంటసేపు గడిపి వెళ్లారు. అది ప్రైవేట్ పర్యటన అయినా.. సీఎం అయినందున అధికార యంత్రాంగం మొత్తం రెండు రోజుల ముందు నుంచి ఏర్పాట్లలో నిమగ్నమైంది. పర్యటన రోజు దాదాపు యంత్రాంగమంతా రేగిడి మండలంలోనే ఉంది. తిరిగి మూడు రోజుల వ్యవధిలోనే శనివారం మరోసారి సీఎం జిల్లాకు వస్తున్నారు.

అన్నీ ఒకేసారి
ఈసారి అధికారులకు మరింత ఒత్తిడి ఎదురవుతోంది. శుక్రవారం నుంచి పట్టణంలో ఆర్టీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ మొదలైంది. వేల సంఖ్యలో వచ్చిన అభ్యర్థులను అదుపు చేయడానికి పెద్ద సంఖ్యలో పోలీసులను నియమించాల్సి ఉండగా, శనివారం సీఎం పర్యటన ఉన్నందున అధికశాతం బలగాలను నరసన్నపేట, ఎచ్చెర్ల ప్రాంతాలకు తరలించారు.

ఫలితంగా ఆర్మీ ర్యాలీలో తొక్కిసలాటలు చోటుచేసుకున్నాయి. సాధారణంగా రెండో శనివారం ప్రభుత్వ కార్యాలయాల్లో పెద్దగా పనులు ఉండవు. మరుసటి రోజు ఆదివారం కూడా కావడంతో చాలామంది వారాంతంలో విశ్రాంతి కోసం సొంత ప్రాంతాలకు వెళ్లడానికి ఉత్సుకత చూపుతారు. కానీ ఈసారి ఆ అవకాశం లేకుండా సీఎం పర్యటన అడ్డురావడంతో వారంతా ఉసూరుమంటున్నారు.కాగా ఈ నెల 19 నుంచి రాష్ట్రంలో ‘నీరు-చెట్టు’ కార్యక్రమం మొదలవుతుంది. జిల్లాలో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈనెల 20న సీఎం మళ్లీ వస్తారని తెలుగుదేశం వర్గాల సమాచారం. అదే జరిగితే పది రోజుల వ్యవధిలో మూడో పర్యటన అవుతుంది.

ప్రజల్లోనూ అసంతృప్తి

సీఎం జిల్లాలో పర్యటించడం మంచిదే. ఎంతో కొంత మేలు జరుగుతుందని ప్రజలు భావిస్తారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు పలుమార్లు జిల్లాకు వస్తున్నా సామాన్య ప్రజలకు కలిగే ప్రయోజనం ఏమీ లేకుండా పోతోంది. ఇంతకు ముందు హుద్‌హుద్ తుపాను ప్రాంతాల పర్యటన పేరుతో రెండుసార్లు వచ్చిన ఆయన మొక్కుబడిగా ఒకటి రెండు ప్రాంతాలు చూసి వెళ్లిపోయారు.ఈ నెల 11 నాటి పర్యటన పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమం. ఇక శనివారం నాటి పర్యటనలోనూ పలు మార్పులు చోటు చేసుకున్నాయి.

నరసన్నపేట, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో పలు కార్యక్రమాలు ముందుగా నిర్ణయించినా, తర్వాత శ్రీకాకుళాన్ని తొలగించి ఎచ్చెర్లలోని శివానీ కళాశాలలో విద్యార్థులతో సదస్సుకే పరిమితం చేశారు. కాగా ఈ పర్యటనల ఏర్పాట్లలో అధికార యం త్రాంగం మొత్తం రోజుల తరబడి నిమగ్నం కావడంతో కార్యాలయాల్లో అధికారులు అందుబాటులో లేకుండా పోతున్నారు. ఫైళ్లు, అర్జీలు పెండింగులో ఉండిపోతున్నాయి. దీంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement