
ఏకే 47 మిస్‌ఫైర్
► అనంత కానిస్టేబుల్ కర్నూల్లో మృతి
► సీఎం బందోబస్తు కోసం వచ్చిన అంపన్న
కర్నూలు: కర్నూలు జిల్లా కల్లూరు మండలం తడకనపల్లె గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా విషాదం చోటు చేసుకుంది. ఏకే 47 తుపాకీ ప్రమాదవశాత్తూ పేలడంతో స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ బోయ అంపన్న (25) (పీసీ 3135) మరణించాడు. పోలీసుల కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా కంబదహాల్ గ్రామానికి చెందిన అంపన్న 2011లో ఏఆర్ విభాగంలో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరాడు. ప్రస్తుతం సివిల్ విభాగంలో స్పెషల్ పార్టీలో విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం తడకనపల్లె శివారులోని వామసముద్రం వద్ద సీఎం బందోబస్తు విధుల నిర్వహణ ఉన్నాడు.
మధ్యాహ్నం భోజనానికి వెళ్తున్నప్పుడు అంపన్న వద్దనున్న ఏకే 47 పేలింది. దీంతో ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. వెంటనే అక్కడున్నవారు 108 అంబులెన్స్ లో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఛాతీ ఎడమ వైపున బుల్లెట్ గాయం ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. నిర్ధారణకు సీటీ స్కాన్ కు పంపించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.